లక్ష్మమ్మ చెరువు కలుషితం

ABN , First Publish Date - 2022-08-19T05:24:17+05:30 IST

పరిశ్రమ యాజ మాన్యం నిబంధనలు పాటించకపోవడం చుట్టుపక్క గ్రామాల ప్రజలకు శాపంగా మారింది.

లక్ష్మమ్మ చెరువు కలుషితం
చెరువులో విద్యుదాఘాతంతో మృతి చెందిన గేదెలు (ఫైల్‌)

- నిబంధనలు పాటించని పరిశ్రమ యాజమాన్యం 

- దుర్వాసనతో నాలుగు గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి

- వ్యర్థ జలాలతో లక్ష్మమ్మ చెరువు నీరు కలుషితం 

- మొన్న చేపలు, నిన్న గేదెలు మృత్యువాత

ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 18 : పరిశ్రమ యాజ మాన్యం నిబంధనలు పాటించకపోవడం చుట్టుపక్క గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. దీనికి తోడు పక్కనే 102 ఎకరాల్లో ఉన్న లక్ష్మమ్మ చెరువు నాశన మవుతోంది. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ జలాలతో చెరువు నీరు కలుషితమవుతోంది. దీనికి తోడు భయం కరమైన దుర్వాసనతో నాలుగు గ్రామాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చెరువులోని నీరు కలుషితమై గతంలో చేపలు చనిపోయాయి. చెరువులోంచి విద్యుత్‌ తీగ వేయడంతో నీరు తాగేందుకు వెళ్లిన రెండు గేదెలు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్యాక్టరీ యజమాన్యం స్థానిక నాయకులను మచ్చిక చేసుకొని, లోపాయికారిగా సెటిల్‌మెంట్లు, పంచాయితీలతో సరిపెడుతోంది. 


నాలుగు గ్రామాల ప్రజలకు ఇక్కట్లు

ఇటిక్యాల మండలంలోని కొండేరు గ్రామ శివారులో ఉన్న పరిశ్రమ నుంచి వచ్చే భరించలేని దుర్వాసన శేకుపల్లి, జింకలపల్లి, కోండేరు, ఎర్రవల్లి గ్రామాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ జలాలు చెరువులో కలుస్తుండటంతో నీరు కలుషిత మవుతోంది. కొద్ది రోజుల క్రితం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశంలో ఇటిక్యాల ఎంపీపీ స్నేహ ఈ విషయంపై జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, కలెక్టర్‌లకు ఫిర్యాదు చేశారు. సదరు పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో అప్పటి కలెక్టర్‌ శ్రీహర్ష ఈ విషయంపై విచారణ నిర్వహించిన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 


మత్స్యకారుల జీవనోపాధికి నష్టం

పరిశ్రమ పక్కనే 102 ఎకరాల్లో లక్ష్మమ్మ చెరువు ఉంది. పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థ జలం నిత్యం చెరువులో కలుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. దీంతో మత్స్యశాఖ అధ్వర్యంలో చెరువులో వదిలిన 3.20లక్షల చేపపిల్లలు చనిపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయంపై మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అలాగే పరిశ్రమకు అవసరమైన నీటి కోసం సమీప పొలాల్లోని బోరు నీటిని వినియోగించుకుంటోంది. అందుకు అవసరమైన విద్యుత్‌ కనెక్షన్‌ కోసం స్తంభాలు లేకుండా చెరువులోనుంచి విద్యుత్‌ తీగ వేసుకున్నారు. ఆ తీగ తెగిపోవడంతో బుధవారం చెరువులో నీరు తాగేందుకు వెళ్లిన రెండు గేదెలు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాయి. బాధిత రైతు గ్రామస్థులతో కలిసి పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టడంతో పరిహారం ఇచ్చి సెటిల్‌ చేసుకున్నట్లు తెలిసింది. 


డీఈకి నివేదిక ఇస్తాం

ఇండస్ర్టీయల్‌ విద్యుత్‌ను ప్యాక్టరీలో కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడం నేరమని  విద్యుత్‌ శాఖ ఏఈ నర్సింహారావు తెలిపారు. విద్యుదాఘాతంతో గేదెలు చనిపొయిన విషయం వాస్తవమని తెలిపారు. ఈ విషయంపై విచారణ నిర్వహించి, డీఈకి నివేదిక ఇస్తామని చెప్పారు.  

Updated Date - 2022-08-19T05:24:17+05:30 IST