ప్రసవ వేదన

ABN , First Publish Date - 2021-07-27T05:51:21+05:30 IST

ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండానే అన్నీ మన ముందుకు వస్తున్న సాంకేతిక విప్లవం వచ్చిన నేటి రోజుల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల జీవితాలు మాత్రం ఇంకా మారడం లేదు. నేటికీ ఇంకా చాలా గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేక అవస్థలు పడుతూనే ఉన్నారు.

ప్రసవ వేదన
చికిత్స కోసం తల్లి, బిడ్డను ఎడ్లబండిపై తీసుకెళ్తున్న కుటుంబసభ్యులు, అంబులెన్స్‌ సిబ్బంది.

ప్రసవం కోసం నరకయాతన అనుభవించిన మహిళ

కాలినడక వెళ్లి పురుడు పోసిన 108 అంబులెన్స్‌ సిబ్బంది

సరైన రోడ్డు సౌకర్యం లేక అవస్థలు పడుతున్న ఏజెన్సీ గ్రామాలు

సిరికొండ, జూలై 26: ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండానే అన్నీ మన ముందుకు వస్తున్న సాంకేతిక విప్లవం వచ్చిన నేటి రోజుల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల జీవితాలు మాత్రం ఇంకా మారడం లేదు. నేటికీ ఇంకా చాలా గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేక అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎప్పుడైనా వైద్యం కోసం అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే ఎడ్లబండిపైనే కొండలు, వాగులు దాటుకుంటూ నడిచి వెళ్లాల్సిన దుస్థితే నెలకొంటోంది. అలాంటి ఘటనే సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామపంచాయతీలో గల తుమ్మల్‌పాడ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇంగోలి పూజ అనే మహిళకు ఉదయం 10 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో వెంటనే ఆమె కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, అంబులెన్స్‌ ఆ గ్రామానికి రావడానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్‌ను గ్రామ శివారులో సుమారు 2 కి.మీ. దూరంలోనే నిలిపివేశారు. అయితే, పూజ పురిటినొప్పులతో విలవిల్లాడుతుండడంతో 108 అంబులెన్స్‌ ఈఎంటీ కాశినాథ్‌, పైలెట్‌ గోపినాథ్‌ కాలినడకన గ్రామానికి వెళ్లి పురుడుపోశారు. దీంతో పూజ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కుటుంబసభ్యులు ఎడ్లబండిపై తల్లీబిడ్డలను అంబులెన్స్‌ వద్దకు తీసుకురాగా అక్కడి నుంచి వారిని ఇచ్చొడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే, సరైన రోడ్డు సౌకర్యం, వాగులపై వంతెనలు లేక ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో నరకయాతన అనుభవించాల్సి వస్తోందని తుమ్మల్‌పాడ్‌ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గ్రామానికి సరైన రోడ్డు మార్గం కల్పించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-07-27T05:51:21+05:30 IST