కబ్జా పరివారం..!

ABN , First Publish Date - 2021-11-02T06:16:52+05:30 IST

విజయవాడ నగరంలో విలువైన స్థలాలు ఎక్కడుంటే అక్కడ అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు.

కబ్జా పరివారం..!
కబ్జా చేయడానికి ప్రయత్నించిన స్థలం ఇదే.. (ఇన్‌సెట్‌లో..) కూల్చివేసిన ప్రహరీ

ఇంతియాజ్‌ నగర్‌లో కోటి స్థలం కబ్జా

అధికార పార్టీ నాయకులే సూత్రధారులు

నకిలీ పత్రాలతో స్థలం కాజేసేందుకు యత్నం

మంత్రి పీఏ సాక్షిగా నగరంలోని రూ.8 కోట్ల స్థలం స్వాహా

ఎన్‌వోసీ పేరుతో డ్రామా.. ఆపై కబ్జా

పీఏ మామ పేరుతో జీపీఏ! 


విజయవాడ నగరంలో విలువైన స్థలాలు ఎక్కడుంటే అక్కడ అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. కుటుంబ వివాదాల్లో ఉన్న స్థలాలు.. ఇరువురు వ్యక్తుల నడుమ వివాదాల్లో ఉన్న స్థలాలే లక్ష్యంగా వీరు కబ్జాకాండకు తెరదీస్తున్నారు. ఊర్మిళా సుబ్బారావు నగర్‌ సమీపంలోని ఇంతియాజ్‌ నగర్‌లో సుమారు కోటి రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేయడంలోనూ, జక్కంపూడిలోని ఓ భూమికి ఎన్‌వోసీ ఇప్పించే పేరుతో విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న రూ.8 కోట్ల విలువ చేసే స్థలాన్ని చేజిక్కించుకోవడంలోనూ ఈ పరివారానిదే కీలకపాత్ర.


ఆంధ్రజ్యోతి, విజయవాడ/విద్యాధరపురం : విజయవాడ ఊర్మిళా సుబ్బారావు నగర్‌ సమీపంలోని ఇంతియాజ్‌ నగర్‌లో సుమారు రూ.కోటి విలువైన స్థలాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారు. 231 చదరపు గజాల ఈ స్థలాన్ని ముత్యాలంపాడు శ్రీనగర్‌ కాలనీకి చెందిన ఆటో ఫైనాన్షియర్‌ కొనుగోలు చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల అండతో నలుగురు యువకులు ముఠాగా ఏర్పడి ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. అక్టోబరు 27వతేదీన ఇంతియాజ్‌ నగర్‌లోని స్థలం వద్దకు వెళ్లి, చుట్టూ ఉన్న ప్రహరీని జేసీబీలతో తొలగించారు. తన స్థలంలో ఉన్న ప్రహరీని ఎలా కూలగొడతారని ప్రశ్నిస్తే.. తాము ఆ స్థలాన్ని కొనుగోలు చేశామంటూ ముఠా సభ్యులు నకిలీ డాక్యుమెంట్స్‌ చూపారని బాధితుడు భవానీపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


మైనార్టీ నాయకుడి హస్తం

ఈ ముఠా వెనుక అధికారపార్టీకి చెందిన మైనార్టీ నాయకుడి హస్తం ఉందని తెలుస్తోంది. ఆయనే ఈ కథను నడిపిస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ స్థలం నాన్‌ లేఔట్‌లోని స్థలం కాగా, ముఠా సభ్యులు, దాన్ని లేఔట్‌ స్థలంగా ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ ముఠా గతంలోనూ నగరంలోని పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల్లో విలువైన వివాదాస్పద స్థలాలను గుర్తించి, వాటికి నకిలీ రికార్డులు తయారు చేసి, కబ్జా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్థల యజమాని తన వద్ద ఉన్న రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, లింక్‌ డాక్యుమెంట్లును చూపిస్తుండగా కబ్జాకు పాల్పడిన ముఠా వద్ద అలాంటి డాక్యుమెంట్లు ఏవీ లేకపోవడం గమనార్హం. స్థలంలోని ప్రహరీని దగ్గరుండి కూలగొట్టించిన షేక్‌ దావూద్‌, షేక్‌ మీరా సాహెబ్‌ అలియాస్‌ షేక్‌ బాబా, షేక్‌ బబ్లూ, షేక్‌ యాసీన్‌లలో బాబాపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఒక హత్యకేసులో ముద్దాయిగా కూడా ఉన్నాడు. దావూద్‌, యాసీన్‌లపై కూడా పలు కేసులున్నట్టు బాధితుడు తెలిపారు.


రూ.8 కోట్ల స్థలాన్ని కొట్టేశారు!

దేవదాయ శాఖ మంత్రి పిఏ నడిపిన ఎన్‌వోసీ డ్రామాలో నగరానికి చెందిన ఓ కుటుంబం రోడ్డున పడింది. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి గ్రామంలో సర్వే నంబర్లు 161/1, 161/2, 161/3లో 5.16 ఎకరాల భూమి దేవదాయశాఖ పేరుతో ఉంది. సుమారు రూ.15 కోట్ల విలువైన ఈ భూమి తమ పూర్వీకులదని ఎన్‌వోసీ కోసం అప్పలస్వామి సత్రం, ట్రస్టు నిర్వాహకులు దేవదాయశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ భూమికి ఎన్‌వోసీ ఇప్పిస్తానని, ప్రతిఫలంగా నగరం నడిబొడ్డున ట్రస్టు నిర్వాహకులకు ఉన్న రూ.8కోట్ల విలువైన స్థలాన్ని తనకు ఇవ్వాలని మంత్రి పిఏ ఒప్పందం చేసుకున్నాడు. జక్కంపూడిలోని రూ.15 కోట్ల విలువైన పొలాలకు ఎన్‌వోసీ రాలేదు కానీ, నగరంలోని రూ.8 కోట్ల స్థలాన్ని మాత్రం పిఏ తన మామ పేరుతో జీపీఏ చేయించుసుకున్నాడు. ఈ వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో గుట్టుచప్పుడు కాకుండా జీపీఏ తంతును ముగించారు. వాస్తవానికి బంధువులకో.. తమ వద్ద విధులు నిర్వహించే మేనేజర్లకో జీపీఏ చేస్తారు. కానీ ఇక్కడ సంబంధం లేని వ్యక్తులకు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-11-02T06:16:52+05:30 IST