రూ.2కోట్ల భూమి కాజేశారు!

ABN , First Publish Date - 2021-03-02T07:00:20+05:30 IST

అది ప్రభుత్వ భూమి. ఇందులో రైతులు ఎన్నో ఏళ్లుగా గడ్డివాములు వేసుకుంటున్నారు. దీని విలువ దాదాపు రూ.2కోట్లు ఉంటుందని అంచనా. ఇంకేముంది కొందరు అధికారపార్టీ వర్గీయుల కన్ను పడింది.

రూ.2కోట్ల భూమి కాజేశారు!
ప్రభుత్వ భూమి ఇదే

  1. 14.44 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు
  2. ఆన్‌లైన్‌లో 14 మంది పేర్లు నమోదు
  3. అది ప్రభుత్వ భూమే అంటున్న తహసీల్దార్‌
  4. విచారించి చర్యలు తీసుకుంటామని వెల్లడి


ఆదోని, మార్చి 1: అది ప్రభుత్వ భూమి. ఇందులో రైతులు ఎన్నో ఏళ్లుగా గడ్డివాములు వేసుకుంటున్నారు. దీని విలువ దాదాపు రూ.2కోట్లు ఉంటుందని అంచనా. ఇంకేముంది కొందరు అధికారపార్టీ వర్గీయుల కన్ను పడింది. రెవెన్యూ అధికారులను దారికి తెచ్చుకుని ఈ భూమి తమదంటూ ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేయించుకున్నారు. ఏడాది క్రితం జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చి అధికారులను నిలదీశారు. 


హొళగుంద పంచాయతీలోని సర్వే నం.361లో 14.44 ఎకరాలు ప్రభుత్వ భూమిగా నమోదైంది. ఏడాది క్రితం ఈ భూమి తమదంటూ 14 మంది తమ పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. వీరిలో కొందరు అధికారపార్టీ వర్గీయులు, రెవెన్యూలో పనిచేస్తున్న నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి ముగ్గురు ప్రధాన అనుచరులు ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారానికి అప్పటి అధికారులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో నమోదైన వారి పేర్లను తొలగించాలంటే ఉన్నతాధికారుల జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు, అధికారపార్టీ వర్గీయులు వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ 14 మందిని ఈ వ్యవహారం నుంచి బయటపడేసేందుకు సదరు ముఖ్య ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నట్లు తెలిసింది. కాగా సర్వే నం.361లోని ఈ భూమి మార్కెట్‌ విలువ ప్రకారం దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూమి కాస్త ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో మార్కెట్‌ విలువ ఇంత ఉంది. అదే భూమి దిగువ ప్రదేశంలో ఉండుంటే రూ.10 కోట్లు పలికి ఉండేదని స్థానికులు అంటున్నారు.

 

అధికారులను నిలదీసిన స్థానికులు

అయితే ఈభూమిలో ఎన్నో ఏళ్లుగా 150 మందికి పైగా స్థానికులు గడ్డివాములు వేసుకుంటున్నారు. అయితే అధికారపార్టీ వర్గీయులు ఈ భూమి తమదేనని, ఖాళీ చేయాలని చెప్పడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఈ స్థలం పేదోళ్లకు ఇవ్వకుండా అధికార పార్టీ వర్గీయులకు ఎలా కట్టబెడతారని అధికారులను నిలదీశారు. ఇంత జరిగినా ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నించారు. తాత ముత్తాల కాలం నుంచి వచ్చిన పొలాలను సైతం ఆన్‌లైన్‌లో ఎక్కించాలంటే అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనులు కావడం లేదని, అలాంటిది 14.44 ఎకరాలు ఆన్‌లైన్‌లో ఎలా ఎక్కించారని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. దీంతో ఈ విషయం తనకు తెలియదని, గతంలో ఉన్న అధికారులు చేశారేమోనని విచారిస్తామని తహసీల్దార్‌ శేషపాణి తెలిపారు. 


ఇది ఏమాత్రం మంచిది కాదు

ఎన్నో ఏళ్లుగా ఆ భూమిలో పశుగ్రాసం వేసుకొని ఉంటున్నాం. ఒక్కసారిగా అధికార పార్టీకి చెందిన కొందరు తమదేనని చెప్పడం ఎంతవరకు న్యాయం? పేదలకు మూడు సెంట్లు స్థలం ఇవ్వాల్సింది పోయి ఏకంగా ప్రభుత్వ భూమినే స్వాధీనం చేసుకోవడం అన్యాయం. 

-కోగిలతోట మారెన్న, హొళగుంద


డబ్బులు ఇస్తే పొలాలు ఇస్తారా?

అధికారులకు డబ్బులు ముట్టజెబితే పొలాలు కూడా రాయిస్తారా..? ఇదెక్కడి న్యాయం? ఇది పేదల కడుపు కొట్టడమే. తాత ముత్తాతల కాలం నుంచి ఈ స్థలంలో పశుగ్రాసం వేసుకొని ఉంటున్నాం. ఇప్పుడు ఎవరో వచ్చి ఆ స్థలం మాదనడం ఎంతవరకు సమంజంసం? వారిపై చర్యలు తీసుకోవాలి.

-దిడ్డిశివప్ప, హొళగుంద


అది ముమ్మాటికి ప్రభుత్వ స్థలమే

సర్వే నం.361లో ఉన్న 14.44 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ స్థలమే. దీన్ని 14 మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నారని తెలుస్తోంది. దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారిస్తున్నాం. ఇందులో ఎవరు ఉన్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందులో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ముగ్గురు వీఆర్‌ఏలు, ఒక ఆపరేటర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నిజమని తేలితే వారిపై కూడా కేసు నమోదు చేస్తాం. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. వారంలోగా ఉన్నతాధికారులకు పూర్తిస్థాయి నివేదిక అందిస్తాం. 

-శేషఫణి తహసీల్దార్‌, హొళగుంద 

Updated Date - 2021-03-02T07:00:20+05:30 IST