లగుడు సింహాద్రి నాయుడు కన్నుమూత

ABN , First Publish Date - 2021-03-01T05:03:38+05:30 IST

రాజకీయ కురువృద్ధుడు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ లగుడు సింహాద్రి నాయుడు (92) ఆదివారం కన్నుమూశారు. జామి మండలం అలమండ గ్రామానికి చెందిన ఈయన గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

లగుడు సింహాద్రి నాయుడు కన్నుమూత
లగుడు సింహాద్రి నాయుడు (ఫైల్‌)

సర్పంచ్‌ నుంచి జిల్లా పరిషత్‌ చైర్మన్‌వరకు పదవుల అలంకరణ

శృంగవరపుకోట, ఫిబ్రవరి 28:

రాజకీయ కురువృద్ధుడు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ లగుడు సింహాద్రి నాయుడు (92) ఆదివారం కన్నుమూశారు. జామి మండలం అలమండ గ్రామానికి చెందిన ఈయన గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అదివారం తుది శ్వాస విడిచారు. గ్రామ సర్పంచ్‌ నుంచి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వరకు పలు పదవులు అలంకరించారు. ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో మూడు దశాబ్దాలకు పైబడి  ఎస్‌.కోట నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు బాధ్యతను తెలుగు దేశం వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావు నుంచి ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వరకు ఈయనకే అప్పగించారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు పూసపాటి ఆశోక్‌ గజపతిరాజు, విశాఖ మాజీ ఎంపీ, దివంగత ఎంవీఎస్‌ మూర్తితో పాటు ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడుతో ఉన్న వ్యక్తిగత పరిచయాలతో ఈ ప్రాంతంలో తిరుగులేని నేతగా ఉన్నారు. సర్పంచ్‌, సమితి ప్రెసిడెంట్‌, జామి మండల అధ్యక్షుడు, చక్కెర కర్మాగారం చైర్మన్‌, జడ్పీ చైర్మన్‌ వంటి పదవులు చేపట్టారు. ఐదుగురు సంతానంలో ఇద్దరు మగ పిల్లలు, ముగ్గురు అడపిల్లలు కాగా కుమారుడు లగుడు రవికుమార్‌ విజయనగరం ఎంఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. సింహాద్రి నాయుడు మృతితో తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. 


Updated Date - 2021-03-01T05:03:38+05:30 IST