నిఘా లోపమా.. నిర్లక్ష్యమా?

Published: Fri, 23 Sep 2022 00:20:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిఘా లోపమా.. నిర్లక్ష్యమా?నవీనకు ఇంజక్షన్‌ చేస్తున్న భిక్షం (సీసీ వీడియో దృశ్యం), భిక్షం, నవీన (ఫైల్‌)

మత్తు ఇంజక్షన్ల వినియోగంపై కానరాని పర్యవేక్షణ

ఇష్టానుసారం బయటకు విక్రయిస్తున్న ఆసుపత్రుల కిందిస్థాయి సిబ్బంది 

డబ్బుపై ఆశతో నిబంధనలకు పాతర 

జమాల్‌సాహెబ్‌, నవీన హత్యలతో మత్తుమందుల నిర్వహణపై అనుమానాలు

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో నవీన ఉదంతం సీసీ ఫుటేజీలను బయటపెట్టిన పోలీసులు

ఖమ్మం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : శస్త్రచికిత్సల సమయంలో వినియోగించే మత్తు ఇంజక్షన్లు ఇప్పుడు ప్రాణాలు తీసే ఆయుధాలుగా మారుతున్నాయి. అందుకు జిల్లాలో జరిగిన సంచలనఘటనలు.. జమాల్‌సాహెబ్‌, నవీన హత్యల్లో వినియోగించింది మత్తుఇంజక్షనే కావడం ఉదాహరణ. ప్రాణాలు కాపావే సమయంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ మత్తుమందును వినియోగించడం, భద్రపరచడం లాంటి విషయాల్లో ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్‌ షాపుల యాజమాన్యాలు చేస్తున్న నిర్లక్ష్యంతో వాటిని కొందరు సిబ్బంది అడ్డదారిలో విక్రయిస్తున్నారు. డబ్బుపై ఆశతో నిబంధనలను పక్కన పెట్టి ఆసుపత్రుల వారు తమపై పెట్టిన నమ్మకాన్ని సొమ్ముచేసుకుంటూ బయట వ్యక్తులకు మత్తుమందు సీసాలను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వాటిపై నిఘా పెట్టాల్సిన ఔషధ నియంత్రణశాఖ తమ విధులను మరిచిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు ప్రైవేటు ఆసుపత్రులనుంచి ఇతర ప్రాంతాలకు మత్తుఇంజక్షన్లు సరఫరా జరుగుతోందని, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన ఈ మందు విచ్చలవిడిగా బయట దొరుకుతోందని, అదే ఇప్పుడు ప్రాణాలు తీసే ఆయుధంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో జరిగిన జమాల్‌సాహెబ్‌, నవీన హత్యల్లో నిందితులు వినియోగించింది మత్తుమందే కావడం గమనార్హం. అంతేకాదు ఈ ఇద్దరి హత్యలకు ఒకే ఆసుపత్రి నుంచి మత్తుఇంజక్షన్లు వెళ్లినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ మత్తు ఇంజక్షన్ల విక్రయాలపై నిఘా ఉంచాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఉండే కిందిస్థాయి సిబ్బంది డబ్బులకు కక్కుర్తి పడి మత్తు ఇంజక్షన్లను విక్రయించినట్టు తెలుస్తోంది. చింతకాని మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన జమాల్‌సాహెబ్‌ ఈనెల 19న బైక్‌పై వెళుతుండగా లిప్టు అడిగిన వ్యక్తి వెనుకనుంచి మత్తు ఇంజక్షన గుచ్చి పరారవగా.. జమాల్‌సాహెబ్‌ కొద్దిదూరం వెళ్లిన తర్వాత మృతిచెందాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ హత్యలో జమాల్‌సాహెబ్‌ భార్య ఇమాంబీ ప్రధాన సూత్రధారికాగా, సూదిపొడిచింది నామవరానికి చెందిన బండి వెంకన్న అనే ఆర్‌ఎంపీ వైద్యుడు. ఇతను రెండు నెలల క్రితమే మత్తు మందు కోసం ఖమ్మంలోని శశి ఆసుపత్రిలో పనిచేస్తున్న పోరళ్ల సాంబశివరావును సంప్రదించగా.. అతడు ఖమ్మంలోని ఆరాధ్య ఆసుపత్రిలో ఆపరేషన థియేటర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన మిత్రుడు బందెల యశ్వంత ద్వారా రెండు మత్తు ఇంజక్షన్లను తెప్పించి వెంకన్నకు ఇచ్చాడు. వాటితోనే వెంకన్న జమాల్‌సాహెబ్‌ను హతమార్చాడు. ఇక 50రోజుల క్రితం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చి మృతిచెందిన నవీనది హత్య తేలడం, ఈ ఘటనలో ఆమె భర్త భిక్షం ఆమెకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి చంపాడన్న విషయం రుజువైంది. భిక్షం కూడా ఆరాధ్య ఆసుపత్రిలో ఆపరేషన థియేటర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు కూడా తన భార్యను హతమార్చేందుకు జమాల్‌సాహెబ్‌ హత్యకేసులో అరెస్టయిన బందెల యశ్వంత ద్వారానే మత్తు ఇంజక్షన్లు తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. 


ఏదీ నిఘా..?

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆపరేషన చేసే ముందు వినియోగించే మత్తు మందుల విషయంలో నిఘా లేదని, ఖమ్మంలో జరిగిన రెండు సూది హత్యకేసుల్లో స్పష్టమవుతుంది. వాస్తవానికి మత్తు మందులు డీలర్లనుంచి కొనుగోలు చేసే ఆసుపత్రి యాజమాన్యాలు రిజిస్టర్‌ ద్వారా తమ వద్ద ఏ మోతాదులో మందులున్నాయి, ఎవరికి వినియోగించారు, ఏ ఆపరేషనకు వినియోగించారన్న విషయాలను స్పష్టంగా పేర్కొనాలి. కానీ వీటిపై ఆసుపత్రి యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయడం, అతి నమ్మకంతో కిందిస్థాయి సిబ్బందికి వాటి నిర్వహణను అప్పగించడం, జాగ్రత్తల విషయంలో నిబంధనలు పాటించక పోవడం లేదన్నది స్పష్టమవుతోంది. ఆపరేషన్ల అవసరం మేరకు మత్తు మందు మోతాదును వైద్యులు ఇస్తారు. అలాగే మత్తుమందు వినియోగించేటప్పుడు వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సదుపాయం తప్పనిసరి. ఇవి లేనిపక్షంలో శ్వాసనాళాలు మూసుకుపోయి శ్వాసమస్యలతో వ్యక్తులు చనిపోతారు. ఖమ్మంలో జరిగిన రెండు హత్యల విషయంలో మత్తుమందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా శ్వాసనాళాలు మూసుకుపోయి.. గాలి ఆడక క్షణాల వ్యవధిలో చనిపోయారు. వైద్యంలో అవగాహన ఉన్న వారికే ఈ విషయం తెలియడం, వారు మాత్రమే దాన్ని ప్రయోగించగలడం జరుగుతుంది. 


నవీన కేసును పోలీసులు ముందే బహిర్గతం చేసి ఉంటే..

ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవమైన అనంతరం భార్యకు మత్తుఇంజక్షన ఇచ్చి హత్యచేసిన సంఘటనను పోలీసులు గోప్యంగా ఉంచారు. జూలై 31న తెల్లవారుజామున ఆమె మరణించగా.. అదే రోజు తన సరైన వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనపోయిందంటూ నాటకమాడిన భర్త భిక్షం.. గిరిజన సంఘాలు, బంధుమిత్రులతో కలిసి ఆసుపత్రి వద్ద ధర్నా చేయించాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులుకూడా పెడతానంటూ ఆసుపత్రి యాజమాన్యాన్ని బెదిరించాడు. రూ.4లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు అనుమానం వచ్చిన ఆసుపత్రి యాజామన్యం సీసీ ఫుటేజీలు పరిశీలించగా.. భిక్షమే భార్యకు ఇంజక్షన ఇస్తున్నట్టు ఆధారాలు లభించడం, పోలీసులను ఆశ్రయించడం, విచారణలో అతడు హత్యను అంగీకరించడం, అతడి అరెస్టు, రిమాండ్‌ జరిగిపోయాయి. కానీ పదిరోజుల క్రితం అతడిని అరెస్టు చేసిన ఖమ్మంటుటౌన విషయాన్ని గోప్యంగా ఉంచారు. అదే అప్పుడే విషయాన్ని మీడియాద్వారా వెలుగులోకి తెచ్చి ఉంటే అంతకు ముందు నుంచే జమాల్‌సాహెబ్‌ హత్యకు పథకం పన్నుతున్న ఇమాంబీ, ఇతర నిందితులు వెనకడుగు వేసేవారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నచిన్న సంఘటనల్లో నిందితుల అరెస్టులను మీడియాకు చూపే పోలీసులు.. అతి దారుణ ఘటన అయిన నవీన ఉదంతాన్ని వెలుగులోకి తీసుకురాకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


సంచలనం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

ప్రసవం కోసం భార్యను ఆసుపత్రిలో చేర్చిన భర్తే కర్కోటకుడిగా మారి మత్తు ఇంజక్షన చేసి హతమార్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన గురించి ‘భార్యను చంపి.. ఆసుపత్రిపై నెట్టి..’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 50రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతుండగా.. గురువారం ఖమ్మం టుటౌన పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీలను మీడియాకు వెల్లడించారు. జూలై 31న ప్రసవం నిమిత్తం రెండో భార్య నవీనను భిక్షం ఖమ్మంలోని శశిబాల ఆసుపత్రిలో చేర్చాడు. అదేరోజు వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేయగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె, శిశువు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే అప్పటికే ఇద్దరు భార్యల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో నవీనను అడ్డు తొలిగించాలని భావించిన భిక్షం పథకం ప్రకారం అర్ధరాత్రి తర్వాత తన వెంట తెచ్చుకున్న మత్తు ఇంజక్షనను భార్యకు రెండు దఫాల్లో ఎక్కించాడు. తర్వాత తెల్లవారుజామున నవీన చనిపోయిందని నిర్ధారించుకుని కాంపౌండర్‌ను పిలిచాడు. కాంపౌండర్‌ వచ్చి ముఖానికి ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టి డ్యూటీ డాక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆమె వచ్చి పరీక్షించి సీనియర్‌ డాక్టర్‌కు సమాచారం అందించారు. ఆమెకూడా వచ్చి నవీనను పరిశీలించి చనిపోయినట్టు నిర్ధారించారు. అలా మత్తు ఇంజక్షన ఇచ్చి భిక్షం తన చిన్న భార్యను చంపిన బాగోతాన్ని పోలీసులు తెలిపారు.


జమాల్‌సాహెబ్‌ హత్య కేసులో ఆరుగురికి జ్యుడీషియల్‌ రిమాండ్‌

ఖమ్మంలీగల్‌, సెప్టెంబరు 22: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమాల్‌సాహెబ్‌ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు గురువారం ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయయూర్తి పొన్నేపల్లి మౌనిక ఎదుట హాజరు పరిచారు. ఈ క్రమంలో న్యాయమూర్తి వచ్చే నెల 6వతేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో నిందితులైన చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన గోదా మోహన్‌రావు, బండి వెంన్న, నర్సింశెట్టి వెంకటేష్‌, బొప్పారం గ్రామానికి చెందిన మృతుడి భార్య షేక్‌ ఇమాంబీ, రఘునాథపాలెం మండలం పుట్టకోట గ్రామానిక చెందిన బందిల యశ్వంత, బోనకల్‌ మండలం రాయన్నపేటకు చెందిన పోరాల సాంబశివరావులను భారీ బందోబస్తు మధ్య ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి ఖమ్మం కారాగారానికి తరలించారు. జమాల్‌సాహెబ్‌ భార్య ఇమాంబీ.. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంగా ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. ఈ క్రమంలో ఈనెల 19న ఏపీలోని ఎన్టీఆర్‌జిల్లా గండ్రాయి గ్రామంలోని తన కూతురు వద్దకు వెళుతున్న జమాల్‌సాహెబ్‌ను లిఫ్ట్‌ అడిగి వాహనం ఎక్కిన ఆర్‌ఎంపీ వైద్యుడు వెంకన్న మత్తుమందు నింపిన ఇంజక్షన్‌ను పొడిచి హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలసిందే. ఈ ఘటనలో మృతుడి భార్య సహా ఆరుగురిని నిందితులుగా గుర్తించారు.   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఖమ్మం Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.