పంట నీరు.. మంచినీటి సమస్య రావొద్దు

ABN , First Publish Date - 2020-11-25T06:59:08+05:30 IST

రాజమహేంద్రవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : డెల్టా కాలువలు మార్చి 31న మూసివేయడం వల్ల పంటనీరు, మంచినీటి సమస్యలు రాకుండా అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలి. పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో, రైతులూ అంతే ముఖ్యం. వేసవిలో కాలువల మెయింటెనెన్స్‌ పనులు కూడా పూర్తిచేయాలి

పంట నీరు.. మంచినీటి సమస్య రావొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు

ఐఏబీ సమావేశంలో సూచన

రబీకి యాక్షన్‌ ప్లాన్‌ అవసరం : డిప్యూటీ సీఎం ధర్మాన 8 ఏప్రిల్‌ 15 వరకూ కాల్వలకు నీరివ్వాలి : ఎంపీ బోసు

మెయింటెనెన్స్‌ వర్కులు జరగడంలేదు : మంత్రి కన్నబాబు  

లస్కర్లకు 15 నెలల నుంచి జీతాలివ్వరేం : ఎమ్మెల్యేలు

రాజమహేంద్రవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : డెల్టా కాలువలు మార్చి 31న మూసివేయడం వల్ల పంటనీరు, మంచినీటి సమస్యలు రాకుండా అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలి. పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో, రైతులూ అంతే ముఖ్యం. వేసవిలో కాలువల మెయింటెనెన్స్‌ పనులు కూడా పూర్తిచేయాలి. పూర్తి ఆయకట్టుకు నీరివ్వాలి. శివారులోని ప్రతి ఎకరాలకు నీరందేలా యాక్షన్‌ ప్లాన్‌ ఉండాలి. ఇరిగేషన్‌, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యుఎస్‌, వ్యవసాయశాఖ సమన్వయంతో వ్యవహరించాలి. ఈఈలు, డీఈలు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే సమస్యలు అర్థం అవుతాయి. నీటి సంఘాలు లేనందున మండల స్థాయి నుంచి అడ్వయిజరీ బోర్డును భాగస్వామ్యం చేయాలని అధికారులకు మంత్రులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలు సూచించారు. డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాసు అధ్యక్షతన మంగళవారం రాజమహేంద్రవరంలోని ఆనంకళాకేంద్రంలో జరిగిన ఉభయగోదావరి జిల్లాల నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు మాట్లాడారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ సీఎం జగన్‌ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలవరం పూర్తి కావాలంటే, రబీ సీజన్‌లో సమన్వయంతో యాక్షన్‌ ప్లాన్‌ చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోసు మాట్లాడుతూ పోలవరం కాఫర్‌ డ్యామ్‌ను రాత్రింబవళ్లు నిర్మించి, కాలువలకు ఏప్రిల్‌ 15 వరకూ నీరివ్వాలన్నారు. లేనిపక్షంలో డ్రైన్లు అడ్డుకట్టలు వేసి, ఇంజన్లతో తోడాలన్నారు.

సాంఘిక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ పోలవరం సీఎం ప్రాధాన్యత ప్రాజెక్టు. ఈ నేపథ్యంలో మార్చి 31కి కాలువలు మూసివేస్తే.. సాగు, మంచినీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ మార్చి 20 వరకూ మా డెల్టాకు పూర్తి స్థాయిలో నీరివ్వాలి. 120 రోజుల పంటే సరైందని ఆయన చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రబీ ప్లానింగ్‌ ఉండాలి. పోలవరం పనులకు ఆటంకం రాకూడదు. రైతులకు సమస్య ఉండకూడదు. డెల్టాల్లో మెయుంటెనెన్స్‌ పనులు జరగడంలేదు. తూడు, గుర్రపుడెక్క వంటి చిన్నచిన్న పనులు కూడా జరగడం లేదన్నారు. నీటి సంఘాలు లేవు కాబట్టి, రైతు సంఘాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈఈ, డీఈలు క్షేత్రస్థాయిలో తిరిగితే సమస్యలు ఉండవు. మేం చెప్పేది మీకు అర్థం కావడంలేదు. మీరు చెప్పేది మాకు అర్థం కావడంలేదన్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ మాట్లాడుతూ రబీకి ఇబ్బంది ఉండకూడదంటే ఇప్పటి నుంచి యాక్షన్‌ ప్లాన్‌ ఉండాలన్నారు. ఎక్కడ సమస్య ఉందో మందే గుర్తించాలి. రైతులకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలన్నారు. 

ఎంపీ గీత మాట్లాడుతూ రైతులతో కోఆర్డినేషన్‌ చేసుకుని సమస్య లేకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ 15 నెలల నుంచి లస్కర్లకు జీతాలు ఇవ్వడంలేదు. లస్కర్లతోనే ఈ వ్యవస్థ ముడిపడి ఉందన్నారు. కడియం, ధవళేశ్వరం, తొర్రిగడ్డ ఆవలు ముంపునకు గురవుతున్నాయి. హుకుంపేట ఛానల్‌ పరిస్థితి అంతే. వీటికి యాక్షన్‌ ప్లాన్‌ అవసరమన్నారు. ఈ మూడు నెలల్లో స్పిల్‌వే పనులు పూర్తి చేసి, స్కవర్‌ స్లూయిజ్‌ ద్వారా నీరివ్వాలని ఆయన సూచించారు. చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలు ఎందు కూ పనికిరాకుండా చేస్తున్నారని విమర్శించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ తమ ప్రాంతం పంటలకు నీరివ్వమంటే ఇవ్వనని చెబురేంటని పోలవరం ఎస్‌ఈ నాగిరెడ్డిని ప్రశ్నించారు. కనీసం ఆరుతడి పంటలకైనా నీరు ఇవ్వవలసిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ ఏలేరు పనులు పూర్తి చేస్తామంటే క్రా్‌ప్‌ హాలిడేకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫేజ్‌-1లోని చిన్న పనులను ఫేజ్‌-1లో పెట్టి పూర్తి చేయాలని కోరారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మాట్లాడుతూ రాజోలు పరిధిలో శంకర గుప్తం డ్రైను మీద ఎత్తిపోతల పథకం 2,600 ఎకరాలకు నీరివ్వాలన్నారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ తమ ముందు ఉన్నా తమకు నీరివ్వకుండా కిందకు ఇస్తున్నారు. ఈసారి లొల్ల దాటి చుక్క కూడా పోనీయం. అధికారులు అందరికీ నీరివ్వాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు డి.మురళీధరరెడ్డి, ముత్యాలరాజు, ఇరిగేషన్‌ సీఈ శ్రీధర్‌, అఽధికారులు పాల్గొన్నారు.


నిమ్మల వర్సెస్‌ కురసాల

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మంత్రి కన్నబాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ శివారు ప్రాంతంలోని ఆఖరి ఎకరం కూడా పండేలా నీరివ్వాలన్నారు. గతేడాది నీటి ఎద్దడి వల్ల పంట నష్టపోయింది. కనీసం ఇంజన్లకు కూడా అవకాశం ఇవ్వలేదు. డ్రెయిన్లకు అడ్డుకట్టవేయలేదన్నారు. ఇప్పటికి కేవలం 10 శాతం ఖరీప్‌ వరి కోత లు జరిగాయి. డిసెంబరు 10 వరకూ పూర్తికావు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 20వ తేదీ వరకూ నీరివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 120 రోజుల పం ట మంచిదే. కానీ ఎంటీయూ 1121, 1156 రకాలు వరి ఉంది. కొన్ని రకాలకు గింజలపై మచ్చలు రావడం వల్ల మిల్లర్లు కొనడంలేదు. ఈసారి కొనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి చెరుకువాడ జోక్యం చేసుకుని  26న మీటింగ్‌ ఉందని, అన్నీ చర్చించుకుందామన్నారు. నిమ్మల మాట్లాడుతూ నాకంటే మీరు పైన ఉన్నారన్నారు. డిప్యూటీ సీఎం ధర్మాన జోక్యంచేసుకుని అన్ని సమస్యలు పరిష్కరించుకుందామనడంతో అంతా ఆగారు.


Updated Date - 2020-11-25T06:59:08+05:30 IST