వైసీపీ నేతల భూకబ్జా

ABN , First Publish Date - 2020-08-07T10:57:38+05:30 IST

గుర్రంకొండలో అధికార వైసీపీ నాయకులు భూ కబ్జాకు దిగారు. పేదలకు పట్టాల పేరిట పావులు కదిపారు.

వైసీపీ నేతల భూకబ్జా

గుర్రంకొండలో ప్రభుత్వ భూమిని అమ్మేశారు

కలెక్టర్‌కు ఫిర్యాదు.. పునాదులు పూడ్చిన అధికారులు


మదనపల్లె టౌన్‌, ఆగస్టు 6: గుర్రంకొండలో అధికార వైసీపీ నాయకులు భూ కబ్జాకు దిగారు. పేదలకు పట్టాల పేరిట పావులు కదిపారు. ప్రభుత్వ స్థలానికి బోగస్‌ పట్టాలు సృష్టించి ఆక్రమించేశారు. గుర్రంకొండ పంచాయతీ చిట్టిబోయినపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలో 2006లో సర్వేనెంబరు 3,4,5,6లో ఇందిరమ్మ ఇళ్లకు 23 ఎకరాల అసైన్‌మెంట్‌ భూమి సేకరించారు. ఈ స్థలంలో మదనపల్లె- కడప జాతీయరహదారి పక్కనే సర్వేనెంబరు 5లో ఉన్న 2,483 చదరపు మీటర్ల స్థలాన్ని గుర్రంకొండ పంచాయతీ  అవసరాలకు, వాణిజ్య భవనాలకు కేటాయించారు. గతేడాది వైసీపీ అధికారంలోకి రాగానే ఇద్దరు నాయకుల కన్ను ఈ స్థలంపై పడింది. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు తీసుకుని పట్టాలు పుట్టించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.


ఈ ఏడాది జనవరి 7వ తేదిన ఈ స్థలంలో 24 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు పత్రాలు బయటకొచ్చాయి. ఈనెల 2న ప్రభుత్వ స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం ఎనిమిది మంది పునాదులు తవ్వారు. దీనిపై మాజీ సర్పంచ్‌ నౌషాద్‌అహ్మద్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే గుర్రంకొండ రెవెన్యూ అధికారులు మూడు ఎక్స్‌కవేటర్లను తీసుకెళ్లి ప్రభుత్వ స్థలంలో తవ్విన పునాదులను పూడ్చివేశారు. ఈ స్థలం ఆక్రమణపై హైకోర్టులో వ్యాజ్యం వేస్తున్నట్లు మాజీ సర్పంచి నౌషాద్‌అహ్మద్‌ తెలిపారు. ఈ స్థలంలో పేదలకు పట్టాలు మంజూరు చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదన్నారు. దీని పక్కనే హౌసింగ్‌ కార్యాలయానికి కేటాయించిన ఏడు సెంట్లలోనూ కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్నారు. 

Updated Date - 2020-08-07T10:57:38+05:30 IST