లే అవుట్లుగా అసైన్డ్‌ భూములు!

ABN , First Publish Date - 2022-04-07T07:26:17+05:30 IST

పట్టణాలు, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న అసెన్డ్‌ భూములను రియల్‌ వెంచర్లుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

లే అవుట్లుగా అసైన్డ్‌ భూములు!

  • పట్టణాలు, రహదారుల సమీపంలోని భూముల సేకరణ 
  • ప్లాట్లుగా మార్చి.. సదుపాయాలు కల్పించి విక్రయం
  • రైతుల డిమాండ్‌ను బట్టి ఎకరానికి 400 చ. గజాలు
  • అసైనీలకు న్యాయం, ఖజానాకు రాబడి ఆలోచనతోనే 
  • 600 - 1000 గజాలు ఇవ్వాలని రైతుల డిమాండ్లు
  • ఎకరంలో 80% తమకే ఇవ్వాలంటున్న ఖమ్మం రైతులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): పట్టణాలు, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న అసెన్డ్‌ భూములను రియల్‌ వెంచర్లుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో అసైనీలు, ప్రభుత్వం ఇద్దరూ లబ్ధి పొందేలా ప్రణాళికను రూపొందించింది. ప్లాట్లు, ఇళ్ల నిర్మాణాలకు డిమాండ్‌ ఉన్న చోట్ల ఉన్న అసైన్డ్‌ భూములను అసైనీల అంగీకారంతో సేకరిస్తారు. వాటిని ప్లాట్లుగా విభజించి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వెంచర్లుగా అభివృద్ధి చేసిన భూమి విస్తీర్ణాన్ని బట్టి అసైనీకి కొంత స్థలం ఇచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అసైనీ నుంచి ఎకరం సేకరిస్తే అందులో కనీసం 200 చదరపు గజాల స్థలాన్ని సదరు అసైనీకి పట్టా చేసి ఇస్తారు. ఉదాహరణకు ఒక రైతుకు ఎకరంన్నర అసైన్డ్‌ ల్యాండ్‌ ఉంటే 300 చదరపు గజాల స్థలాన్ని పట్టా చేస్తారు. దాంతో సదరు రైతుకు ఆ పట్టా స్థలంపై సర్వహక్కులు దఖలు పడతాయని, ఆ స్థంలలో ఇల్లు కట్టుకోవచ్చని, లేదంటే ఆ భూమిని అమ్ముకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కొన్నిచోట్ల రైతుల డిమాండ్‌ను బట్టి కొంత ఎక్కువ స్థలాన్ని ఇవ్వాలనీ భావిస్తోంది.


మహబూబ్‌నగర్‌, నల్లగొండ వంటి చోట్ల 400, 600 చదరపు గజాలు కూడా పట్టాచేసి ఇచ్చేందుకు హామీ లభిస్తోంది. ఎకరానికి 4840 చదరపు అడుగులు. ఎకరా భూమిలో 50శాతం దాకా రోడ్లు, పార్కు, ఇతర సౌకర్యాలకు పోతుంది. మిగిలిన 2420 చదరపు గజాల్లో అసైనీగా హక్కు కోల్పోయిన రైతుకు గరిష్ఠంగా 600 చదరపు గజాలు ఇచ్చినా 1820 చదరపు గజాలపై ప్రభుత్వానికి హక్కులు సంక్రమిస్తాయి. ఆ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయిస్తే ఖజానాకు ఆదాయం వస్తుంది. పట్టణీకరణ పెరుగుతుండటం, ఉద్యోగులు, వివిధ ఉపాధుల్లో ఉన్నవారు సొంతింటి కల నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇది మంచి ఆదాయ వనరు అని సర్కారు భావన. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనపై రైతుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల భూములు ఇవ్వమని అసైనీలు స్పష్టం చేస్తుంటే.. కొన్ని చోట్ల 200 చదరపు గజాలు కాకుండా 400 చదరపు గజాలు పట్టా చేసివ్వాలని కోరుతున్నారు.    


అసైన్డ్‌ భూములపైనే ఎందుకీ నిర్ణయం?

సాగుభూమి లేని నిరుపేదలు, బీసీ, ఎస్సీ వర్గాలకు గతంలో కొంత భూమిని ప్రభుత్వం అసైన్‌ చేసి ఇచ్చింది. ఈ భూముల్లో చాలామటుకు సాగుకు అంతగా అనుకూలం లేని భూములే ఉన్నాయి. రాళ్లు రప్పలు, ఎత్తుపల్లాలతో కూడి ఉండటం.. రైతులు సాగు చేయకపోవడంతో పడావుగానే ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్‌ భూములను విక్రయించరాదు. దీంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకొని వెంచర్లుగా అభివృద్ధి చేస్తే.. అసైనీగా హక్కు కోల్పోయిన రైతులకు కొంత స్థలాన్ని ఇవ్వడం ద్వారా వారికి న్యాయం చేసినట్లవుతుందని సర్కారు భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ప్లాట్లకు కొరత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వేసే వెంచర్లు కాబట్టి న్యాయపరమైన ఇబ్బందులేమీ తలెత్తవనే భరోసాతో చాలామంది కొనేందుకు ముందుకొస్తారని అభిప్రాయాలున్నాయి. 


 జిల్లాల్లో సేకరణ ఇలా.. 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 44వ జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామాల్లోని అసైన్డ్‌ భూములను పరిశీలించిన అధికారులు వారి ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు ఉంచారు. ఎకరానికి 400 చదరపు గజాల ప్రతిపాదనపై అక్కడి అసైనీల నుంచి వ్యతిరేక వ్యక్తమైంది. జిల్లాలోని భూత్పూర్‌ మండల కేంద్రంలోని సర్వే నంబర్లు 221, 184లలో 202 ఎకరాలను, జడ్చర్ల మండలం మాచారంలో 36 ఎకరాలు చిట్టెబోయినపల్లిలో 77 ఎకరాలు, గొల్లపల్లిలో 40 ఎకరాలు, నందిగామలో 50 ఎకరాలు, మోతీ ఘనపూర్‌లో 35 ఎకరాల భూమిని గుర్తించారు. వనపర్తి జిల్లా కేంద్రం శ్రీనివాసపూర్‌లోని 55 సర్వేనంబర్‌లో 65 ఎకరాలను గుర్తించారు. అయితే రైతులు భూమిని ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. పెబ్బేరులోని సర్వే నంబర్‌ 58లో 44.13 ఎకరాలు భూమి గుర్తించారు. ఇదే మండలంలోని కంచిరావుపల్లిలో పలు సర్వే నంబర్లలోని 36 ఎకరాలను గుర్తించారు. ఇక్కడే వ్యవసాయానికి యోగ్యం కాని పట్టాల్యాండ్‌ కూడా 476,474, 500, 510 సర్వే నంబర్లలో 70.14 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే రైతులెవరూ భూములు అప్పగించడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. 


వికారాబాద్‌ జిల్లాలో నాలుగు చోట్ల భూసేకరణ చేపట్టాలని ప్రతిపాదించగా, మూడు చోట్ల రైతులు సానుకూలంగా ఉన్నారు. వికారాబాద్‌ సమీపంలోని గంగారంలో సర్వే నంబర్లు 35 నుంచి 45 వరకు భూ సేకరణ చేపట్టాలని అధికారులు ప్రతిపాదించగా, అక్కడి రైతులు అంగీకరించడం లేదు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని మోకిల గ్రామంలో సర్వేనెంబర్లు 96, 197లలో 600 ఎకరాలకుపైగా భూమిని పరిశీలించారు. అక్కడి రైతులు అధిక మొత్తంలో ప్రభుత్వం సహయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. షాబాద్‌ మండలంలో పోతుగల్‌లో సర్వేనంబరు 183లో 144 ఎకరాలు, షాబాద్‌లో సర్వే నంబర్‌ 311లో 296 ఎకరాల భూమిని పరిశీలించారు. బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య వద్ద వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరగా భూమి ఉన్న ప్రతి రైతుకు వెయ్యి గజాల స్థలంతో పాటు, పరిహారం ఇచ్చేందుకు సీఎంతో చర్చిస్తానని చెప్పారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం మాదారంలో 225 ఎకరాల అసైన్డ్‌ భూమిని తీసుకొని టీఎ్‌సఐఐసీకి అప్పగించారు. ప్రతాప సింగారంలో కూడా అసైన్డ్‌ భూమితో పాటు కొంత పట్టాదారులది కలిసి 120 ఎకరాల భూమిని తీసుకొని ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ చేయడానికి రైతులతో చర్చలు జరుగుతున్నాయి. జిల్లాలోని మల్లాపూర్‌లో సర్వే నెంబరు 62లో 42 ఎకరాల భూమిని అధికారులు పరిశీలించారు. 


బోడుప్పల్‌లో సర్వే నంబరు 63లో 70 ఎకరాలను పరిశీలించారు. భూములు ఇవ్వడానికి రైతులు అంగీకరించారని మేడ్చల్‌ కలెక్టర్‌ హరీశ్‌ తెలిపారు. నల్లగొండ శివారులోని 10 ఎకరాలు ప్రభుత్వ భూమి, మరో 50 ఎకరాలు అసైన్డ్‌ భూమిని నుడా (నీలగిరి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటి) ద్వారా సేకరించి లేఔట్‌గా మార్చి విక్రయించాలని కలెక్టర్‌ అసైన్డ్‌ రైతులతో చర్చించారు. ఎకరాకు 600 గజాలు ఇస్తామని ప్రతిపాదించగా 700 నుంచి 800 గజాలు ఇవ్వాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. నల్లగొండ పట్టణ సమీపంలోని దండెంపల్లి గ్రామంలో సర్వేనంబరు 154లో 20 ఎకరాల లిడ్‌క్యాప్‌ భూమి, మరో 50 ఎకరాలు అసైన్డ్‌ భూమిని గుర్తించారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో 110 ఎకరాలు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జంగంపేట పరిధిలోని 136 ఎకరాల అసైన్డ్‌ భూములను హెచ్‌ఎండీఏ లేఔట్‌ కోసం సేకరించాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఎకరాకు 400 చ.గ.ప్లాటును కేటాయిస్తే భూమిస్తామని రైతులు చెప్పగా అంగీకరించే అవకాశాలున్నాయి.


నిర్మల్‌ జిల్లాలోని మూడు మండల్లాలో 144.51ఎకరాల అసైన్డ్‌ భూమిని గుర్తించగా భూములు ఇవ్వమని రైతులు అంటున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌ రూరల్‌, తిమ్మాపూర్‌, మానకొండూర్‌, మండలాల పరిధిలో 300 ఎకరాలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 100 ఎకరాలను గుర్తించారు. బెల్లంపల్లిలో ఇప్పటిదాకా 50ఎకరాలు సేకరించగా, మిగతా భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకరించడం లేదు. ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ వ్యతిరేకత ఉంది. జగిత్యాల జిల్లా కోరుట్ల, కొడిమ్యాల మండలాల్లో 91 ఎకరాలను  గుర్తించి సర్కారుకు ప్రతిపాదనలు పంపారు.


80 శాతం రైతులకే ఇవ్వాలంటూ

అసైన్డ్‌ భూముల సేకరణను ఖమ్మం జిల్లా రైతులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలోని సత్తుపల్లి, వైరా, కొణిజర్ల, రఘునాఽథపాలెం, ఖమ్మం రూరల్‌ మండలాల్లో తొలివిడతగా సుమారు 842 ఎకరాల అసైన్డ్‌ భూములను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, సేకరించిన భూమిలో 80శాతం సాగుదారుల పేరిట పట్టా చేయించాలని  రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరక తహసీల్దార్‌ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్‌ ఎదుట  ధర్నా చేశారు. ఒక్క సత్తుపల్లి మినహా మిగిలిన మండలాల్లో ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక్కడి 50 మంది లబ్ధిదారులు  అంగీకారం తెలిపారు. 


అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ

 నారాయణపేట జిల్లాలో అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. దామరగిద్ద మండలం కంసాన్‌పల్లి గ్రామంలో సర్వేనంబర్‌ 229లో 1024 ఎకరాల అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకొని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించి ఈ మధ్యకాలంలో రెవెన్యూ అధికార యంత్రాంగం సర్వేలు చేపట్టగా కంసాన్‌పల్లి గ్రామ రైతులు అధికారులను అడ్డుకొని తమ భూములు తమకే కావాలంటూ నిరసనలకు దిగారు. భూములను ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తేలేదని అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనంటూ పెట్రోల్‌, డీజిల్‌ పట్టుకొని అధికారులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే నారాయణపేట మండలం చిన్నట్రం గ్రామంలో సర్వేనంబర్‌ 144లో 150 ఎకరాల అసైన్డ్‌ భూములను పరిశ్రమల స్థాపన కోసం అదికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

Updated Date - 2022-04-07T07:26:17+05:30 IST