భూముల మార్కెట్‌ విలువ..సవరింపునకు సర్వం సిద్ధం!

ABN , First Publish Date - 2022-01-28T08:46:00+05:30 IST

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువ సవరింపునకు సర్వం సిద్ధమైంది..! దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

భూముల మార్కెట్‌ విలువ..సవరింపునకు సర్వం సిద్ధం!

  • 2,3 రోజుల్లో అధికారిక ప్రకటన!!
  • వారం రోజులుగా పెంపుపై తర్జనభర్జన
  • రిజిస్ట్రార్లతో ఉన్నతాధికారుల భేటీ

హైదరాబాద్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువ సవరింపునకు సర్వం సిద్ధమైంది..! దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఆ వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతాయి. ఈ అంశంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వారం రోజులుగా తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్‌లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్టుమెంట్ల ధరలను తెప్పించుకుంది. ఆయా కేటగిరీల్లో నెల వారీగా జరుగుతున్న క్రయవిక్రయాల సమాచారాన్ని సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని సబ్‌-రిజిస్ట్రార్‌లు అందజేసిన నివేదిక ప్రకారం మార్కెట్‌ విలువల పెంపుపై అధికారలుఉ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గురువారం హైదరాబాద్‌లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులు ఆయా జిల్లాల రిజిస్ట్రార్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే.. జిల్లాస్థాయి కమిటీల నుంచి ఆమోద ముద్ర పడ్డాకే.. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్వోలు, సబ్‌ రిజిస్ట్రార్‌లతో సమావేశమై మార్కెట్‌ విలువల ప్రతిపాదనలు, కొత్త విలువల అమలు తీరుపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. 


కిటకిటలాడుతున్న కార్యాలయాలు

వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, అపార్టు మెంట్లు, భవనాలు తదితర స్థిరాస్తుల మార్కెట్‌ విలువలు పెరుగనున్న నేపథ్యంలో జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌లు ఊపందుకున్నాయి. వారం రోజుల నుంచి నమోదైన రిజిస్ట్రేషన్‌లను పరిశీలిస్తే 40-50ు మేర పెరుగుదల కనిపించింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 12 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలున్నాయి. వారం క్రితం వరకు ఒక్కో కార్యాలయంలో రోజుకు సగటున 30 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ జరిగేది. ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 125కు పెరిగింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా లావాదేవీలు కొనసాగుతున్నాయి. వరంగల్‌ జిల్లాలో కొనుగోలు, అమ్మకం దారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు బారులు తీరుతున్నారు. ఈ జిల్లాలో 40-50ు వరకు రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ల కోసం తహసీల్దార్‌ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. నిజామాబాద్‌, కామరెడ్డి జిల్లాలో కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ల నమోదు 50శాతానికి పైగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రిజిస్ట్రార్‌, తహసీల్దారు కార్యాలయాల్లో 50% వరకు లావాదేవీలు పెరిగాయి.రిజిస్ట్రేషన్‌లలో అగ్రస్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజుల నుంచి ధరణి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చిన వారు కార్యాలయాల్లో పడిగాపులు పడుతూ కనిపిస్తున్నారు. 


హైదరాబాద్‌.. శివార్లలో రద్దీ ఇలా..

భూముల విలువలు పెరుగుతాయనే వార్తలతో హైదరాబాద్‌, శివార్లలోని సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలు గురువారం కిటకిటలాడాయి. సూరారంలో 350 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. గురువారం ఒక్కరోజే 350 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయని, సాధారణ రోజుల్లో ఈ సంఖ్య 50-100 మధ్య ఉంటాయని అధికారులు తెలిపారు.

చంపాపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గురువారం 120 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి.

ఎల్‌బీనగర్‌ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజు వారీ 45-50కు మించి.. సాయంత్రం వరకు 70 రిజిస్ట్రేషన్‌లు జరగగా.. రాత్రివరకు మరో 30 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి.

Updated Date - 2022-01-28T08:46:00+05:30 IST