మహానందిలో వైభవంగా లక్ష బిల్వార్చన

ABN , First Publish Date - 2021-12-03T05:31:53+05:30 IST

మహానంది క్షేత్రంలో గురువారం లక్ష బిల్వార్చన పూజలను ఆలయ వేదపండితులు ఘనంగా నిర్వహించారు.

మహానందిలో వైభవంగా లక్ష బిల్వార్చన
ఆలయంలో లక్ష బిల్వార్చన నిర్వహిస్తున్న వేదపండితులు, అధికారులు

మహానంది, డిసెంబరు 2: మహానంది క్షేత్రంలో గురువారం లక్ష బిల్వార్చన పూజలను ఆలయ వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు జరిపారు. అనంతరం గోవును ప్రత్యేకంగా అలంకరించి గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచన పూజలు నిర్వహించారు. నల్లమల నుంచి సేకరించిన లక్ష బిల్వ దళాలకు ప్రధాన గర్భాలయంలో వేదపండితులు రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్‌, హనుమంత్‌ శర్మ, అర్చకులు రాజరత్తయ్యబాబులు వేదమంత్రాలతో పరమశివుడికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ఎర్రమల్ల మధు, గాయత్రి దంపతులతోపాటు లక్ష బిల్వార్చన దాతలు రామకృష్ణారెడ్డి, విజయకుమారి దంపతులతోపాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నేడు కామేశ్వరిదేవికి లక్ష కుంకుమార్చన: మహానంది క్షేత్రంలో కార్తీక మాసం ముగింపు పురష్కరించుకొని శుక్రవారం కామేశ్వరిదేవికి లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వనిపెంట ప్రకాశంశర్మ తెలిపారు. దీంతో మహానందిలో ఇంతటితో కార్తీక మాసోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

Updated Date - 2021-12-03T05:31:53+05:30 IST