భూ కబ్జా

ABN , First Publish Date - 2021-03-02T06:05:07+05:30 IST

మండలంలోని రాయపురాజుపేట పంచాయతీలో గ్రామకంఠం స్థలాన్ని అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఆక్రమించారు.

భూ కబ్జా
రాయపురాజుపేట గ్రామకంఠం స్థలంలో అధికార పార్టీ నాయకులు చేపట్టిన ఇంటి నిర్మాణం

రాయపురాజుపేటలో గ్రామకంఠం స్థలం అధికార పార్టీ నేత ఆక్రమణ

దర్జాగా పక్కా ఇంటి నిర్మాణం

సర్పంచ్‌, గ్రామ పెద్దలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న కార్యదర్శి


చోడవరం, మార్చి 1: మండలంలోని రాయపురాజుపేట పంచాయతీలో గ్రామకంఠం స్థలాన్ని అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఆక్రమించారు. అంతేకాక భారీస్థాయిలో ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనిపై పంచాయతీ సర్పంచ్‌, గ్రామ పెద్దలు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.


రాయపురాజుపేటలోని సర్వే నంబరు 28లో గ్రామకంఠానికి చెందిన స్థలం ఉంది. దీనిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణం చేపట్టారు. ఇంకా సుమారు 20 సెంట్ల వరకు ఖాళీ స్థలం ఉంది. ప్రస్తుతం ఇక్కడ సెంటు స్థలం రూ.2 లక్షలు పలుకుతున్నది. దీంతో అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఈ స్థలంపై కన్నేశారు. సుమారు 10 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి, పక్కా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆక్రమించిన స్థలం విలువ మార్కెట్‌ ఽధర ప్రకారం రూ.20 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం బేస్‌మెంట్‌ వరకు పిల్లర్ల పనులు అయ్యాయి. గ్రామకంఠంలో ఇంటి నిర్మాణం చేపట్టడంతో పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేవు. గ్రామకంఠం ఆక్రమణ, అక్రమంగా ఇంటి నిర్మాణంపై స్థానిక సర్పంచ్‌, గ్రామ పెద్దలు కలిసి అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. భవన నిర్మాణ పనులు యథావిధిగా సాగిపోతున్నాయి.


నోటీసులు ఇచ్చాం

చంద్రశేఖర్‌, పంచాయతీ కార్యదర్శి, రాయపురాజుపేట

గ్రామకంఠానికి చెందిన సర్వే నంబరు 28లోని స్థలాన్ని అక్రమించి, ఇంటి నిర్మాణం చేపట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేశాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లాం. భవన నిర్మాణదారులు ఆ భూమి తమదంటూ  కొన్ని పత్రాలు చూపిస్తున్నారు. వీటిని రెవెన్యూ అధికారుల పరిశీలనకు పంపాం.

Updated Date - 2021-03-02T06:05:07+05:30 IST