ల్యాండ్‌ ఫైటింగ్‌!

ABN , First Publish Date - 2022-05-26T08:16:39+05:30 IST

హైదరాబాద్‌, ఓరుగల్లు, న్యూస్‌ నెట్‌వర్క్‌ మే 25 (ఆంధ్రజ్యోతి): పచ్చని భూముల్లో ఇప్పుడు అగ్గి రాజుకుంటోంది! రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, ఎక్స్‌ప్రెస్‌ రోడ్లు, ఔటర్‌ రింగు

ల్యాండ్‌ ఫైటింగ్‌!

జిల్లాల్లో భూముల సేక‘రణం’.. సమీక‘రణం’

ల్యాండ్‌ పూలింగ్‌కు ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల సేకరణ

రోడ్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు పట్టా భూములపైనా కన్ను

సాగు యోగ్యం కాని భూములు ఇచ్చేందుకు సానుకూలత

వివాదాస్పదంగా మారుతున్న సాగు భూముల సేకరణ

ఇప్పటికే ఖమ్మంలో కొనసాగుతున్న రైతుల ఆందోళన

ల్యాండ్‌ పూలింగ్‌పై మరికొన్ని జిల్లాల్లోనూ అభ్యంతరాలు

హైదరాబాద్‌, ఓరుగల్లు, న్యూస్‌ నెట్‌వర్క్‌ మే 25 (ఆంధ్రజ్యోతి): పచ్చని భూముల్లో ఇప్పుడు అగ్గి రాజుకుంటోంది! రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, ఎక్స్‌ప్రెస్‌ రోడ్లు, ఔటర్‌ రింగు రోడ్డు తదితరాలకు ప్రభుత్వం సాగు భూములను సమీకరిస్తుండంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు నీరు అందుబాటులోకి రావడంతో ఇప్పటికే భూముల ధరలు భారీగా పెరిగాయి. దాంతో, తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే ఖమ్మం, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ తదితర ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేస్తుండగా.. తాజాగా వరంగల్‌లోనూ అన్నదాతలు రోడ్డెక్కారు. దాంతో, భూముల సమీకరణ వివాదాస్పదంగా మారుతోంది.

వరంగల్‌లో ఓఆర్‌ఆర్‌ సేక‘రణం’

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధి పేరిట ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. ప్రత్యేక నిధులేమీ కేటాయించకపోవడంతో ల్యాండ్‌ పూలింగ్‌ కింద ప్రభుత్వం భూములు సమీకరించనుందనే ప్రచారం జరిగింది. దీనిపై స్థానిక రైతుల్లో కలవరం మొదలైంది. అదే సమయంలో, భూ సమీకరణ పేరిట ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాంతో, రైతుల్లో ఆందోళన పెరిగింది. పచ్చని పొలాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో వ్యాపారం ఏమిటంటూ రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఇక్కడి భూములకు ఎకరానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ ధర పలుకుతోందని, ఇక్కడివన్నీ మూడు పంటలు పండే సారవంతమైన భూములని, ప్రభుత్వానికి ఇచ్చే సమస్యే లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. వరంగల్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నారని తెలిసి.. ప్రతిపాదిత నిర్మాణానికి ఆనుకొని ఎమ్మెల్యేలు, వారి బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని, వాటి విలువ పెంచుకోవడం కోసమే ఇప్పుడు ల్యాండ్‌ పూలింగ్‌ను తెరపైకి తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట రైతులు ఆందోళన బాట పట్టగా ల్యాండ్‌ పూలింగ్‌ నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ, సంబంధిత జీవోను రద్దు చేయలేదు. దాంతో, దానిని రద్దు చేయాలంటూ తాజాగా బుధవారం రైతులంతా రోడ్డెక్కారు. నిజానికి, వరంగల్‌ చుట్టూ 70 కిలోమీటర్ల మేర ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే, నగర శివారులోని ఢిల్లీ స్కూల్‌ నుంచి ఆరేపల్లి శివారు వరకూ 29 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. దీనికి కనెక్ట్‌ చేసేలా 49 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ నిర్మించాల్సి ఉంది. దీని నిర్మాణానికి 21,500 ఎకరాల భూములు సమీకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో మంత్రి కేటీఆర్‌ కూడా గతంలో స్పందించారు. రైతులకే ఎక్కువ లాభం జరుగుతుందని వివరించారు. అయినా, ఇక్కడి రైతులు ససేమిరా అంటున్నారు.

సర్కారీ రియల్‌ వివాదం

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల్లోనూ కొన్ని చోట్ల వివాదాలు చుట్టుముడుతున్నాయి. భూములు ఇచ్చేందుకు కొన్ని చోట్ల రైతులు ముందుకు వస్తుంటే.. మరికొన్నిచోట్ల ససేమిరా అంటున్నారు. దీంతో వివాదం రాజుకుంటోంది. భూముల అమ్మకం ద్వారా రూ.30వేల కోట్ల వరకూ రాబట్టాలని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్‌ పూలింగ్‌ కింద 40 వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ల్యాండ్‌ పూలింగ్‌పై కొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌ కింద కరీంనగర్‌ జిల్లాలోని గోపాల్‌పూర్‌లో 120 ఎకరాల అసైన్డ్‌ భూమి, నిర్మల్‌ జిల్లాలో మూడు మండలాల్లో 144.51 ఎకరాలను, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జంగేడు శివారులో 197 ఎకరాల అసైన్డ్‌ భూమిని అధికారులు గుర్తించి రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. యాదాద్రి జిల్లాలో నాలుగు చోట్ల 120 ఎకరాలను ప్రతిపాదించారు. వికారాబాద్‌ జిల్లాలో 120 ఎకరాల్లో ల్యాండ్‌ పూలింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ జిల్లాలో నాలుగు చోట్ల ప్రతిపాదించగా మూడుచోట్ల రైతులు అంగీకరించారు. గంగారంలో వ్యతిరేకించారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌, బెల్లంపల్లి మండలాల్లో 100 ఎకరాల చొప్పున అసైన్డ్‌ భూములను గుర్తించి ల్యాండ్‌ పూలింగ్‌కు ప్రతిపాదించగా రైతుల వ్యతిరేకతతో ఆగిపోయింది. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో 136 ఎకరాల అసైన్డ్‌ భూమిని తీసుకోవాలని నిర్ణయించగా ఆ భూములకు చెందిన 126 మంది రైతుల్లో 114 మంది అంగీకరించారు. ఆసిఫాబాద్‌లో 100 ఎకరాల భూమిలో ప్రతిపాదించగా రైతులు వ్యతిరేకతతో ఆగిపోయింది. ఇక, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరులో 77 ఎకరాల పట్టా భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద తీసుకోవాలని హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకుంది. అభివృద్ధి చేసిన భూమిలో 60 శాతం రైతులకు, 40 శాతం ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించింది. వికారాబాద్‌ లో ఎకరాకు ప్రతిగా 100-200 గజాలు మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఎకరాకు 600 గజాలు ఇవ్వనున్నట్లు రైతులకు ప్రతిపాదించారు. యాదాద్రి జిల్లాలో ఎకరాకు 600 గజాల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటికీ నీరు లేక, సాగుకు యోగ్యం కాని అసైన్డ్‌ భూములను ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. కానీ, సాగు భూముల సేకరణకు అంగీకరించడం లేదు. పట్టా భూములన్న వారైతే భూములిచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఇక, అప్పులకు అనుమతి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. ఈ గడ్డు పరిస్థితి నుంచి బయట పడడానికి భూముల అమ్మకంపైనే ఆశ పెట్టుకుంది. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను సేకరించి, వాటిని లే అవుట్లుగా మార్చి అమ్మేయాలని నిర్ణయించింది. ఒక్కో జిల్లాలో కనీసం 500 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను అమ్మాలని జిల్లాల కలెక్టర్లకు ఇటీవల సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ టార్గెట్‌ విధించారు. రాబోయే మూడు నాలుగు నెలల్లోనే భూముల అమ్మకం ద్వారా రూ.30 వేల కోట్ల వరకూ రాబట్టాలని నిర్దేశించారు. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు లేని చోట్ల పట్టా భూమునూ గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. భూమి తీసుకుని లే అవుట్‌ వేసిన తర్వాత ఎకరానికి 600 గజాల నుంచి 1200 గజాల వరకూ ఇస్తామని ఆఫర్‌ చేస్తున్నారు. పనికిరాని భూముల విషయంలో సానుకూలత వ్యక్తమవుతోంది. కానీ, సాగు భూములు తీసుకోవాలని చూస్తే వివాదాస్పదమవుతోంది.

ప్రాణ త్యాగానికైనా సిద్ధమే

ఓవైపు.. ప్రాజెక్టుల నిర్మాణంతో చెరువులు అలుగులు పోస్తున్నాయని అంటున్నారు. మరోవైపు.. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో సాగు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం. ప్రాణ త్యాగానికైనా సిద్ధం తప్ప భూములను మాత్రం ఇవ్వం.

- హింగే హరికిషన్‌ రావు, దామెర, హన్మకొండ జిల్లా

రైతును రాజును చేయడమంటే ఇదా?

రైతులంటే భూమిని నమ్ముకునే బతుకుతారు. రైతును రాజును చేస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. ఇప్పుడేమో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో సాగు భూములను లాక్కుంటోంది! మా భూములు లాక్కుని అడుక్కుతినే పరిస్థితి కల్పిస్తారా? ప్రభుత్వ ప్రణాళిక అమలైతే ఒంటి మామిడిపల్లి రైతులకు చెందిన సుమారు 2,200 ఎకరాల సాగు భూమి ల్యాండ్‌ పూలింగ్‌ కింద పోతుంది. ఇందులో నాదే 12 ఎకరాల సాగు భూమి ఉంది. పత్తి, మిర్చి, పసుపు, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నాను. మాకు వ్యవసాయం చేయడమే తెలుసు.. వ్యాపారాలు చేయడం తెలియదు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద మా భూమి పోతే మేం అడుక్కు తినాల్సిందే. ప్రభుత్వం వెంటనే ల్యాండ్‌ పూలింగ్‌ జీవోను రద్దు చేయాలి.

- పెండ్లి ప్రవీణ్‌, ఒంటిమామిడిపల్లి, హన్మకొండ 

మా పిల్లల పరిస్థితి ఏమిటి?

ల్యాండ్‌ పూలింగ్‌ అమలైతే మా ఊర్లో 500 ఎకరాల సాగు భూమి పోతుంది. మాకు సాగు పనులు తప్ప మరే పనీ తెలియదు. మా పూర్వీకుల నుంచి వారసత్వంగా భూమి సంక్రమించింది. దాన్ని రేప్పొద్దున మా పిల్లలకు ఇస్తాం. భూమి పోతే డబ్బులిస్తారు సరే. ఆ డబ్బులు మా వరకే ఉంటాయి. భూమి పోతే మా పిల్లల పరిస్థితి ఏమవ్వాలి? ల్యాండ్‌ పూలింగ్‌ సంగతి తెలిసినప్పటి నుంచి అన్నం సహిస్తలేదు. కంటి మీద కునుకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో భూములిచ్చేందుకు మేం సిద్ధంగా లేము. రైతుల్లో ఆగ్రహం పెల్లుబకముందే జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. 

- కొట్టం మోహన్‌, నాగపురం, ఐనవోలు మండలం


Updated Date - 2022-05-26T08:16:39+05:30 IST