కార్మిక వలసలు ఉభయతారకం

ABN , First Publish Date - 2022-03-01T07:43:03+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని తన తప్పును సరిదిద్దుకున్నారు. బిహారీ వలస కార్మికుల గురించి ఆయన చేసిన అవహేళనాత్మక వ్యాఖ్యలను పంజాబ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు...

కార్మిక వలసలు ఉభయతారకం

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని తన తప్పును సరిదిద్దుకున్నారు. బిహారీ వలస కార్మికుల గురించి ఆయన చేసిన అవహేళనాత్మక వ్యాఖ్యలను పంజాబ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో చన్ని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బి వీసాల సంఖ్యను తగ్గించేందుకు సంల్పించినప్పుడు కూడా ఇలాగే జరిగింది. అమెరికన్ల ఒత్తిడి మూలంగా వాషింగ్టన్ పాలకులు ఆ సంకల్పాన్ని విరమించుకున్నారు. బాగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ నిపుణ వలస కార్మికులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి.


నైపుణ్యం లేని కార్మికుల వలసలు కూడా ఆతిథేయి ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన మేలు చేస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలకు ప్రత్యేక నైపుణ్యాలు లేని కార్మికుల వలసల వల్ల ఆ సంపన్న దేశాల ప్రజలు అధునాతన నైపుణ్యాలు అవసరమైన కార్యకలాపాలలో నిమగ్నం కాగలుగుతున్నారు. ఉదాహరణకు బిహార్ నుంచి పంజాబ్‌కు వలస వచ్చిన అనిపుణ కార్మికులు ట్రాక్టర్ డ్రైవర్లుగా, పంటకోత, నూర్పిడి, ఇతర కాయకష్టం పనులు చేస్తున్నారు. దీనివల్ల నవీన నైపుణ్యాలు గల పంజాబ్ రైతులు మార్కెట్లో ఆయా పంటల ధరలు మొదలైన అంశాలపై తమ దృష్టిని కేంద్రీకరించగలుగుతున్నారు. నవీన వ్యవసాయ నైపుణ్యాలు అంతగా లేని కార్మికుల వలసల వల్ల పంజాబ్ రైతులు మరో ప్రయోజనం పొందుతున్నారు. మరింత భూ విస్తీర్ణంలో విస్తృతంగా వివిధ పంటలు సాగు చేయగలుగుతున్నారు. సాగుభూమి విస్తీర్ణం పెరగడంతో దిగుబడులూ పెరిగి రైతులు లబ్ధి పొందుతున్నారు. వలసవచ్చిన శ్రామికులు, రైతుల కంటే ఎక్కువగా పొలాలు దున్నడం, నాట్లు వేయడం, కోతలు, నూర్పిడి పనులు చేయగలుగుతారు. మరో ప్రయోజనమేమిటంటే ఆతిథేయి రాష్ట్రంలో వ్యవసాయ కూలీ రేట్లు తగ్గిపోతాయి.


కార్మిక వలసలు వారిని సరఫరా చేసే రాష్ట్రం లేదా దేశానికి కూడా పలు ప్రయోజనాలను సమకూర్చుతాయి. నిరుద్యోగం తగ్గిపోతుంది. బిహార్‌లో నేడు వ్యవసాయ కార్మికుని దినసరి వేతనం రూ. 400గా ఉంది. రాష్ట్రానికి చెందిన వ్యవసాయకూలీలు అత్యధిక సంఖ్యలో పంజాబ్ మొదలైన రాష్ట్రాలకు వలస వెళ్ళడం వల్ల కార్మికుల లభ్యత తగ్గిపోయింది. తత్ఫలితంగా బిహార్‌లో ఉన్నవారికి కూలీ రేట్లు పెరిగాయి. మరి కార్మికులు వలసపోకపోతే వారు పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోనే అందుబాటులో ఉండగలుగుతారు. అప్పుడు వారి కూలీరేట్లు అనివార్యంగా రూ.400 నుంచి రూ.300కి తగ్గిపోతాయి.


వలస కార్మికులు స్వదేశం లేదా స్వరాష్ట్రంలోని తమ కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి పెద్ద మొత్తాల్లో లేదా ఎంతో కొంత డబ్బును పంపడం పరిపాటి. ఉదాహరణకు కేరళ ఆర్థిక వ్యవస్థ చాలవరకు ఇలాగే గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల నుంచి అందుతున్న డబ్బుపైన ఆధారపడి ఉంది. కార్మికుల వలసలు ఆతిథేయి రాష్ట్రం/ దేశానికే కాకుండా వారిని సరఫరా చేస్తున్న రాష్ట్రాలు, దేశాలకు కూడా ఇతోధిక లబ్ధిని సమకూరుస్తున్నాయి. ఈ కారణం వల్లే చన్ని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం అనివార్యమయింది. మహారాష్ట్ర ప్రజలు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సమితి నాయకుడు రాజ్ థాకరేను ఆదరించకపోవడానికి కూడా వలస వచ్చిన వారి పట్ల ఆయన వ్యతిరేకతే కారణమని స్పష్టంగా చెప్పక తప్పదు.


వలస కార్మికులతో ఆతిథేయి దేశ ప్రాథమిక సదుపాయాలపై అనివార్యంగా అదనపు భారం పడుతుంది. దీనివల్ల ఆతిథేయి రాష్ట్రాల ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుంది. అయితే ఆయా సదుపాయాల మెరుగుదల, అభివృద్ధికి అయ్యే వ్యయం, వలస కార్మికుల వల్ల సమకూరుతున్న లబ్ధితో పోల్చినప్పుడు చాలా తక్కువేనని చెప్పవచ్చు. పంజాబ్ ఆర్థిక వ్యవస్థే ఇందుకొక నిదర్శనం. ఒక వైపరీత్యం ఏమిటంటే ఇతోధిక లబ్ధి సమకూరుస్తున్నప్పటికీ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వలస కార్మికుల పట్ల వ్యతిరేకతను రెచ్చగొట్టడం జరుగుతోంది. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయవేత్తలు స్వార్థ ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రయత్నించవచ్చుగానీ అది ఆతిథేయి రాష్ట్రాల ప్రజల శ్రేయస్సుకు ఎంతమాత్రం దోహదం చేయదు.


సాధారణ కార్మికుల విషయం అటుంచి విద్యాధికుల వలసలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. బిహార్‌కు చెందిన అనేక మంది ఐఏఎస్ అధికారులు ఢిల్లీలో గృహాలు నిర్మించుకుని, శాశ్వతంగా ఢిల్లీలో స్థిరపడుతున్నారు. దీనివల్ల వారి సేవలు స్వరాష్ట్రానికి కొరవడుతున్నాయి. బిహార్ అభివృద్ధికి నష్టం జరుగుతోంది. అదే విధంగా ఇంజనీరింగ్ పట్టభద్రులు మన దేశం నుంచి అమెరికాకు వలసపోవడం పరిపాటిగా ఉంది. ఈ వలసల వల్ల మనం అనేక విధాలుగా చాలా నష్టపోతున్నాం. మరి ఈ మేధో వలసలను అరికట్టడం ఎలా? కార్మికులను సరఫరా చేసే రాష్ట్రాలలో పాలనా పరిస్థితులు సక్రమంగా లేకపోవడం వల్లే ఈ వలసలు అనివార్యమవుతున్నాయి.


బిహార్‌కు చెందిన ఒక వ్యాపారి సూరత్‌కు వలసపోయి అక్కడ ఒక జౌళి ఫ్యాక్టరీని నెలకొల్పుతాడు. కార్మికులు కూడా బిహార్ నుంచి సూరత్‌కు వలసపోయి ఆ వ్యాపారి ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో పని చేస్తుంటారు. అలా ఫ్యాక్టరీ యజమాని, కార్మికులు ఇరువురూ బిహార్‌కు చెందినవారు. మరి ఇదే కృషిని వారు బిహర్‌లో ఎందుకు చేయలేకపోయారు? సూరత్‌కు ఎందుకు రావలసివచ్చింది? బిహార్‌లో పరిపాలన సక్రమంగా లేకపోవడం వల్లనే అని చెప్పక తప్పదు. అక్కడి బ్యూరాక్రసీ వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించి రాష్ట్రానికి మేలు చేయడానికి బదులు, వారి నుంచి స్వార్థానికి డబ్బు గుంజుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం పరిపాటి. తత్కారణంగానే బిహారీల వలసలు.


పరిష్కారమేమిటి? కార్మికులను సరఫరా చేసే రాష్ట్రాలలో పరిపాలనా పరిస్థితులను మెరుగుపరచడమే. వ్యాపారవేత్తలు, నిపుణ కార్మికులు స్వరాష్ట్రంలోనే ఉండేలా పాలనా వ్యవస్థలను తీర్చిదిద్ది సుపరిపాలనను అందించాలి. అప్పుడే కార్మికులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేయగలుగుతారు. తమ పాలన అధ్వాన్నంగా ఉన్నప్పుడు వలసలను వ్యతిరేకించడం వల్ల కార్మికులను సరఫరా చేసే రాష్ట్రాలకు ఎటువంటి ప్రయోజనం సమకూరదు. రాష్ట్రాభివృద్ధికి దోహదం జరగదు. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని వలసలను మనం స్వాగతించాలి. పాలనా పరిస్థితులను విధిగా మెరుగుపరచాలి. అప్పుడు మాత్రమే ఆర్థికాభివృద్ధి, ప్రజాసంక్షేమం సుసాధ్యమవుతాయి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2022-03-01T07:43:03+05:30 IST