అధికార పార్టీ నేతల ‘ధన’కార్యాలు

ABN , First Publish Date - 2022-08-12T06:36:00+05:30 IST

అధికార పార్టీ నేతల ‘ధన’కార్యాలు

అధికార పార్టీ నేతల ‘ధన’కార్యాలు
తోటమూలలోని వివాదాస్పద మిగులు భూములు

తోటమూల జగనన్న లే అవుట్‌ మిగులు భూములపై కన్ను

తహసీల్దార్‌ నకిలీ సంతకంతో పొజిషన్‌ సర్టిఫికెట్లు జారీ

తిరువూరులో ఎమ్మెల్యే  అనుచరుడి అక్రమ మార్గం

లబ్ధిదారుల వద్ద డబ్బు వసూలు

పట్టించుకోని తహసీల్దార్‌, పోలీసులు

కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో అక్రమాలు వెలుగులోకి.. 

గుడివాడలో ఎమ్మెల్యే మద్దతుదారులదీ ఇదే పరిస్థితి

మల్లాయపాలెం టిడ్కో ఇళ్లకు బేరాలు


రెవెన్యూ కళ్లు మూసుకుంటుంటే.. అధికార పార్టీ దొంగలు కాసులు పిండుకుంటున్నారు. జగనన్న లే అవుట్లు, టిడ్కో ఇళ్ల పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులు అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు. సొమ్ము చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు. తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారు. వ్యవస్థలు అక్రమార్కులకే సహకరిస్తుండటంతో జిల్లా యంత్రాంగాలకు నేరుగా ఫిర్యాదు చేసే వరకు వచ్చింది. తాజాగా గంపలగూడెం మండలంలోని తోటమూల జగనన్న లే అవుట్లో జరిగిన వ్యవహారం వివాదాస్పదమైంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గంపలగూడెం) : గంపలగూడెం మండలంలో పెదకొమెర గ్రామానికి హామ్లెట్‌ గ్రామంగా శివారున తోటమూల ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం ఖరీదైనదిగా మారుతోంది. గ్రామంలో పదికి పైగా రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. నలువైపులా రోడ్లు ఏర్పడటంతో అనతికాలంలోనే ఇదొక జంక్షన్‌లా మారిపోయంది. భూముల విలువ కూడా పెరిగింది. ఇలాంటి ప్రాంతంలో సబ్‌స్టేషన్‌కు చెందిన భూముల్లో జగనన్న లే అవుట్‌ వేశారు. లే అవుట్‌ వేయగా, దాదాపు మూడెకరాల స్థలం మిగిలి ఉంది. ఈ మిగులు స్థలం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు చెందుతుంది. ఈ స్థలంపై స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి కన్ను పడింది. లే అవుట్‌ వెంబడి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ బేరాలు కుదుర్చుకున్నాడు. కొందరి వద్ద డబ్బు కూడా వసూలు చేశాడు. డబ్బు ఇచ్చిన కొంతమందికి ఎమ్మెల్యే అనుచరుడు పొజిషన్‌ పట్టాలు కూడా ఇచ్చాడు. ఈ పట్టాలు ఇచ్చే అధికారం ఒక్క తహసీల్దార్‌కే ఉంటుంది. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ పట్టాలు సృష్టించారు. 

మిన్నకున్న రెవెన్యూ యంత్రాంగం

బోగస్‌ పొజిషన్‌ సర్టిఫికెట్లపై కలెక్టర్‌ దిల్లీరావుకు ఫిర్యాదు అందటంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కి పడింది. కానీ, మండల రెవెన్యూ యంత్రాంగానికి మాత్రం చీమకుట్టినట్టైనా లేదు. దీనికి స్థానిక తహసీల్దార్‌ బాధ్యత తీసుకోవాలి. నకిలీ పట్టాలు ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదించాలి. కానీ, ఈ వ్యవహారంలో తహసీల్దార్‌ మౌనంగానే ఉన్నారు. దీంతో ఆయన అధికార పార్టీ అనుచరుడికి సహకరిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఈ అంశంపై పోలీసులకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. తమది కాని అంశం స్టేషన్‌కు రావటంతో పోలీసులు కూడా ఫిర్యాదుదారులతో ఆడుకుంటున్నారు. పోలీసు స్టేషన్‌కు పిలిపించి హెచ్చరిస్తున్నారు. అలాగే, కలెక్టర్‌ దిల్లీరావుకు ఫిర్యాదు అందాక ఎమ్మెల్యే అనుచరుడు బెదిరింపులకు దిగాడని తెలిసింది. ఈ విషయంపై మాట్లాడితే వచ్చే స్థలాలు పోతాయంటూ తాను డబ్బు తీసుకున్న వారితో అన్నట్టు సమాచారం. దీంతో వ్యవహారాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే, దొంగ పొజిషన్‌ పట్టాలు కొన్ని బయటకు వచ్చేశాయి. దీంతో కలెక్టర్‌ విచారణ ప్రారంభించారు.

గుడివాడలోనూ ఇంతే..

గత ప్రభుత్వ హయాంలో గుడివాడ మండల పరిధిలోని మల్లాయపాలెంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు స్థానిక ఎమ్మెల్యే మద్దతుదారులు బేరానికి పెట్టారు. కొందరికి విక్రయించేశారు కూడా. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. గుడివాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పలు టిడ్కో ఇళ్లలో అర్హుల పేర్లను తొలగించి మద్దతుదారుల పేర్లను తెరపైకి తీసుకురావడం విమర్శలకు దారితీస్తోంది.



Updated Date - 2022-08-12T06:36:00+05:30 IST