గోదారిలో దూకిన తిరుపతి మహిళ

ABN , First Publish Date - 2020-11-29T05:54:11+05:30 IST

భర్త వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తిరుపతికి చెందిన ఓ వివాహిత గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించారు.

గోదారిలో దూకిన తిరుపతి మహిళ
రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న లత

భర్త వేధింపులు, ఆర్థిక ఇబ్బందులే కారణం

ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి


రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 28: భర్త వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తిరుపతికి చెందిన ఓ వివాహిత గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి పోస్టల్‌ కాలనీకి చెందిన లత అదే ప్రాంతానికి చెందిన కుమార్‌ అనే యువకుడిని పదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. భర్త వ్యసనపరుడై.. సుమారు రూ.25 లక్షలు అప్పు చేశాడు. ఈ క్రమంలో భర్త వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులిచ్చినవారి ఒత్తిడిని తట్టుకోలేక మరణమే శరణ్యమని భావించారు. ఐదు రోజుల కిందట తిరుపతి నుంచి బస్సులో రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేశారు. నదిలో కొట్టుకుపోతున్న ఆమెను కొందరు రక్షించి.. ఆర్టీసీ బస్టాండుకు తీసుకొచ్చి తిరుపతి పంపేయాలని ప్రయత్నించారు. అప్పటికే నిద్రమాత్రలు వేసుకుని ఉండటంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. దాంతో ఆమెను అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యసేవలు అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ విషయం తిరుపతిలోని తన కుటుంబీకులకు తెలియజేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని.. లేదంటే బతికి ప్రయోజనం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కలిసి బాధ చెప్పుకోవడానికి తనకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2020-11-29T05:54:11+05:30 IST