ఆశిష్ మిశ్రా బెయిల్‌ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం తీర్పు రిజర్వ్

ABN , First Publish Date - 2022-04-04T22:21:47+05:30 IST

లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ..

ఆశిష్ మిశ్రా బెయిల్‌ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రా తేనికి అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు సోమవారంనాడు రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్ చేసింది.


కేసు విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే మాట్లాడుతూ, అలహాబాద్ హైకోర్టు ఇంత హడావిడిగా ఈ విషయంలో (బెయిల్ మంజూరు విషయం) ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సీఆర్‌పీసీ 161 కింద 22 సాక్షులను సిట్ పరిశీలించి, 164 సీఆర్‌పీసి కింద 19 మంది సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేసిందని, ఇంత విస్తృతంగా సిట్ చేసిన దర్యాప్తును హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.


ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని సీనియర్ అడ్వకేట్ మహేష్ జెఠ్మలానీ  కోర్టుముందుంచారు. మిశ్రా, తదితురలపై ఉన్న అభియోగాల తీవ్రత దృష్ట్యా వారికి బెయిల్‌ మంజూరు చేయడానికి తమ ప్రభుత్వం వ్యతిరేకించదన్నారు. ఆశిష్ మిశ్రా తరఫున హాజరైన న్యాయవాది రంజిత్ సింగ్ తన వాదన వినిపిస్తూ, అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రద్దు చేస్తే తాను కానీ , ఏ కోర్టు కానీ  చేయగలిగేది ఏమీ ఉండదన్నారు. ఆశిష్ మిశ్రా‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సిట్ రెండుసార్లు సిఫార్సు చేసినట్టు కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు నియమించిన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించింది. దర్యాప్తు కొనసాగుతున్నందున సాక్షులకు ముప్పు జరిగే అవకాశం ఉందని, ఆ దృష్ట్యా నిందితులకు ఇచ్చిన బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని యూపీ హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీకి గత ఫిబ్రవరి 10,14 తేదీల్లో సిట్ లేఖలు రాసిందన్నారు. కాగా, ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. లఖింపూర్ ఘటనలో సాక్షులు, బాధిత కుటుంబాల రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఆ అఫిడవిట్‌లో పేర్కొంది.

Updated Date - 2022-04-04T22:21:47+05:30 IST