కన్వర్షన్ల అధికారం తహసీల్దార్లదే

ABN , First Publish Date - 2020-11-30T04:50:40+05:30 IST

కన్వర్షన్ల అధికారం తహసీల్దార్లదే

కన్వర్షన్ల అధికారం తహసీల్దార్లదే

గెజిట్‌ జారీ చేసిన ప్రభుత్వం

జీవో రావడమే తరువాయి

ఖమ్మంటౌన్‌, నవంబరు 29 : వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే (కన్వర్షన్‌) అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగిస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. ఇక జీవో రాగానే తహసీల్దార్లు కన్వర్షన్లను చేస్తారు. ఇంతవరకు కన్వర్షన్‌ అధికారం రెవెన్యూ డివిజనల్‌ అధికారికి ఉండగా, దీనిని తహసీల్దార్లకు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇవ్వడంతో ఖమ్మం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని మండలాలకు సంబంధించిన వందలాది కన్వర్షన్‌ ఫైళ్ల పరిష్కారంలో సందిగ్ధత నెలకొంది. తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి రెవెన్యూ డివిజన్‌ కార్యాలయానికి వచ్చిన కన్వర్షన్‌ ఫైళ్ల పరిష్కారం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయారు. గత నెల 13వ తేదీ నుంచి సదరు ఫైళ్లు ఆర్డీవో కార్యాలయంలోనే ఉన్నాయి. వాటిని ఆయా తహసీల్దార్‌ కార్యాలయాలకు తిరిగి పంపాలన్నా ప్రభుత్వ ఆదేశాలు లేకపోవటంతో అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మండల తహసీల్దార్లకు కన్వర్షన్‌ అధికారాలను అప్పగిస్తూ గెజిట్‌లో ప్రకటించంతో కన్వర్షన్‌ ఫైళ్లకు మోక్షం లభించనుంది.

కన్వర్షన్‌ లేక అనుమతులు నిలిపివేత..

వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే (కన్వర్షన్‌) ప్రక్రియ నిలిచిపోవడంతో నిర్మాణ అనుమతులు ఆగిపోయాయి. సదరు స్థలంలో ఇల్లు లేదా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టాలన్నా కన్వర్షన్‌ ధ్రువపత్రం తప్పనిసరి. ప్రస్తుతం 40 రోజులకు పైగా కన్వర్షన్ల ప్రక్రియ ఆగిపోవటంతో అనుమతుల కోసం ధరఖాస్తుచేసిన వారు ధ్రువపత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం గెజిట్‌ ప్రకటించటంతో మరో రెండు, మూడు రోజుల్లో తహసీల్దార్లకు కన్వర్షన్‌ అధికారం ఇస్తూ జీవో జారీచేసే అవకాశం ఉంది. అయితే కన్వర్షన్లను కూడా ధరణి పోర్టల్‌లోనే చేయనున్నారు.

Updated Date - 2020-11-30T04:50:40+05:30 IST