కలెక్టరేట్‌ సమీపంలోనే కబ్జాపర్వం

ABN , First Publish Date - 2022-09-20T06:05:32+05:30 IST

కూతవేటులో కలెక్టరేట్‌ కార్యాలయం వున్నా ప్రభుత్వ స్థలానికి ఓ కబ్జా ముఠా కంచె వేసేందుకు సిద్ధమైంది.

కలెక్టరేట్‌ సమీపంలోనే కబ్జాపర్వం

హైవే పక్కనే పొలాల దారిని ఆక్రమించే ప్రయత్నం 

 

తిరుపతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):కూతవేటులో కలెక్టరేట్‌ కార్యాలయం వున్నా  ప్రభుత్వ స్థలానికి ఓ కబ్జా ముఠా కంచె వేసేందుకు సిద్ధమైంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారికి కలసిపోయినట్టు కనిపించే ఈ ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతోంది. రేణిగుంట మండలం తూకివాకం గ్రామ లెక్కదాఖలా సర్వే నెంబరు 717/బీలో సుమారు 60 సెంట్లు ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది.ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలని ఓ ముఠా పథకం రచించింది. ఆ సమాచారాన్ని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చెవిలో వేసి వారం రోజులుగా పనులు మొదలుపెట్టింది.పొక్లెయిన్లతో చదునుచేసి చుట్టూ నాటేందుకు రాతికూసాలను తెప్పించారు. జాతీయ రహదారి విస్తరణ కోసం వదిలిన మరో 40 అడుగుల స్థలాన్ని కూడా పనిలోపనిగా శుభ్రం చేసి పెట్టారు.సహజంగానే హైవే పక్కన స్థలానికి మంచి డిమాండు ఉంటుంది.పక్కనే ప్రముఖ ఆటోమొబైల్స్‌ షోరూములుండడంతో దాదాపు అంకణం రూ.2లక్షల దాకా ధర పలుకుతోంది. 717/బీలో ప్రభుత్వ భూమి సుమారు 23 అడుగుల వెడల్పు, 600 అడుగుల పొడవు కలిగి ఉంది. అంటే దాదాపు రూ.5కోట్లు విలువైన భూమి ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. తిరుపతి రూరల్‌, రేణిగుంట, ఏర్పేడు మండలాలకు సంబంధించిన వివాదాస్పద భూములను గుర్తించడం, అధికార పార్టీనేతలు, కొందరు రెవెన్యూ అధికారుల అండతో ఆ భూముల్లో పాగా వేయడం, స్థల యజమానులు అమాయకులైతే నకిలీ పత్రాలతో వివాదాలను సృష్టించడం ఈ కబ్జా ముఠా వ్యవహారశైలిగా చెప్పుకుంటున్నారు. వస్తే ప్లాటు, లేదంటే ఎంతోకొంత నగదు తీసుకుని పక్కకు వెళ్లిపోవడం, ఈక్రమంలో వచ్చే మొత్తంలో పెద్దలకు వాటాలు ఇస్తుంటారని సమాచారం.  


 కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు


హైవే పక్కన ఉన్న ప్రభుత్వ భూమికి ఆనుకునే సర్వే నెంబరు 708, 709లో 10.84ఎకరాల పట్టాభూమి  దాదాపు 15 మంది రైతుల ఆధీనంలో ఉంది. రైతులు వారి భూముల్లోకి వెళ్లాలంటే హైవేకు ఆనుకుని ఉన్న ఈ ప్రభుత్వ భూమిలోనుంచి దారి ఉంది. వారి షెడ్యూళ్లలోనూ ఉత్తర దిక్కున హైవే రోడ్డుగా చూపించివుంది. దీంతో ఆ మార్గంలోనే వారు రాకపోకలు సాగించేవారు.అది కాస్తా ఆక్రమణకు గురైతే వీరికి దారి ఉండదు. కబ్జాదారులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి బలం సరిపోలేదు. దీంతో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రమణా రెడ్డికి బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ కాకుండా చూడాలని విన్నవించారు. 


పరిశీలించి చర్యలు తీసుకుంటాం 

తూకివాకం గ్రామ లెక్క దాఖలా 717/బీలో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని స్పందనలో ఫిర్యాదు వచ్చింది. అయితే అక్కడ ప్రభుత్వ భూమి ఉందా?లేదా? అనేది పరిశీలించాల్సి ఉంది. రెవెన్యూ భూమిని ఆక్రమిస్తున్నట్టు తేలితే చర్యలు తీసుకుంటాం.

-శివప్రసాద్‌, రేణిగుంట తహసీల్దార్‌, 


Updated Date - 2022-09-20T06:05:32+05:30 IST