మాకెందుకీ శిక్ష?

ABN , First Publish Date - 2021-07-26T05:03:49+05:30 IST

మాకెందుకీ శిక్ష?

మాకెందుకీ శిక్ష?
బాధిత రైతు మరీదు అప్పయ్య, రైతు అప్పయ్యకు ఇచ్చిన పాస్‌బుక్‌

భూ సమస్యలు పరిష్కారమవక రైతుల అవస్థలు

ఒకరి భూములు మరొకరి పేరిట నమోదు

ఏళ్లుగా రైతుబంధుకు నోచుకోని బాధిత అన్నదాతలు 

రిజిస్ట్రేషన్‌ బదలాయింపే మార్గమంటున్న అధికారులు

బోనకల్‌, జూలై 25: తెల్ల కాగితాలపై భూముల క్రయ, విక్రయాలు చేసుకున్న అన్నదాతలకు పాస్‌పుస్తకాలను ఇచ్చేందుకు ప్రభుత్వం 2016లో సాదాబైనామా విధానాన్ని ప్రవేశపెట్టింది. రైతుల నుంచి దరఖాస్తులను తీసుకొని అన్ని అర్హతలను పరిశీలించిన తర్వాత పాస్‌పుస్తకాలు జారీ చేయడంతో ఎంతోమంది సంతోషించారు. కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యం కొందరు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ‘మేమేం పాపం చేశాం. మాకెందుకీ శిక్ష?. నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒకరి భూముల వివరాలను మరొకరి పేరు మీద ఎక్కించడంతో ఏళ్ల తరబడిగా రైతుబంధు డబ్బును కోల్పోతున్నాం. ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అంటూ బాధిత రైతులు లబోదిబోమంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో హక్కును కోల్పోయిన పట్టాదారులు..

కొందరు అధికారులు చేసిన తప్పిదంతో.. భూములపైన హక్కులను కోల్పోయిన పట్టాదారుల్లో ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ. 

బోనకల్‌ గ్రామానికి చెందిన మరీదు అప్పయ్యకు 175/బి5 సర్వే నెంబరులో ఎకరం క్రయం ద్వారా, 209/డి4 నెంబరులో 15 కుంటల భూమి వారసత్వంగా ఉన్నట్టు 186ఖాతా నెంబరు, టి26010150069 పాసుబుక్‌ ఇవ్వడంతో.. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని ఎంతగానో సంతోషించాడు. కానీ రైతుబంధు పథకం డబ్బులు తన ఖాతాలో పడక పోవడంతో వ్యవసాయ అధికారులను ఆశ్రయించాడు. నీ భూమి వెంకట అప్పారావు అనే పేరు మీదు నమోదైందని చెప్పడంతో అప్పయ్య అవాక్కయ్యాడు. ఆధార్‌నెంబర్‌ మాత్రం అప్పయ్యదే ఉండగా.. పేరు వేరే వారిది రికార్డులో ఎక్కించడంతో సమస్య ఉత్పన్నమైంది. అంతేకాదు అప్పయ్య భూమికి సంబంధించి టి26010150051 నెంబరు పాస్‌బుక్కుతో వేరే వ్యక్తిని హక్కుదారుడిగా చేశారు. సన్నకారు రైతు కావడంతో రైతుబంధు డబ్బులు రాకపోవడం ఒకవైపు, కుటుంబ అవసరాల నిమిత్తం పొలం అమ్మేందుకు వీలుకాని పరిస్థితి మరోవైపు అప్పయ్యను కుంగదీస్తున్నాయి. రికార్డుల ద్వారా అన్ని హక్కులు ఉన్నా తమ తాత, ముత్తాతాల నాటి భూమి ఐనా వేరే వారి పేరును ఎలా ఎక్కించారని, తన భూమికి సంబందించి ఎలాంటి వివాదం లేకుండా చూడాలని అధికారులను వేడుకుంటున్నాడు. 

ఇదే గ్రామంలోని గుగులోతు స్వామి అనే గిరిజన రైతుకు చెందిన రెండు ఎకరాల భూమి వేరే వ్యక్తుల పేరిట నమోదవడంతో వారిని కలిసి తిరిగి తనకు తన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రాధేయ పడుతున్నాడు. ఆళ్లపాడు గ్రామంలో అల్లిక రాములు 385/ఆ2 సర్వే నెంబరులో 1-36 కుంటల భూమి ఉంది. పాసుబుక్‌ కోసం సాదా బైనామాలో దరఖాస్తు చేసుకోగా కృష్ణా జిల్లా వత్సవాయి గ్రామానికి చెందిన నరమనేని వెంకమ్మకు పాసుబుక్‌ ఇచ్చారు. తనకు 385/ఆ2 నెంబర్‌లో ఎలాంటి భూమి లేదని ఆమె తేల్చి చెప్పింది. అయితే తాను రైతుబంధు, పీఎం కిసాన్‌ డబ్బులు కోల్పోతున్నానని రాములు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అదే గ్రామంలోని మర్రి నర్సయ్య, పారా వెంకటేశ్వరావు, గుడిద నాగేశ్వరావు, చినకేశవ అనూష, మరీదు శ్రీను, మంద రామయ్య, అల్లిక లక్ష్మీనారాయణలతో పాటు పలువురు రైతులది ఇదే పరిస్థితి. బోనకల్‌, ఆళ్లపాడు గ్రామాల్లో నాడు పని చేసిన అధికారుల నిర్లక్ష్యం వారికి శాపమైంది. ఇలా పలు గ్రామాల్లోని చాలామంది రైతులు సమస్యల పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు.

రిజిస్ట్రేషనే మార్గమంటున్న అధికారులు..

తమ భూములు వేరే వ్యక్తుల పేరు మీదుగా నమోదు చేయడమేంటని  బాధిత రైతులు అధికారులను అడగ్గా.. ప్రస్తుతం తమ చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారు. ధరణి వెబ్‌సైట్‌ అమల్లోకి రాగా మార్పులు, చేర్పులకు సంబంధించి ఆప్షన్‌ పెట్టకపోవడంతో వాస్తవిక రైతులు తమ భూములు వేరే వ్యక్తుల పేరు మీదుగా ఎక్కితే వారితో తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడమే ప్రస్తుతం ఉన్న మార్గమంటున్నారు. ఎడిట్‌ ఆప్షన్‌ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదని కొందరు రైతులు అప్పు చేసి మరి డీడీ చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. దీంతో వారిపై ఎకరానికి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు అదనపు భారం పడుతోంది. కొందరు రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకుందామన్నా పలు సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. ఇలా గ్రామాల్లోని రైతులు అన్ని హక్కులు ఉన్నా తమ భూములను తాము దక్కించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ధరణిలో ఎడిట్‌ అప్షన్‌ ఇచ్చి తప్పులను సరి చేసే అధికారాలను తహసీల్దార్లకు అప్పగించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Updated Date - 2021-07-26T05:03:49+05:30 IST