భూ మాయ

ABN , First Publish Date - 2021-10-02T06:23:25+05:30 IST

భూమి లేకుండా సృష్టించడం.. ఉన్న భూమిని మాయం చేయడం రెవెన్యూ అధికారులకు పరిపాటిగా మారింది.

భూ మాయ
అక్రమంగా రికార్డులు తయారు చేసి విక్రయించిన భూమి

దేవస్థాన భూమి కౌలు పేరుతో మోసం 

కొలతల్లో ఎక్కువగా ఉన్న భూమి స్వాహా

రికార్డుల్లోకి ఎక్కించి, ఆన్‌లైన్‌.. ఆపై విక్రయాలు

చక్రంతిప్పిన సర్వేయర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌

రిటైర్డ్‌ తహసీల్దార్‌ చివరిరోజు సంతకం

ఒంగోలు(క్రైం), అక్టోబరు 1 : భూమి లేకుండా సృష్టించడం.. ఉన్న భూమిని మాయం చేయడం రెవెన్యూ అధికారులకు పరిపాటిగా మారింది. అయితే ఇది మాత్రం అందుకు భిన్నం. దేవస్థానం భూమి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటం అక్రమార్కులకు కలిసొచ్చింది. అధికారుల సహకారంతో గుట్టుగా తమ పేరుపై మార్చుకుని అమ్మేశారు. ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్ట సర్వేనంబరు 137లో జరిగిన గోల్‌మాల్‌ ఇది. కోట్ల విలువ చేసే దేవస్థానం భూమిని కౌలుకు తీసుకున్నారు. అక్కడ అధికంగా భూమి ఉన్నట్లు గ్రహించి ప్రణాళికాబద్ధంగా పని ప్రారంభించారు. ఎక్కువగా ఉన్న 2.16 ఎకరాల భూమికి సంతనూతలపాడు మండలంలో గతంలో పనిచేసిన సర్వేయర్‌తో రికార్డులు సృషించారు. అందుకు కంప్యూటర్‌ ఆపరేటర్‌ సహకారం కూడా మెండుగా ఉంది. అదేక్రమంలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన తహసీల్దారు చివరిరోజు సంతకం పెట్టడం చూస్తే పథకం ఎలా పక్కాగా అమలు చేశారో అర్థమవుతోంది. సుమారు రూ.5కోట్ల విలువ చేసే భూమిని కాజేశారు. ఇది అంతా తెలిసిన రెవెన్యూ అధికారులు ఏం జరగనట్లు వ్యవహరిస్తుండటం చూస్తే ఎవరి వాటా ఎంత అనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్రమ పద్ధతుల్లో ఆన్‌లైన్‌ జరిగిందని అంగీకరించిన అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అంతేకాదు ఆ భూమి ఎవరిదో కూడా తేల్చలేదు. అంటే రెవెన్యూ అధికారుల పనితీరుకు ఈ వ్యవహారం పూర్తిగా అద్దంపడుతోంది.


ఆ భూమి ఎవరిది?

పేర్నమిట్ట సర్వే నంబరులో ఇటీవల ఆన్‌లైన్‌ జరిగిన 2.16 ఎకరాల భూమి ఎవరిది, కోట్ల విలువైన భూమి ఎందుకు ఇప్పటివరకు ఖాళీగా ఉంది అనేది రియల్‌ రంగంలో ఉన్న వారిలో చర్చనీయాంశమైంది. పాలకేంద్రం వెనుక వైపు సర్వేనంబరు 137లో 61 ఎకరాల భూమి ఉంది. అందులో 9.90 ఎకరాలు ఒంగోలు మహాలక్ష్మమ్మ దేవస్థానానికి సంబంధించిన భూమి. అయితే కనీసం వందేళ్ల నుంచి ఈ భూమిని పేర్నమిట్టకు చెందిన రైతులు నలుగురైదుగురు సాగు చేసుకుంటూ కౌలు చెల్లిస్తున్నారు. అయితే ఆ భూమిని ఎవరూ కొలతలు వేయలేదు. గతేడాది దేవస్థానం భూమిని కొలతలు పెట్టారు. ఆ సమయంలో అక్కడ దేవస్థానానికి ఉన్న భూమి కంటే అదనంగా 2.16 ఎకరాలు అధికంగా ఉందని తేలింది.  అప్పటి నుంచి సర్వేయరు గుట్టుగా ఉంచారు. కొంతమంది పేర్నమిట్టకు చెందిన నాయకులు దీనిపై కన్నేశారు. దీంతో దేవస్థానం భూమికి విలువ పెరిగింది. ఇప్పటివరకు కౌలు చేసుకుంటున్న వారిని కాదని వేలంలో తామే పాట పాడి భూమిని కౌలుకు దక్కించుకున్నారు. అక్కడి నుంచి అసలు కఽథ మొదలైంది. ఎక్కడి నుంచో వచ్చి పేర్నమిట్టలో నివాసం ఉంటున్న వారి పేరుపై 2.16 ఎకరాల భూమి ఆన్‌లైన్‌ చేశారు. అంతేకాదు కిందిస్థాయి అధికారులకు ఎవరికీ తెలియకుండా పరిశీలన పూర్తయ్యింది. 137 సర్వే నంబరు సబ్‌డివిజన్‌ జరిగిపోయింది.  అనువంశీకుల భూమిగా రికార్డులకు ఎక్కింది.


0.75 సెంట్లు విక్రయం 

ఇలా రికార్డులు సృష్టించిన వారు అందులో 0.75సెంట్ల భూమిని అమ్మేశారు. అంటే కోట్ల ఖరీదైన భూమిని కొట్టేయడంతో పాటు సొమ్ము కూడా చేసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం తమ వంతుగా ప్రేక్షకపాత్ర పోషించారు. దీనిపై కొంతమంది పేర్నమిట్ట గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ యంత్రాంగంలో కదలిక రాలేదు. సంతనూతలపాడు మండల తహసీల్దారు మాత్రం ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని చెబుతున్నారు.


విచారణ చేస్తున్నాం

రామానాయుడు, తహసీల్దారు, సంతనూతలపాడు

అక్రమంగా ఆన్‌లైన్‌ చేసింది నిజమే. పేర్నమిట్ట సర్వే నంబరు 137లో 2.16 ఎకరాల భూమి సబ్‌డివిజన్‌ చేసి, స్ర్కూట్నీ చేసి ఆన్‌లైన్‌ చేశారు. అందులో అప్పట్లో పనిచేసిన సర్వేయర్‌ పాత్ర ఉంది. ఆన్‌లైన్‌ నుంచి భూమిని తొలగించి విచారిస్తాం. ఈ అంశంపై ఒంగోలు ఆర్డీవోకు నివేదిక పంపించాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందగానే చర్యలు చేపడతాం.


Updated Date - 2021-10-02T06:23:25+05:30 IST