రైల్వే ఉద్యోగాలకు భూముల లంచం.. లాలూపై సీబీఐ మరో కేసు

Published: Sat, 21 May 2022 02:36:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రైల్వే ఉద్యోగాలకు భూముల లంచం.. లాలూపై సీబీఐ మరో కేసు

ఏకకాలంలో 17 చోట్ల సీబీఐ సోదాలు

న్యూఢిల్లీ/పట్నా, మే 20: రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరో కేసును నమోదు చేసింది. 2004-09 మధ్య కాలంలో ఆయన యూపీఏ-1 హయాంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో జరిగిన రైల్వే రిక్రూట్‌మెంట్లలో కొందరు అభ్యర్థులకు గ్రూప్‌-డీ ఉద్యోగాలు ఇప్పించేందుకు వారి నుంచి భూములను లంచంగా రాయించుకున్నారని సీబీఐ తాజా అభియోగాలు మోపింది. ఈ కేసులో లాలూ సతీమణి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కూతురు, రాజ్యసభ సభ్యురాలు మిసా భారతీ, హేమాయాదవ్‌, ఇతర కుటుంబ సభ్యులు, ఉద్యోగాలు పొందిన 12 మందిని నిందితులుగా చేర్చింది. గత ఏడాది సెప్టెంబరు 21న ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేశామని, ఈ నెల 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని సీబీఐ వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఢిల్లీ, పట్నా, గోపాల్‌గంజ్‌లోని లాలూ, అతని కుటుంబ సభ్యులకు చెందిన 17 ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. లాలూ కుటుంబీకుల పేరిట పట్నాలోనే ఉన్న ఆ భూముల మార్కెట్‌ విలువ రూ. 4.39 కోట్లు అని సీబీఐ స్పష్టం చేసింది. కాగా.. దాణా కుంభకోణంలో 14 ఏళ్ల జైలు శిక్షలో ఉన్న లాలూకు ఇటీవలే బెయిల్‌ లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ కేసు నమోదు చేయడం కేంద్ర ప్రభుత్వ కుట్రేనంటూ ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.