రూ.5 కోట్ల భూమిపై.. ఖద్దరు కన్ను

ABN , First Publish Date - 2021-07-27T05:13:49+05:30 IST

నగరానికి సమీపంలో జాతీయ రహదారికి కూతవేటు దూరంలో రూ. కోట్లు విలువ చేసే ఆ పోరంబోకు భూమిపై ఖద్దరు చొక్కా కన్ను పడింది.

రూ.5 కోట్ల భూమిపై..  ఖద్దరు కన్ను
తక్కెళ్లపాడులో వివాదాస్పద భూమిని సర్వే చేస్తున్న సర్వేయర్‌

ఐదు దశాబ్దాల నుంచి పోరంబోకు స్థలం

రాత్రికిరాత్రే ఫెన్సింగ్‌.. రికార్డుల్లో అనుచరుడి పేరు 

అధికారులకు అధికార పార్టీ గ్రామ కన్వీనర్‌ ఫిర్యాదు

సర్వేయర్‌ అసంపూర్తిగా సర్వే చేశారని గ్రామస్థుల ఆరోపణ

 

54 సెంట్లలో ఉన్న ఆ భూమి రూ.5 కోట్లు పలుకుతుంది.  గుంటూరు నగరం జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉన్న ఈ భూమి ఐదు దశాబ్దాలుగా పోరంబోకుగా ఉన్నది. ఇటీవల పేదలకు భూముల కోసం చేసిన అన్వేషణలో ఈ భూమి వ్యవహారం వెలుగుచూసింది. దీంతో ఆ భూమిపై ఖద్దరు చొక్కా కన్నుపడింది. రూ.కోట్ల విలువైన భూమిని ఎలాగైనా కాజేయాలని ఆ నేత ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఆ భూమిని కాపాడుకునేందుకు స్థానికంగా కొంతమంది ముందుకు వచ్చారు. అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయితే సర్వేయర్‌ అసంబద్ధంగా సర్వే నిర్వహించి ప్రభుత్వానికి కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తోన్నట్లు స్థానిక వైసీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. 


గుంటూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): నగరానికి సమీపంలో జాతీయ రహదారికి కూతవేటు దూరంలో రూ. కోట్లు విలువ చేసే ఆ పోరంబోకు భూమిపై ఖద్దరు చొక్కా కన్ను పడింది. నేరుగా కాకుండా తెరవెనక ఉండి ఆ భూమిని కొట్టేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోన్నారు. భూమి రికార్డులను తారుమారు చేసి వేరొకరి స్వాధీనంలో ఉన్న భూమిలోకి దానిని కలిపేసి ఆ తర్వాత తన ఆధీనంలోకి తీసుకొనేందుకు పథకరచన జరిగినట్లు చర్చ జరుగుతోన్నది. అసలు అక్కడ పోరంబోకు భూమి అనేది లేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తోన్నారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఆ భూమిని కాపాడుకొనేందుకు స్థానికంగా కొంతమంది ఛైతన్యవంతమై జిల్లా ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సర్వేయర్‌ అసంబద్ధంగా సర్వే నిర్వహించి ప్రభుత్వానికి కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తోన్నట్లు స్థానిక వైసీపీ నాయకులే ఆరోపిస్తోన్నారు.


1995లో మృతి.. 2000లో పాసు పుస్తకం

పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో 54 సెంట్ల పోరంబోకు భూమి ఉన్నది. మొదట్లో కరణంగా పని చేసిన కే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పేరు మీద ఉన్నది. ఆయన 1974లో చనిపోయారు. అయితే విచిత్రంగా 1995లో పట్టాదారు పాసుబుక్‌ ఆయన పేరు మీద జారీ అయింది. అలానే 2000లో సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన సోదరుడు లక్ష్మీనరసింహం పేర్ల మీద టైటిల్‌ డీడ్‌ జారీ చేశారు. కాగా సుబ్రహ్మణ్యం చనిపోయినప్పటి నుంచి ఆ భూమి పోరంబోకుగానే ఉన్నది. అందులో పంట వేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. భూమి రికార్డుల్లో మాగాణిగా ఉన్నది. అలాంటప్పుడు 50 ఏళ్ల నుంచి దీనిపై ఎలాంటి శిస్తు ఎందుకు వసూలు చేయలేదో అధికారులకే తెలియాలి. 

నందివెలుగు రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడున్న పేదల గుడిసెలు తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో స్థానిక వైసీపీ నాయకులు పేదలకు ఇచ్చేందుకు పోరంబోకు భూముల కోసం అన్వేషించగా తక్కెళ్లపాడులో భూమి ఉన్నట్లు గుర్తించారు. అక్కడ ప్రస్తుతం సెంటు భూమి రూ.10 లక్షల వరకు ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే 54 సెంట్ల భూమి రూ.5.40 కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమిపై కన్నేసిన నేతలు అది పోరంబోకు భూమి కాదు.. తమదేనంటూ ఇటీవలే రాత్రికి రాత్రే ఫెన్సింగ్‌ వేసేశారు. దాంతో వైసీపీ గ్రామ కన్వీనర్‌ చంద్రశేఖర్‌ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌తో పాటు సీసీఎల్‌ఏకి ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం సాయంత్రం మండల సర్వేయర్‌ గ్రామానికి వెళ్లి సర్వే నిర్వహించారు. అక్కడ 90 లింకుల రోడ్డు ఉన్నదని, అది తీసేయగా 54 సెంట్ల భూమి ఆ సర్వే నెంబరులో ఉన్నట్లు తేలినట్లు సర్వేకి హాజరైన వారు తెలిపారు. అయితే సర్వేయర్‌ మాత్రం తారుమారు చేసి భూమిని వేరొకరిపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కాకపోయినా తక్కెళ్లపాడు, ఉప్పలపాడు, వెంకటకృష్ణాపురం, గారపాడు తదితర గ్రామాల్లో నివాసం ఉంటున్న  ప్రజలకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బంగారం లాంటి ఈ భూమిని కాపాడేందుకు జిల్లా, రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


Updated Date - 2021-07-27T05:13:49+05:30 IST