సెజ్‌ కోసం 880 ఎకరాల భూసేకరణ

ABN , First Publish Date - 2021-06-22T05:22:29+05:30 IST

పరిశ్రమల ఏర్పాటు కోసం టేకులోడు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం 880.37 ఎకరాలను సేకరిస్తోందని ఇనచార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ మధుసూదన వెల్లడించారు.

సెజ్‌ కోసం 880 ఎకరాల భూసేకరణ
సబ్‌ కలెక్టర్‌తో మాట్లాడుతున్న రైతులు

-ఎకరానికి రూ.25 లక్షల ధర నిర్ణయం

-టేకులోడు గ్రామసభలో సబ్‌ కలెక్టర్‌ మధుసూధన

చిలమత్తూరు, జూన 21: పరిశ్రమల ఏర్పాటు కోసం టేకులోడు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం 880.37 ఎకరాలను సేకరిస్తోందని ఇనచార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ మధుసూదన వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన అధ్యక్షతన టేకులోడు పంచాయతీ కేంద్రంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు అందించే పరిహారాన్ని ఆయా ప్రాంత రిజిస్ర్టేషన విలువను బట్టి నిర్ధారిస్తామన్నారు. గత మూడేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన రిజిస్ర్టేషన్ల ఆధారంగా లెక్కగట్టి పరిహార మొత్తాన్ని ప్రకటించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎకరం విలువ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.20.50 లక్షలుగా ఉందన్నారు. తన అధికార పరిధికి లోబడి మరో రూ.1.50 లక్షతో కలిపి రూ.22 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామన్నారు. అయితే దీనికి రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రస్థుతం మండలంలో ఎకరం కోటి వరకు ధర పలుకుతోందని, అందులో కనీసం సగం ధర ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలా కుదరదని ఎకరానికి రూ.25 లక్షలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని సబ్‌కలెక్టర్‌ వివరించారు. ఇందుకు  రైతులు సమ్మతించడంతో అధికారికంగా ఎకరాకు రూ.25 లక్షలుగా ప్రకటించారు. పట్టాభూములకు, అసైన్డ పట్టాభూములకు కూడా ఇదే విలువ వర్తిస్తుందన్నారు. పండ్ల తోటలకు, ఇతర చెట్లకు ప్రభుత్వం అదనంగా పరిహారాన్ని కేటాయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రంగనాయకులు, ఎంపీడీఓ సుధామణి, ఎస్‌.ఐ రంగడుయాదవ్‌, ఆర్‌.ఐ భాస్కరరెడ్డి, సర్పంచ సరోజమ్మ, పంచాయతీ కార్యదర్శి కెంచరాయప్ప, నాయకులు జబీవుల్లా, శేషాద్రిరెడ్డి, బయపరెడ్డి, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T05:22:29+05:30 IST