ప్లేఆఫ్స్ కు లఖ్‌నవూ

ABN , First Publish Date - 2022-05-19T10:23:39+05:30 IST

ఐపీఎల్‌ అరంగేట్రం జట్టు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇంటిముఖం పట్టింది.

ప్లేఆఫ్స్ కు లఖ్‌నవూ

డికాక్‌ సూపర్‌ సెంచరీ

ఆఖరి బంతికి గెలుపు

కోల్‌కతా అవుట్‌

శ్రేయాస్‌, రింకూ పోరాటం వృథా


ఐపీఎల్‌  చరిత్రలో వికెట్‌ కోల్పోకుండా 20 ఓవర్లు ఆడిన తొలి జట్టుగా లఖ్‌నవూ.

రాహుల్‌-డికాక్‌ 210 పరుగుల భాగస్వామ్యం.. లీగ్‌లో ఏదైనా వికెట్‌కు మూడో అత్యధికం. 2016, 2015లో కోహ్లీ-డివిల్లీర్స్‌ 229, 215 పరుగుల భాగసామ్యాలు నెలకొల్పారు. 


ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా డికాక్‌ (140 నాటౌట్‌). గేల్‌ (175 నాటౌట్‌), మెకల్లమ్‌ (158 నాటౌట్‌) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 


నాటకీయ మలుపులు తిరిగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్‌ విజయం సాధించిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌.. నాకౌట్‌కు అర్హత సాధించింది. మొత్తం 18 పాయింట్లతో టాప్‌-2లో నిలిచింది. డికాక్‌ చిరస్మరణీయ శతకంతో అదరగొట్టాడు. ఇక, ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా టోర్నీ నుంచి నిష్క్రమిం చింది. తుదికంటా పోరాడినా.. గెలుపు వాకిట నైట్‌రైడర్స్‌ బోర్లాపడింది. 


ముంబై: ఐపీఎల్‌ అరంగేట్రం జట్టు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇంటిముఖం పట్టింది. బుధవారం ఆఖరి బంతి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 2 పరుగుల తేడాతో కోల్‌కతాపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 210 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ (70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 నాటౌట్‌).. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి వికెట్‌కు అజేయంగా 210 పరుగుల అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఓవర్లన్నీ ఆడి 208/8 స్కోరు చేసి ఓడింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), నితీష్‌ రాణా (22 బంతుల్లో 9 ఫోర్లతో 42), రింకూ సింగ్‌ (15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40) పోరాడారు. మొహిసిన్‌, స్టొయినిస్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టాడు. డికాక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ లభించింది.


ఆరంభంలోనే దెబ్బ..

భారీ లక్ష్య ఛేదనలో.. కోల్‌కతా ఆరంభంలోనే తడబడింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (0)కు జతగా ఓపెనింగ్‌కు దిగిన అరంగేట్రం ఆటగాడు అభిజిత్‌ తోమర్‌ (4)ను మొహిసిన్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చాడు. కానీ, కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ సహకారంతో రాణా ఎదురుదాడి చేస్తూ.. టీమ్‌ను ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే, ధాటిగా ఆడుతున్న రాణాను స్పిన్నర్‌ గౌతమ్‌ అవుట్‌ చేయడంతో.. మూడో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో బిల్లింగ్స్‌ (36) నుంచి అయ్యర్‌కు మంచి సహకారం అందడంతో.. సాధించాల్సిన రన్‌రేట్‌ చేయిదాటి పోలేదు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 66 పరుగులతో లఖ్‌నవూ శిబిరంలో గుబులు పుట్టించారు.


అవేశ్‌ వేసిన 10వ ఓవర్‌లో బిల్లింగ్స్‌ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 20 పరుగులు రాబట్టడంతో.. కోల్‌కతా 99/3తో పోటీలోకి వచ్చింది. కాగా, శ్రేయా్‌సను అవుట్‌ చేసిన స్టొయినిస్‌.. జట్టుకు కావాల్సిన బ్రేక్‌ అందించాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో అయ్యర్‌.. హుడాకు చిక్కాడు. చివరి 30 బంతుల్లో 77 పరుగులు కావాల్సిన సమయంలో.. బిల్లింగ్స్‌ను బిష్ణోయ్‌ అవుట్‌ చేశాడు. డేంజర్‌మన్‌ రస్సెల్‌ (5)ను మొహిసిన్‌ అవుట్‌ చేయడంతో.. లఖ్‌నవూదే మ్యాచ్‌ అనిపించింది. 


నాటకీయ మలుపు..

ఆ దశలో నరైన్‌ (21 నాటౌట్‌), రింకూ 7వ వికెట్‌కు 19 బంతుల్లో 58 పరుగులతో ఎదురుదాడి చేయడంతో సమీకరణం మారిపోయింది. చివరి ఓవర్‌లో 21 పరుగులు కావాల్సి ఉండగా.. రింకూ 4,6,6 బాదడంతో కోల్‌కతా గెలుపు ఖాయమనిపించింది. అయితే, స్టోయినిస్‌ బౌలింగ్‌లో లూయిస్‌ పట్టిన గ్రేట్‌ క్యాచ్‌తో రింకూ నిష్క్రమించగా.. ఆఖరి బంతికి ఉమేష్‌ బౌల్డ్‌ కావడంతో లఖ్‌నవూ నవ్వింది. 


ఓపెనర్లే ఆడేశారు..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లఖ్‌నవూ ఓపెనర్‌ డికాక్‌ విధ్వంసంతో భారీ స్కోరు చేసింది. 15 ఓవర్ల వరకు లఖ్‌నవూ రన్‌రేట్‌ నిలకడగా సాగినా.. డెత్‌ ఓవర్లలో క్వింటన్‌ ఊచకోతతో స్కోరు బోర్డు జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లింది. కాగా, పసలేని బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌ వైఫల్యాలతో కోల్‌కతా భారీ మూల్యం చెల్లించుకొంది. ఉమేష్‌ వేసిన మూడో ఓవర్‌లో.. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిజిత్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికి పోయిన డికాక్‌.. నైట్‌ రైడర్స్‌కు పీడకలను మిగిల్చాడు. అతడికి మరో ఓపెనర్‌ రాహుల్‌ నుంచి చక్కని సహకారం అందడంతో.. ఐపీఎల్‌ చరిత్రలోనే అద్వితీయమైన దృశ్యం ఆవిష్కృతమైంది.


5వ ఓవర్‌లో రాహుల్‌ 4,6తో గేర్‌ మార్చడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి సూపర్‌ జెయింట్స్‌ 44/0తో పటిష్టస్థితిలో నిలిచింది. ఆ తర్వాత డికాక్‌ స్పిన్నర్లను చక్కగా ఆడుతూ పరుగులు రాబట్టగా.. సౌథీ బౌలింగ్‌లో రాహుల్‌ రెండు సిక్స్‌లతో జోరు చూపించాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న డికాక్‌.. 13వ ఓవర్‌లో నరైన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదడంతో టీమ్‌ స్కోరు సెంచరీ మార్క్‌ దాటింది. మరోవైపు సింగిల్‌తో రాహుల్‌ కూడా అర్ధ శతకం నమోదు చేశాడు. అయితే, 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నరైన్‌ బౌలింగ్‌లో మరోసారి అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకొన్న డికాక్‌.. 6,4తో సెంచరీ సాధించాడు. సౌథీ వేసిన 19వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లతో 27 పరుగులు పిండుకున్న క్వింటన్‌.. ఆ తర్వాతి ఓవర్‌లో వరుసగా నాలుగు బౌండ్రీలతో జట్టు స్కోరును డబుల్‌ సెంచరీ దాటించాడు. డికాక్‌ దెబ్బకు చివరి 30 బంతుల్లో కోల్‌కతా 88 పరుగులు సమర్పించుకుంది.


స్కోరుబోర్డు

లఖ్‌నవూ:

డికాక్‌ (నాటౌట్‌) 140, కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) 68, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 210; బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 4-0-34-0, సౌథీ 4-0-57-0, నరైన్‌ 4-0-27-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-38-0, రస్సెల్‌ 3-0-45-0, నితీశ్‌ రాణా 1-0-9-0.


కోల్‌కతా:

వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) డికాక్‌ (బి) మొహిసిన్‌ 0, అభిజీత్‌ తోమర్‌ (సి) రాహుల్‌ (బి) మొహిసిన్‌ 4, నితీశ్‌ రాణా (సి) స్టొయినిస్‌ (బి) గౌతమ్‌ 42, శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) హుడా (బి) స్టొయినిస్‌ 50, బిల్లింగ్స్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) బిష్ణోయ్‌ 36, రస్సెల్‌ (సి) హుడా (బి) మొహిసిన్‌ 5, రింకూ సింగ్‌ (సి) లూయిస్‌ (బి) స్టొయినిస్‌ 40, నరైన్‌ (నాటౌట్‌) 21, ఉమేశ్‌ యాదవ్‌ (బి) స్టొయినిస్‌ 0, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 208/8;  వికెట్ల పతనం: 1-0, 2-9, 3-65, 4-131, 5-142, 6-150, 7-208; బౌలింగ్‌: మొహిసిన్‌ ఖాన్‌ 4-0-20-3, హోల్డర్‌ 4-0-45-0, అవేశ్‌ ఖాన్‌ 4-0-60-0, కృష్ణప్ప గౌతమ్‌ 2-0-23-1, రవి బిష్ణోయ్‌ 4-0-34-1, స్టొయినిస్‌ 2-0-23-3. 

Updated Date - 2022-05-19T10:23:39+05:30 IST