దర్జాగా కబ్జా

ABN , First Publish Date - 2021-02-27T05:10:40+05:30 IST

దర్జాగా కబ్జా

దర్జాగా కబ్జా
కబ్జాకు గురైన లష్కర్‌ సింగారంలోని మధు భూమి

లష్కర్‌సింగారంలో మూడున్నర ఎకరాల్లో పాగా

అక్రమార్కులతో చేతులు కలిపిన కానిస్టేబుల్‌

దొడ్డిదారిన ఇంటి నెంబర్లు

న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ బాధితుడి ప్రదక్షిణలు

పట్టించుకోని అధికారులు.. కబ్జాదారులకు వత్తాసు


హన్మకొండ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కంచె చేనుమేస్తోంది. రక్షణ కల్పించాల్సిన  ఓ కానిస్టేబుల్‌ అక్రమార్కులతో కలిసి విలువైన భూమిని కబ్జా చేశాడు. పైఅధికారుల అండదండలను చూసుకొని మరింత చెలరేగిపోతున్నాడు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక హన్మకొండ లష్కర్‌సింగారం భూబాధితుడు కొత్తపేట మధు కుమిలిపోతున్నారు. విలువైన  తన భూమిని పోలీసులు శాఖలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌తో పాటు పలుకుబడి కలిగిన మరికొందరు ఆక్రమించుకొని ఇళ్లు కంటుకుంటున్నా వారిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మధు కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. తనకు న్యాయం చేయమని అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటున్నాడు. అయినా పట్టించుకునేవారు లేకపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నాడు.

హన్మకొండ రాగన్న దర్వాజ ప్రాంతానికి చెందిన కొత్తపేట మధుకు లష్కర్‌సింగారంలో సర్వే నెం 283. 284, 285, 286లో 1.30 ఎకరాలు, సర్వే నెం 324/సిలో 2ఎకరాల భూమిలో కొంతభాగం వారసత్వంగా వచ్చింది. 1.30 ఎకరాల స్థలాన్ని మధు పేరు మీద ఆయన తండ్రి బాలాజీ  రిజిస్ట్రేషన్‌ కూడా చేయించి ఇచ్చాడు. నగర పరిధిలో ఉన్న ఈ స్థలానికి మంచి డిమాండ్‌ ఉంది. కోట్ల రూపాయల విలువ పలుకుతుంది.  దీంతో సహజంగానే అక్రమార్కుల కన్ను పడింది. అర్థబలం, అంగబలం ఉన్నవారు ఇందులో పాగా వేశారు. ఓ పోలీసు కానిస్టేబుల్‌ కూడా భూమిని ఆక్రమించుకున్నాడు. ఈ కానిస్టేబుల్‌తో పాటు కబ్జాదారుల్లో కొందరు కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇళ్లు నిర్మించుకున్నారు. మరికొందరు ప్రహరీ కట్టారు. తప్పుడు పత్రాలను సమర్పించి ఏకంగా ఇంటి నెంబర్లు తెచ్చుకున్నారు. 


పట్టించుకోని అధికారులు

ఈ విషయమై మధు కిందటేడు నవంబర్‌ 5న కార్పొరేషన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కమిషనర్‌ సూచన మేరకు కాజీపేట మున్సిపల్‌ సర్కిల్‌ కార్యాలయంలోని ఏసీపీని కలిశాడు. మర్నాడు ఏసీపీ స్థలం వద్దకు వచ్చి చూసి కబ్జా చేసినవారి ఇంటి నెంబర్లు, కరెంట్‌ నెంబర్లు రాసుకొని నోటీసు పంపిస్తానన్నారు. కానీ ఇప్పటివరకు ఎవరికి నోటీసులు వెళ్లలేదు. ఎవరిపైనా చర్యలు లేవు.  సర్వే నెంబర్‌ 324/సిలో 2 ఎకరాల స్థలాన్ని మధు తండ్రి 1964లో కొనుగోలు చేసి మధుతోపాటు ఆయన ఇద్దరు సోదరులు, ముగ్గురు కుమార్తెలకు సమానంగా పంచి సీలింగ్‌ డిక్లరేషన్‌ చేశాడు. ఈ స్థలాన్ని కూడా కొందరు దర్జాగా ఆక్రమించుకొని ప్రహరీగోడలు నిర్మించుకున్నారు. వీటి విషయమై కూడా కార్పొరేషన్‌, రెవెన్యూ, పోలీసు అధికారులకు మధు ఫిర్యాదులు చేసినా పట్టించుకునేవారే లేరు. 

ఈ స్థలం ఆక్రమణపై మధు 2019 సెప్టెంబర్‌ 21న హన్మకొండ పోలీసు స్టేషన్‌లో 2020 అక్టోబర్‌ 5న వరంగల్‌ డీసీపీకి ఫిర్యాదు చేశాడు. డీసీపీ సలహా మేరకు ఏసీపీని కలిశాడు. ఏసీపీ సదరు కబ్జాదారులను పిలిచి మాట్లాడారు. డాక్యుమెంట్లను పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతే ఆ తర్వాత స్పందనే లేదు. మధు ఆ తర్వాత కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకున్నాడు. షరామామూలే. గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి, ముఖ్య కార్యదర్శికి సైతం ధరఖాస్తులు పంపుకున్నాడు. ఫలితం శూన్యం. ఇలా.. కొన్నేళ్లుగా భూమి కాగితాలు పట్టుకొని ఆయన వెళ్ళని కార్యాలయమంటూ లేదు. కలవని అధికారంటూ లేడు. చివరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను సైతం ఆశ్రయించాడు. కమిషన్‌ ఈ విషయంలో తగిన చర్య తీసుకొని బాధితుడికి న్యాయం చేయాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ను ఆదేశించింది. ఇప్పటికీ రెండు నెలలవుతోంది. ఏ చర్యా లేదు.


సర్వే ఏది?

మధు తన స్థలంలో ఎంత మేరకు కబ్జా గురైంది. ఇంకా ఎంత స్థలం మిగిలింది తెలుసుకునేందుకు సర్వేకోసం 2019 మే 3న హన్మకొండ తహసీల్దార్‌కు అర్జీ పెట్టుకున్నాడు. సర్వే అధికారులు ఇదిగో.. అదిగో.. అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటివరకు రాలేదు. స్థలం వద్దకు వెళితే కబ్జాదారులు చంపుతామని బెదిరిస్తున్నారనీ, అధికారుల వద్దకు వెళితే పట్టించుకోవడం లేదనీ, ఇక తనకు న్యాయం చేసేవారే లేరా అని వాపోతున్నాడు.  


11 మండలాలకు 8 మంది సర్వేయర్లే

ప్రభాకర్‌, ఉప సంచాలకులు, భూమి కొలతల శాఖ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని 11 మండలాలకు 8 మంది సర్వేయర్లే ఉన్నారు. అయినవోలు, ఎలకతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు సర్వేయర్లు లేరు. పక్క మండలాల సర్వేయర్లే వీటిని చూస్తున్నారు. మొన్నటి వరకు ఆరుగురు సర్వేయర్లే ఉన్నారు. వారం రోజుల క్రితం మరో ఇద్దరు వచ్చారు. భూమి కొలతత శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో ఒక్క సర్వేయర్‌ కూడా లేరు. టాస్క్‌ఫోర్సు కింత ఈ కార్యాలయంలో కనీసం నలుగురు లేదా అయిదుగురు సర్వేయర్లు అందుబాటులో ఉండాలి. మండలానికి ఒక్క సర్వేయరే ఉండడం వల్ల పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంది. అయినా వీలయినంత మేరకు ఇబ్బంది లేకుండా పనులు చేసుకుంటూ వెళుతున్నారు. గ్రామీణ పాంతాల్లో కన్నా అర్బన్‌లో భూ సమస్యలు కాస్త క్లిష్టంగా ఉంటాయి. భూముల కొలతలు తీసుకోవడం ఒక్కటే కాకుండా భూసేకరణ తదితర భూ సంబంధమైన అన్ని పనులను సర్వేయర్లు చూసుకోవలసి ఉంటుంది. 

Updated Date - 2021-02-27T05:10:40+05:30 IST