కూలీలకు కూలేదీ?

ABN , First Publish Date - 2022-07-04T06:35:13+05:30 IST

అసలే పేదలు.. ఆపై మండే ఎండలో.. విసిగించే ఉక్కపోతలో.. ఒక్కో చుక్క నీటిని తాగుతూ వారు ఉపాధి పనులు చేశారు.

కూలీలకు కూలేదీ?
వినాయకపురంలోని ఎర్ర చెరువులో పూడికతీత పనులు చేస్తున్న కూలీలు

మూడు నెలలుగా నిలిచిన ఉపాధి చెల్లింపులు

రూ. 50 లక్షల మేర బకాయిలు

సాఫ్ట్‌వేర్‌, ఖాతాల మార్పుల వల్లే: ఈజీఎస్‌ ఏపీవో

అశ్వారావుపేట, జూలై 3: అసలే పేదలు.. ఆపై మండే ఎండలో.. విసిగించే ఉక్కపోతలో.. ఒక్కో చుక్క నీటిని తాగుతూ వారు ఉపాధి పనులు చేశారు. అప్పట్లో అధికారులు పనులు చేసిన వారానికి కూలీడబ్బులు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ గాలిలో కలిసిపోయింది. వారం మాట దేవుడెరుగు మూడు నెలలు దాటినా పైసా కూడా కూలీల ఖాతాలో జమ కాలేదు. మండలంలోని వినాయకపురానికి చెందిన కూలీలు 135 మంది వేసవిలో ఉపాధి పనులకు వెళ్లారు. సుమారు వంద రోజుల పాటు పనులు చేశారు. కానీ నాటి నుంచి నేటి వరకూ వారి ఖాతాలో ఒక్క పైసా కూడా జమకాలేదు. ఉపాధి హామీ పని చేస్తూ 20 రోజుల క్రితం బుద్దే నాగేశ్వరరావు అనే వ్యక్తి అస్వస్థతకు గురై, ప్రస్తుతం పనిచేయలేని పరిస్థితిలో ఉన్నాడు. నాగేశ్వరరావుకు సపర్యలు చేస్తూ ఇంటే వద్దే ఉంటోంది. వీరికి ఈజీఎస్‌ నుంచి ఎటువంటి సహాయం అందలేదు. అధికారులకు ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు.

రూ. 50 లక్షల బకాయిలు

మండల వ్యాప్తంగా ప్రతి రోజుల 2,500 మంది పనిచేస్తున్నారు. ఇప్పటికి మూడు నెలలుగా సుమారుగ రూ.50 లక్షల మేర బకాయిలు పేరకుపోయాయి. కుటుంబ అవసరాలకు పనికొస్తాయనే ఉద్దేశ్యంతో కూలీలు ఉపాధి పనులు చేశారు. వీటి బిల్లులు నెలలకొద్దీ చెల్లింపులు జరుగకపోవడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

సాప్ట్‌వేర్‌, అకౌంట్ల మార్పులవల్లే: నరేష్‌, ఏపీవో, ఈజీఎస్‌ 

ఇటీవల జాతీయ ఉపాధిహామీ పథకం నిధులను నేరుగా కేంద్ర ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పు, బ్యాంకులు, పోస్టాపీసుల్లో ఖతాల మార్పు వల్ల చెల్లింపుల్లో కొద్దిగా ఆలస్యమైంది. మే ఎనిమిది వరకు చెల్లింపులు జరిగాయి. మండలంలో మొత్తం 2,500 మంది కూలీలు పనిచేస్తున్నారు. వారికి రూ. 50 లక్షల కూలీ వేతనం చెల్లించాల్సి ఉంది. వారం రోజుల్లో చెల్లింపులు జరిగే అవకాశాలున్నాయి

Updated Date - 2022-07-04T06:35:13+05:30 IST