వైద్య కళాశాల కోసం భూముల సర్వే ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-16T06:17:03+05:30 IST

వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం మండలంలోని భీమబోయినపాలెం రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 5,9లలో సుమారు 120 ఎకరాల డి.పట్టా భూముల్లో ఆదివారం సర్వే ప్రారంభమైంది.

వైద్య కళాశాల కోసం భూముల సర్వే ప్రారంభం
భూముల్లో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు

 ఆర్డీవో ప్రకటనతో దిగి వచ్చిన భీమబోయినపాలెం రైతులు    

  డి.పట్టా భూముల్లో రాత్రికి రాత్రే నాటిన సుమారు రెండు వేల కొబ్బరి మొక్కులు 

 పూర్తి వివరాలు నమోదు చేసుకున్న అధికారులు

మాకవరపాలెం, మే 15 : వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం మండలంలోని భీమబోయినపాలెం రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 5,9లలో సుమారు 120 ఎకరాల డి.పట్టా భూముల్లో ఆదివారం సర్వే ప్రారంభమైంది. ఈ భూములు సాగు చేస్తున్న రైతుల నుంచి గత రెండు రోజులుగా ఆర్డీవో, ఇన్‌చార్జి తహసీల్దార్‌ తదితరులు అభిప్రాయ సేకరణ చేపట్టారు.  ఎకరాకు  రూ. 17.5 లక్షలు నష్టపరిహారంతో పాటు చెట్లకు పరిహారం ఇస్తామని నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు స్పష్టం చేయడంతో చివరకు  రైతులు సర్వేకు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే భీమబోయినపాలెంలో  సర్వే నంబరు 9లో ఆదివారం 67 ఎకరాల భూమిని సర్వే చేశామని డిప్యూటీ తహసీల్దార్‌ చైనలు, మండల సర్వేయర్‌ గోవిందరావు, వీఆర్‌వో సాంబ తెలిపారు.  సాగులో ఉన్న రైతుల పేర్లతో పాటు భూమిలో ఉన్న చెట్ల వివరాలను నమోదు చేశారు. ఇదిలావుంటే,  వైద్య కళాశాలకు తీసుకుంటున్న భూముల్లో ఉన్న  చెట్లకు పరిహారం ఇస్తామని అధికారులు చెప్పడంతో శనివారం రాత్రి పలువు రైతులు సుమారు రెండు వేల వరకు కొబ్బరి మొక్కలను రాత్రికి రాత్రే నాటేశారు.  రెవెన్యూ అధికారులు కొత్తగా పాతిన ఈ మొక్కల వివరాలను సైతం నమోదు చేసుకున్నారు.  

Updated Date - 2022-05-16T06:17:03+05:30 IST