లఖీంపూర్‌ ఖీరీకి కేసీఆర్‌!

ABN , First Publish Date - 2022-04-16T08:27:57+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఇకపై యుద్ధం చేస్తానని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.

లఖీంపూర్‌ ఖీరీకి కేసీఆర్‌!

  • రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి వాహనం తోలిన ఘటనలో బాధితులకు పరామర్శ!
  • బీజేపీతో యుద్ధ కార్యాచరణలో భాగంగానే!
  • త్వరలో ఢిల్లీకి సీఎం.. ఈసారి 10 రోజులు అక్కడే
  • ఆర్థికవేత్తలు, రైతు సంఘాల నేతలతో సమావేశం
  • ఢిల్లీ నుంచే లఖీంపూర్‌ సహా వివిధ ప్రాంతాలకు
  • మహారాష్ట్రకు వెళ్లి మరోసారి శరద్‌ పవార్‌తో భేటీ
  • పుణెలోనూ పలువురు మేధావులు, నేతలతో భేటీ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఇకపై యుద్ధం చేస్తానని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన కార్యాచరణను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు, ఈసారి పది రోజులపాటు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్‌.. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖీరీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చి ఆ తరువాత రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు వాహనాన్ని ఎక్కించడం, ఈ ఘటనలో రైతులు, జర్నలిస్టు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటన దేశంలో పెను ప్రకంపనలు సృష్టించింది. కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర నిరసనలు పెల్లుబికాయి. చివరికి యూపీ ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని, బీజేపీ విజయావకాశాలు దెబ్బతింటాయన్న ప్రచారం కూడా జరిగింది. అయితే రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంతోపాటు లఖీంపూర్‌ ఖీరీలోనూ కమలం పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కేసీఆర్‌ అక్కడికి వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం నగరంలో జరిగిన న్యాయాధికారుల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆ తరువాత ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు  వెళ్లారు. శనివారం ఓ వివాహానికి హాజరుకానున్నారు. 


అనంతరం ఆయన ఢిల్లీ టూర్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇటీవలే ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన సీఎం... ఏకంగా వారం పాటు అక్కడే ఉన్న విషయం తెలిసిందే. పంటి నొప్పితో బాధపడుతూ అక్కడి ఆస్పత్రిలో చూపించుకోవడానికి వెళ్లిన కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో 11న టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన దీక్షలో పాల్గొన్నారు. రైతు సంఘాల నేత రాకేశ్‌ తికాయత్‌ కూడా ఈ దీక్షకు హాజరైన విషయం తెలిసిందే. కాగా, అదే సందర్భంలో తాను మరోసారి ఢిల్లీకి వస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. ఈసారి టూర్‌లో మాత్రం పది రోజులుసీఎం అక్కడే ఉంటారని, అక్కడి నుంచే వివిధ ప్రాంతాల్లో పర్యటనలు చేపడతారని సమాచారం. ఈ సందర్భంగా ఢిల్లీలో పలువురు ఆర్థికవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశముంది. దేశ రైతాంగం కోసం ఇంటిగ్రేటెడ్‌ న్యూ అగ్రికల్చరల్‌ పాలసీ అవసరమంటూ ఇటీవల ప్రగతి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డ కేసీఆర్‌ దీనిని సాధించేందుకు తన సర్వశక్తులను ధారపోసి ప్రయత్నం చేస్తానన్నారు. ఇందుకోసం పలువురు ఆర్థికవేత్తలను పిలుస్తున్నానని, కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రైసె్‌స(సీఏసీపీ) మాజీ చైర్మన్‌ అశోక్‌ గులాటి, రైతు నాయకులు హైదరాబాద్‌కు వస్తామన్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులను, ఢిల్లీలో ఉద్యమం నిర్వహించిన రైతు సంఘాల నాయకులను హైదరాబాద్‌కు పిలిపించి వర్క్‌షాప్‌ పెట్టి, ఇంటిగ్రేటెడ్‌ న్యూ అగ్రికల్చర్‌ పాలసీని డిక్లేర్‌ చేస్తామని వెల్లడించారు. అందులో భాగంగానే ఢిల్లీలో వారితో భేటీ అవుతారని తెలుస్తోంది. వారితో మంతనాలు జరిపి, కేంద్ర వ్యతిరేక పోరాటంపై ప్రణాళికను రచించుకుంటారని సమాచారం. ఆ తరువాత లఖీంపూర్‌ ఖీరీ పర్యటనకు వెళ్లిన అనంతరం మహారాష్ట్రకు వెళ్లి ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌తో భేటీ అవుతారు. పుణెలోనూ కొంతమంది మేధావులు, నేతలతో కేసీఆర్‌ భేటీ అవుతారని సమాచారం.

Updated Date - 2022-04-16T08:27:57+05:30 IST