మొదలైన భూముల క్రమబద్ధీకరణ

Published: Sun, 29 May 2022 00:27:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మొదలైన భూముల క్రమబద్ధీకరణహనుమకొండ దీన్‌దయాళ్‌నగర్‌లో జీవో 58 కింద స్థలాల క్రమబద్దీకరణకు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు

జీవో 58, 59 కింద 4,154 దరఖాస్తుల దాఖలు
జిల్లా స్థాయి అధికారుల నేతృత్వంలో 19 బృందాలు
పరిశీలన అనంతరం కలెక్టర్‌కు నివేదిక
ఆ తర్వాత క్రమబద్ధీకరణపై తుది నిర్ణయం


హనుమకొండ జిల్లాలో జీవో నెంబరు 58 కింద భూముల క్రమబద్ధీకరణకు ప్రక్రియ మొదలైంది. జిల్లా యంత్రాంగం ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు తమకు అప్పగించిన ప్రాంతాల్లో కేటాయించిన దరఖాస్తులను ఈనెల 21నుంచి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాయి. దరఖాస్తుదారుల ఇళ్లవద్దకే వెళ్ళి వారు సమర్పించిన దరఖాస్తుల్లోని వివరాలను సరిచూసుకుంటూ క్రమబద్ధీకరణకు వారు అర్హులా కాదా అనేది నిగ్గు తేల్చే పనిలో పడ్డాయి. ప్రస్తుతం జీవో నెంబరు 58కింద దాఖలైన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తున్నారు.


హనుమకొండ, మే 28 (ఆంధ్రజ్యోతి):
హనుమకొండ జిల్లాలో 14 మండలాల నుంచి మొత్తం 4,154 దరఖాస్తు లు అందాయి. వీటి పరిశీలనకు రెవెన్యేతర శాఖలకు చెం దిన జిల్లాస్థాయి అధికారుల నేతృత్వంలో మొత్తం 19 బృం దాలను ఏర్పాటు  చేశారు. ఒక్కో బృందంలో అధికారితోపాటు రెవెన్యూ శాఖకు చెందిన మరో ముగ్గురు సభ్యులు గా ఉన్నారు. వీరిలో ఒకరు గిర్దావర్‌, ఒక సర్వేయర్‌ కాగా, మరొకరు వీఆర్‌ఏ. మార్చి 31 నాటికి జిల్లాలో 4వేల మం దికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న వారు 125 గజాల్లో నివాసం ఉంటే వాటిని ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తుంది. జీవో 59లో ప్రభుత్వ స్థలాల విస్తీర్ణం, రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా 50 శాతం నుంచి 100 శాతం వరకు చార్జీలు వసూలు చేసి క్రమబద్దీకరించనున్నారు.

మండలాలవారీగా..

కాజీపేట మండలంలో 651 దరఖాస్తులు రాగా, వీటి పరిశీలనకు జడ్పీసీఈవో ఎస్‌.వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి.రాంరెడ్డి, జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి ఎం.సబిత నేతృత్వంలో ముగ్గురేసి సభ్యులతో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ధర్మసాగర్‌ మండలంలో 191 దరఖాస్తులు రాగా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం వీటిని పరిశీలిస్తోంది. ధర్మసాగర్‌ మండలం పరిధిలోని ఉనికిచర్ల, ముప్పారం- ఈ రెండు గ్రామాల్లోనే క్రమబద్దీకరణకు 104 దరఖాస్తులు దాఖలయ్యాయి. వేలేరు మండలంలో ఒకటి, ఐనవోలు మండలంలో 5, భీమదేవరపల్లి మండలంలో 7, హసన్‌పర్తి మండలంలో 62, ఎల్కతుర్తి మండలంలో 2 దరఖాస్తులు కలుపుకొని మొత్తం 181 దరఖాస్తులు దాఖలయ్యాయి. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివా్‌సకుమార్‌ నేతృత్వంలోని బృందం వీటిని పరిశీలిస్తోంది. ఆత్మకూరు మండంలో 1, కమలాపూర్‌ మండలంలో 4, పరకాల మండలంలో  7, దామెర మండలంలో 26, శాయంపేట మండలంలో 27 కలుపుకొని  మొత్తం 65దరఖాస్తులు అందాయి. వీటిని జిల్లా  పంచాయతీ అధికారి వి.జగదీశ్వర్‌ నేతృత్వంలోని బృందం పరిశీలన జరుపుతోంది.

హనుమకొండ మండలంలో అత్యధికంగా 3,066 దరఖాస్తులు రాగా, వీటి పరిశీలనకు  13 బందాలను ఏర్పాటు చేశారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.భద్రునాయక్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి కె.సురేఖ, చీఫ్‌ప్లానింగ్‌ అధికారి బి.సత్యనారాయణ, జిల్లా సహకారాధికారి జి.నాగేశ్వర్‌రావు, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి బి.నిర్మల, జిల్లా గిరిజ న సంక్షేమ అధికారి డి.ప్రేమకళ, గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకుడు కె.రవీందర్‌, మత్సశాఖ సహాయ సంచాలకుడు  టి.విజయభారతి, జిల్లా యువజన క్రీడల అధికారి జి.అశోక్‌ కుమార్‌, చేనేత, జౌళి సహాయ  సంచాలకుడు జి.రాఘవరా వు, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ, వ్యవసాయ శా ఖ సహాయ సంచాలకుడు కె.దామోదర్‌ రెడ్డి, జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారి ఐ.శ్యామ్‌ బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు.

పరిశీలనకు ప్రత్యేక యాప్‌
దరఖాస్తుల పరిశీలనకు సీసీఎల్‌ఏ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారుచేశారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఆ యాప్‌ ద్వారా ఏ జీవో కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాలను ధ్రువీకరించుకొని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. నిబంధనల ప్రకారం సరిచూసుకొని నివేదికను తయారు చేయనున్నారు. డీఆర్‌వో వాసుచంద్ర జిల్లా పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో భూములు, స్థలాల క్రమబద్ధీరకరణ దరఖాస్తుల పరిశీలన నుంచి రెవెన్యూ శాఖను తప్పించి, ఆ బాధ్యతలను ఇతర శాఖాధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జిల్లాలో పలుప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారి దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి.  పరిశీలన అనంతరం తయారు చేసిన నివేదికను కలెక్టర్‌కు అందచేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు క్రమబద్ధీకరణ చేస్తారు.

గతంలో..
గతంలో జారీచేసిన 58, 59 జీవోల కింద జిల్లాలో కొంతమంది దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిలో కొన్ని పరిష్కారం అయ్యాయి. ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం రెండు వాయిదాల్లో నిర్దేశిత ఫీజును చెల్లించకపోవడం, తగినఆధారాలు సమర్పించకపోవడంతో కొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. ఎన్ని దరఖాస్తులు ఏయే కారణాలతో పెండింగ్‌లో  పడ్డాయన్న వివరాలను ప్రభుత్వం ఇటీవలే అన్ని జిల్లాల నుంచి సేకరించింది. పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆ వివరాలను పరిశీలించి మరో మారు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మార్గదర్శకాలు ఇవే..
జీవో 58 కింద పెట్టుకున్న దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ  చేసింది. తమ ఆధీనంలోని స్థలాలను క్రమబద్దీకరించుకోవడానికి కరెంట్‌, నల్లా బిల్లుల్లో ఏదైనా ఒక దాని రుజువుగా చూపాలి. అధికారులు  దరఖాస్తుదారుల ఆదాయ పరిస్థితి,  ప్రభుత్వ ఉద్యోగులా లేక ఇతర ఉద్యోగుల అనేది పరిశీలిస్తారు. భూమే ఏ కేటగిరి (ప్రభుత్వ అభ్యంతరాలు లేని, లేదా అభ్యంతరాలు ఉన్న భూమి, మిగులు భమి ఇతర శాఖలకు చెందిన భూమి) కిందకు వస్తుందో  చూస్తారు. సదరు భూమి ఖాళీగా ఉందా? నిర్మాణంలో ఉందా? అనేది నిర్ధారిస్తారు. భూమి ఎప్పటి నుంచి కబ్జాలో ఉంది. దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? కోర్టు కేసులేమైనా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు.  2014 జూన్‌ 2 నాటికి ముందు ఆక్రమణలో ఉన్నట్టు రుజువులున్న స్థలాలనే క్రమబద్దీకరిస్తారు. ఖాళీ భూములను క్రమబద్ధీకరించరు. నివాసేతర వినియోగంలో ఉన్న స్థలాల్లో కూడా ఏదో ఒక నిర్మాణం ఉండాలి. ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.