కువైత్‌కు తలనొప్పిగా మారిన పాలసీ.. ఇలాగే కొనసాగితే దేశానికే ప్రమాదమని నిపుణుల వార్నింగ్..!

ABN , First Publish Date - 2022-01-29T15:37:23+05:30 IST

దేశంలో ప్రవాసుల ప్రాబల్యం అంతకంతకు పెరుగుతుండడంతో కువైత్ ప్రభుత్వం దాన్ని కట్టడి చేసేందుకు 2017లో కువైటైజేషన్ పాలసీని తీసుకొచ్చింది. మొత్తం 43 లక్షలుగా ఉన్న ఆ దేశ జనాభాలో సుమారు 70శాతం అంటే 30 లక్షల వరకు వలసదారులు ఉన్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రవాస కార్మికుల సంఖ్య భారీగా...

కువైత్‌కు తలనొప్పిగా మారిన పాలసీ.. ఇలాగే కొనసాగితే దేశానికే ప్రమాదమని నిపుణుల వార్నింగ్..!

కువైత్ సిటీ: దేశంలో ప్రవాసుల ప్రాబల్యం అంతకంతకు పెరుగుతుండడంతో కువైత్ ప్రభుత్వం దాన్ని కట్టడి చేసేందుకు 2017లో కువైటైజేషన్ పాలసీని తీసుకొచ్చింది. మొత్తం 43 లక్షలుగా ఉన్న ఆ దేశ జనాభాలో సుమారు 70శాతం అంటే 30 లక్షల వరకు వలసదారులు ఉన్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రవాస కార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. కువైటీలకు ఉపాధి దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయా రంగాల్లో వలస కార్మికుల సంఖ్యను తగ్గించి, స్వదేశీ కార్మికులను పెంచాలనే యోచనతో కువైత్ ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. కానీ, ఇప్పుడు అదే పాలసీ ఆ దేశానికి తలనొప్పిగా మారింది. ఈ పాలసీలో భాగంగా అన్ని రంగాలు నిపుణులైన విదేశీ కార్మికులను కోల్పోతున్నాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కువైత్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. ఈ పాలసీని అమలు చేసే పనిలోనే ఉంది. దీనిలో భాగంగానే గతేడాది వివిధ రంగాలకు చెందిన సుమారు 18వేల మంది ప్రవాసులను దేశం నుంచి పంపించి వేసింది. 


ఇక కువైటైజేషన్ పాలసీని కఠినంగా అమలు చేస్తుండడం గమనిస్తున్న ప్రవాసులు భారీ సంఖ్యలో ఆ దేశం నుంచి తరలిపోతున్నారు. దీనికి తోడు రెండేళ్లుగా మహమ్మారి ప్రభావం కూడా గట్టిగానే ఉండడంతో 2021లో సుమారు 2.57లక్షల మంది వలసదారులు కువైత్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో కువైత్‌లో కార్మికుల కొరత మొదలైంది. అటు బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఇతర మంచి కంపెనీల్లో టాప్ పోస్టుల్లో ఉన్న నైపుణ్యం గల ప్రవాసులు కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు వారి స్థానాలను భర్తీ చేయడం ఆయా సంస్థలకు తలనొప్పిగా మారుతోంది. ఆ పోస్టులకు కావాల్సిన నైపుణ్యం గల స్వదేశీ కార్మికులు దొరకడం గగనంగా మారుతోందని కంపెనీలు వాపోతున్నాయి. ఆరోగ్యం, విద్య వంటి అనేక రంగాల్లో మానవ వనరుల కొరత విపరీతంగా ఉందని ఎకనామిక్ అబ్జర్వర్ పేర్కొంది. ఇక విదేశీ కార్మికులు పనిచేసిన చాలా రంగాల్లో స్వదేశీయులు పనిచేయడానికి సుముఖత చూపకపోవడంతో వారి స్థానాలను భర్తీ చేయడం సమస్యగా పరిణమిస్తోంది. 


భారీగా పెరిగిన శాలరీలు..

కువైత్‌లోని ప్రైవేట్ సెక్టార్ దాదాపు ప్రవాస కార్మికులపైనే ఆధారపడుతోంది. కానీ, కొన్నేళ్లుగా కువైటైజేషన్ పాలసీలో భాగంగా చాలా మంది వలసదారులు ఆ దేశాన్ని విడిచిపెట్టడంతో కార్మికుల కొరత మొదలైంది. అటు కువైటీలు సైతం ప్రవాసులు చేసిన చాలా జాబ్స్ చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ సమస్య మరింత తీవ్రతరమవుతోంది. ఇక కార్మికుల కొరతతో ఆటోమెటిక్‌గా శాలరీలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇతర గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ ప్రవాసులను ఆకట్టుకునేందుకు వివిధ రెసిడెన్సీ, వీసా పథకాలను అమలు చేస్తున్న సమయంలో కువైత్ విదేశీ కార్మికులను తరిమికొడుతుండడం గమనార్హం. 


ఫారిన్ వర్క్‌ఫోర్స్..

కువైత్‌లోని ప్రైవేట్ సెక్టార్‌లో సింహాభాగం ప్రవాస కార్మికులే ఉన్నారు. అక్కడి ప్రైవేట్ రంగంలో 16 లక్షల వరకు విదేశీ కార్మికులుంటే.. కేవలం 73వేల మంది మాత్రమే కువైటీలు ఉన్నారు. గతేడాదిలో ఈ రంగానికి చెందిన 2లక్షలకు పైగా వలస కార్మికులు కువైత్‌ను విడిచి వెళ్లారు. దీంతో రిటైల్, ఆతిథ్య రంగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. తీవ్ర కార్మిక కొరతను ఎదుర్కొవడంతో పాటు భారీగా శాలరీలు ఆఫర్ చేస్తున్నా పనిచేసే వారు దొరకడం లేదు. ఇలా లేబర్ కాస్ట్ పెరగడం ఆయా రంగాలు ఈ ఏడాది మొత్తం ఆర్థికంగా పుంజుకోకుండా వెనకబడేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నమాట.    

Updated Date - 2022-01-29T15:37:23+05:30 IST