దస్తగిరికి రక్షణ లేదనడం అవాస్తవం: పులివెందుల డీఎస్పీ

ABN , First Publish Date - 2022-04-24T02:27:28+05:30 IST

రాష్ట్రంలో సంచలనం స‌ృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో

దస్తగిరికి రక్షణ లేదనడం అవాస్తవం: పులివెందుల డీఎస్పీ

కడప: రాష్ట్రంలో సంచలనం స‌ృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరి తనకు పోలీసుల రక్షణ లేదని చెప్పడం అవాస్తవమని పులివెందుల డీఎస్పీ  శ్రీనివాసులు తెలిపారు. దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచి ఎస్పీఆదేశాల మేరకు ఇద్దరు పోలీసులతో 24 గంటలు రక్షణ కల్పించామని ఆయన పేర్కొన్నారు. దస్తగిరి బయట ప్రాంతాలకు వెళ్ళినపుడు ఒక కానిస్టేబుల్ వెంట ఉంటాడన్నారు. దస్తగిరి ఇంటివద్ద 1+3 పోలీసు పికెట్ ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు.



కడప: తనకు పోలీసులు రక్షణ కల్పించడం లేదని, పులివెందుల దాటి వెళ్లాలంటే భయంగా ఉందని మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌ డ్రైవర్‌ దస్తగిరి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శనివారం దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ కేటాయించిన ఇద్దరు గన్‌మెన్లు తనతో రావడం లేదని తెలిపారు. ప్రతిసారీ ఫోన్‌ చేసి సెక్యూరిటీ కావాలని కోరడం ఇబ్బందిగా ఉందని దస్తగిరి చెప్పాడు. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతిసారి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కు ఫోన్ చేసి చెప్పాలంటే కష్టమవుతోందని వాపోయాడు. సెక్యూరిటీ లేకపోవడం వల్ల తన పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదన్నారు. తనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని దస్తగిరి ప్రశ్నించారు.


వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ప్రొద్దుటూరు కోర్టులో నిరుడు ఆగస్టు 31న మొదటిసారి 164 సెక్షన్‌ కింద ఇచ్చిన వాంగ్మూలంలో.. వివేకా హత్యకు దారితీసిన పరిస్థితులు, హత్య చేసేందుకు రూపొందించిన ప్రణాళిక , ఎవరెవరు ఎలా హత్య చేశారు, ఎలా తప్పించుకుని బయటకు వెళ్లారు.. హత్య వెనుక ఉన్న ప్రముఖుల పేర్లను దస్తగిరి వెల్లడించాడు. వివేకానంద హత్య తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది. ‘చంద్రబాబే చంపించారు’ అని నాడు వైసీపీ గగ్గోలు పెట్టింది. ఆ తర్వాత సీబీఐ రంగంలోకి దిగింది. ఒక్కో కూపీ లాగింది. 


ఇప్పుడు అన్ని వేళ్లూ... వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పింది అవినాశ్‌ రెడ్డే అని నాటి పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకి చెప్పారు. ‘వాంగ్మూలంలో ఏం చెప్పావ్‌... అవినాశ్‌ రెడ్డి పిలుస్తున్నాడు రా!’ అంటూ అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరికి బెదిరింపులు వచ్చాయి. ‘లోపల ఏం జరిగిందో  చెబితే నరికేస్తా’ అని ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించినట్లు వాచ్‌మ్యాన్‌ రంగన్న చెప్పారు. దీనికి సంబంధించిన లేఖలు, వాంగ్మూలాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. 


Updated Date - 2022-04-24T02:27:28+05:30 IST