అడ్డగోలు తవ్వకాలు

Published: Mon, 28 Mar 2022 01:43:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అడ్డగోలు తవ్వకాలుగొల్లప్రోలు మండలం దుర్గాడ గజరావు చెరువులో ఎక్స్‌కవేటర్‌తో అక్రమంగా జరుగుతున్న తవ్వకాలు

చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న వైనం

మట్టి, గ్రావెల్‌ లేఅవుట్లకు తరలింపు 8 నిబంధనలు బేఖాతరు

అనుమతుల మార్కింగ్‌ ఒకచోట.. తవ్వకాలు మరోచోట

మట్టికే అనుమతి.. గ్రావెల్‌ తరలిస్తున్నా పట్టని అధికారులు

గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో అక్రమ తవ్వకాలు

పిఠాపురం/గొల్లప్రోలు రూరల్‌, మార్చి 27: అంతా అడ్డగోలు వ్యవహారమే... ఎప్పుడో జారీ చేసిన జీవోలను అడ్డుపెట్టుకుని రైతుల పేరిట అనుమతులు తెచ్చుకుని చెరువుల్లోని మట్టి, గ్రావెల్‌ను కొల్లగొట్టేస్తున్నారు... అదీ ఉచితంగా... ప్రభుత్వానికి ఒక్క పైసా ఆదాయం రాకుండా... అనుమతులనుంచి తవ్వకాల వరకు అన్నిచోట్లా నిబంధనల ఉల్లంఘనే.. ఒకచోట అనుమతులు గడువు ముగిసినా రాత్రింబవళ్లూ మట్టి, గ్రావెల్‌ను ప్రైవేటు లే అవుట్లకు తరలిస్తూనే ఉన్నారు.. పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్‌ అధికారులు తమకేమీ తెలియదన్న రీతిలో కార్యాలయాలు దాటి క్షేత్రస్థాయిలోకి రాకపోవడంతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో కోదండరాముని చెరువు, దుర్గాడలో గజరావు చెరువులో సిల్ట్‌ పేరుకుపోయిందని పేర్కొంటూ దాన్ని ఉచితంగా తరలించుకునేందుకు పిఠాపురం, మాధవపురం ప్రాంతాలకు చెందిన ఇద్దరు రైతులకు అనుమతులు ఇస్తూ ఏలేరు ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ డీవీ రామగోపాల్‌ ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు రైతులు ఫిబ్రవరి 28న దరఖాస్తు చేసుకోగా ఆగమేఘాలపై 8 రోజుల వ్యవధిలోనే అనుమతులు ఇచ్చేశారు. ఇందుకుగాను 2018, 2019, 2021ల్లో జారీ చేసిన జీవోలను ఉదహరించారు. అనుమతులు రావడంతోనే జిల్లా కేంద్రంలోని అధికార పార్టీ కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఉన్న ఒక నిర్మాణ సంస్థ రంగంలోకి దిగిపోయింది. భారీగా లారీలు, ఎక్స్‌కవేటర్లు చెరువుల్లోకి దిగి తవ్వకాలు మొదలు పెట్టేశాయి. అసలు ఇరిగేషన్‌ అధికారులు ఎక్కడ మార్కింగ్‌ ఇచ్చారు అన్నదానితో నిమిత్తం లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ వందలాది లారీలతో మట్టి, గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. తాటిపర్తి చెరువులో తవ్వకాలపై రైతులు, స్థానికులు అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదు.

తాటిపర్తిలో గడువు ముగిసినా..

తాటిపర్తి కోదండరాముని చెరువులో పదివేల క్యూబిక్‌ మీటర్ల సిల్ట్‌(మట్టి)ని తరలించుకునేందుకు అనుమతులు ఇస్తూ.. తవ్వకాలకు 15రోజలు గడువు ఇచ్చారు. అది మార్చి 23తో ముగిసింది. గడువు ముగిసినా ఇక్కడ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. కేవలం మట్టిని మాత్రమే తరలించాల్సి ఉండగా ఆ ముసుగులో గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. ఇప్పటికే చెరువులో కొన్నేళ్లుగా జరుగుతున్న తవ్వకాలతో భారీగా గోతులు ఏర్పడగా, తాజా తవ్వకాలతో మరిన్ని గోతులు పడుతున్నాయి. ఏకరీతిన తవ్వకాలు జరపకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. దుర్గాడ గజరావు చెరువులో 18వేల క్యూబిక్‌మీటర్లు మట్టిని తవ్వుకునేందుకు 25రోజులు గడువు ఇచ్చారు. ఇక్కడ తవ్వకాలు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారీగా గోతులు పెడుతుండటంతో చెరువులోకి నీరు వచ్చినా పొలాల్లోకి నీరు రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆది నుంచీ అన్ని ఉల్లంఘనలే...

చెరువుల్లో తవ్వకాలకు అనుమతులు పొందిన రైతుల భూములకే మట్టిని తరలించాల్సి ఉంది. అది పంట పొలాలు ఎత్తు చేసుకుని పంటలు సాగు చేసుకునేందుకే తరలించాలి. కానీ ఇక్కడ ఆ పేరుతో వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కాకినాడ తదితర ప్రాంతాలకు తాటిపర్తి, దుర్గాడ చెరువులనుంచి రోజూ వందలాది లారీల్లో మట్టి, గ్రావెల్‌ను ప్రైవేటు లేఅవుట్లకు తరలిస్తున్నారు. అనుమతుల్లో ఇచ్చిన నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే తవ్వకాలు జరపాల్సి ఉంది. కానీ 24 గంటలూ తవ్వకాలు జరుగుతున్నా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన పరిణామం కంటే ఐదారు రెట్లు అధికంగా మట్టి, గ్రావెల్‌ను ఇప్పటికే తరలించినట్లు ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు చెప్తున్నారు. ఇరిగేషన్‌ అధికారులు ఇచ్చిన మార్కింగ్‌ ప్రకారం తవ్వకాలు జరిపాల్సి ఉండగా అది వదిలి చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ భారీగా గోతులు పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ తవ్వకాలకు సంబంధించి రెవెన్యూ, మైన్స్‌ అధికారులకు ఇరిగేషన్‌ అధికారులు సమాచారం ఇవ్వాల్సి ఉండగా అది కూడా చేయలేదని తెలుస్తోంది. ఇంత అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నా ఇరిగేషన్‌ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు గతేడాది చేబ్రోలు చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలపై హైకోర్టు సీరియస్‌గా స్పందించడంతోపాటు తవ్వకాలు నిలిపివేసి, అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలన జరపాలని ఆదేశించింది. అదే రీతిలో తాటిపర్తి, దుర్గాడ చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నందున హైకోర్టును ఆశ్రయించాలని రైతులు భావిస్తున్నట్టు సమాచారం. అడ్డగోలు తవ్వకాలపై కలెక్టరు, ఉన్నతాధికారులు స్పందించకుంటే అందోళన చేపట్టేందుకు వారు సన్నద్ధమవుతున్నారు.



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.