లక్ష్యం చేరలా!

Published: Sun, 26 Jun 2022 23:33:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
లక్ష్యం చేరలా!కౌటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

లక్ష మెజారిటీ కోసం సర్వశక్తులూ ఒడ్డిన వైసీపీ

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఆత్మకూరులోనే!

అయినా గతం కంటే 18 శాతం పోలింగ్‌ తగ్గుదల

82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్‌రెడ్డి విజయం

19,332 ఓట్లతో సరిపెట్టుకున్న బీజేపీ

నోటాకు 4,179 ఓట్లు

అందరి అంచనాలు తలకిందులు


ఆత్మకూరు, జూన 26 : ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేదు. ఇంకేముంది లక్ష ఓట్ల మెజారిటీ తథ్యమనుకున్న అధికార పార్టీ నాయకులకు భంగపాటు తప్పలేదు. లక్ష్యం చేరేందుకు మందీమార్బలాన్ని దింపినా, తాయిలాల పంపికం చేపట్టినా 82,888 ఓట్ల మెజారిటీకే  పరిమితమైంది. మరోవైపు గట్టి పోటీ ఇచ్చామని భావించిన బీజేపీ 19,332 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు వేల పైచిలుకు నోటాకు రాగా ఇప్పుడు రెండింతల ఓట్లు వేసి అభ్యర్థులందరినీ తిరస్కరించడం గమనార్హం


దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. సంప్రదాయం ప్రకారం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఇక అధికార వైసీపీ, బీజేపీ, బీఎస్పీలతోపాటు మొత్తం 14 మంది బరిలో నిలిచారు. టీడీపీ బరిలో లేకపోవడంతో లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని వైసీపీ అగ్రనాయకులు భావించారు. ఆ లక్ష్యసాధనే ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఆత్మకూరులోనే మకాం వేసి ప్రచారాన్ని ఊదరగొట్టారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో మండలానికి ఓ మంత్రి, ఎమ్మెల్యేను ఇనచార్జులుగా నియమించారు. ఇంత చేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంత్రుల రోడ్‌ షోలు వెలవెలబోవడం, ప్రజావ్యతిరేకత వ్యక్తం కావడంతో తాయిలాలకు తెరలేపారు. ఓటరుకు రూ.500 చొప్పున నియోజకవర్గంలో మొత్తం 80 శాతం మందికి పంపిణీ చేసినట్లు సమాచారం. ఇందుకు బాధ్యులుగా వలంటీర్లు, పొదుపు వీఏవోలను నియమించుకున్నారు. ఇందుకుగాను వీరికీ రూ.5 వేలు చొప్పున ముట్టజెప్పారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ధాన్యం అమ్మిన రైతులకు బకాయిలను వెనువెంటనే చెల్లించేశారు.   జిల్లా మొత్తం ఎంతోమంది రైతులకు బకాయిలు ఉండగా కేవలం ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఇవ్వడంపై జిల్లా అంతటా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక కాంట్రాక్టర్ల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా వారికీ బిల్లులు మంజూరు చేసేశారు. ఇంత చేసినా పోలింగ్‌ శాతం మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు. 2019 ఎన్నికలతో పోల్చితే 18 శాతం పోలింగ్‌ తగ్గింది. ఈ ప్రభావం మెజారిటీపై పడింది.


భంగపడ్డ కమలనాథులు


ఇక కమలనాథులు గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించారు. 40నుంచి 50వేల ఓట్లు సాధించి రాష్ట్ర పార్టీలో కొత్త ఊపు తీసుకురావాలని భావించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు సోము వీర్రాజుతోపాటు రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌, టిజె వెంకటే్‌షతోపాటు అగ్రనేతలు దగ్గుపాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వంటి వారంతా ప్రచారంలో పాల్గొన్నారు. ఒక దశలో గెలు తమదేనన్నారు. అయితే వీరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆ పార్టీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి పోరాడినా  కేవలం 19,332 మాత్రమే సాధించగలిగారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ పార్టీకి 2వేల పైచిలుకు ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ మూడేళ్ల కాలంలో బీజేపీ బలపడిందని చెప్పడానికి వీలులేని పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఎన్నికల బరిలో లేదు కాబట్టి అసంతృప్తి ఓట్లు బీజేపీకి పడ్డాయనే వాదన ఉంది. ఇక బీఎస్పీకి తక్కువలో తక్కువగా 10 వేల ఓట్లు వస్తాయని భావిస్తే కేవలం 4897 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 


నోటా వైపే మొగ్గు 


ఈ ఉప ఎన్నికలో నోటాకు ఎక్కువ మంది ఓట్లు వేశారు. 2019లో 2 వేల పైచిలుకు ఓటర్లు మాత్రమే నోటాకు ఓటు వేస్తే ఇప్పుడు 4179 మంది నోటాకు ఓటు వేసి అభ్యర్థులందరినీ తరస్కరించడం గమనార్హం. టీడీపీ పోటీలో లేకపోవడం వైసీపీపై వ్యతిరేకతతో ఎక్కువగా నోటావైపే మొగ్గు చూపారు. బ్యాలెట్‌ ఓట్లలో సైతం నోటాకు మూడు ఓట్లు రావడం గమనార్హం.


బెట్టింగ్‌రాయుళ్ల డీలా


ఎన్నికల ఫలితాల పైఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి అత్యధికంగా లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని పందాలు కాసిన బెట్టింగుబాబుల ఆశలు నీరుగారాయి.   పోలింగ్‌ ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి వైసీపీ మెజార్టీపై కొందరు, బీజేపీకి 15 వేల ఓట్లు కూడా దాటవని మరి కొందరు బెట్టింగులు కాశారు.  జిల్లాలోనేగాక ఇతర జిల్లాల్లో సైతం బెట్టింగ్‌ల జోరు కొనసాగింది. పోలింగ్‌కు ముందు నుంచే కొంతమంది ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సర్వే చేసుకుని వెళ్లడం గమనార్హం.   వైసీపీకి అత్యధిక మెజార్టీ వస్తుందని కొందరు, 70 వేలకు పైబడి మెజారిటీ దక్కదని మరికొందరు పందేలు కాసినవారికి ఎదురుదెబ్బ తగిలింది. 


తొలిరౌండ్‌ నుంచే ఆధిక్యత


ఆత్మకూరు సమీపంలోని ఆంధ్ర ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొదట బ్యాలెట్‌ ఓట్లు (217) లెక్కించగా, వైసీపీకి 167, బీజేపీ 21, బీఎస్పీ 7, ఇతరులకు 10, నోటాకు మూడు ఓట్లు దక్కాయి. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు. మొదటి రౌండ్‌ నుంచి వైసీపీ అభ్యర్థి తన ఆధిక్యతను చాటుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,338  ఓట్లు ఉండగా, 1,37,038 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు, బీజేపీ అభ్యర్థి భరతకుమార్‌కు 19,332 ఓట్లు, బీఎ్‌సపీ అభ్యర్థి నందా ఓబులేశుకు 4,897 ఓట్లు, నోటాకు 4,179, ఇతరులకు 6,599 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ ఆధిక్యత కొనసాగింది. మేకపాటి సొంత మండలమైన మర్రిపాడులో 13,073 ఓట్లు మెజార్టీ సాఽధించారు. అనంతసాగరంలో 14,094 ఓటు, ఆత్మకూరు రూరల్‌ పరిధిలో 10285 ఓట్లు, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 9152 ఓట్లు, చేజర్లలో 10,285, ఏఎ్‌సపేటలో 10,415, సంగంలో 15,429 ఓట్ల  ఆధిక్యతను సాాఽధించారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తవగా, 82,888 వేల ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరేందిరప్రసాద్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు డిక్లరేషన ఫాం అందజేశారు. విక్రమ్‌రెడ్డి గెలుపొందడంతో వైసీపీ నేతలు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

 ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా... సేవ చేసి ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కౌంటింగ్‌ అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి సుపరిపాలనలో గౌతమన్న ఆశయాలకు అనుగుణంగా ఆత్మకూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న సాగు, తాగునీటి సమస్య పరిష్కారమే తన మొట్టమొదటి లక్ష్యమన్నారు.

 

అధికార దుర్వినియోగం : బీజేపీ

ఉప ఎన్నికలో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినా ప్రజలు ఆశించిన స్థాయిలో ఓట్లు లేక పోవడంతో గర్వ భంగం తప్పలేదని బీజేపీ అభ్యర్థి భరతకుమార్‌ యాదవ్‌ విమర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మందీమార్బలంతో ఆత్మకూరులో మోహరించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. వలంటీర్ల వ్యవస్థ, డబ్బు ప్రభావం, విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టారని ఆరోపించారు. చాలా గ్రామాల్లో బీజేపీకి ఏజెంట్లు కూడా లేకుండా చేశారని, బీజేపీకి 19 వేల ఓట్లకుపైబడి వచ్చాయని అన్నారు. ఆదరించిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. బీజేపీకి గత ఎన్నికల కన్నా ఓటింగ్‌ శాతం పెరిగిందని అన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.