
అమరావతి: జగన్మోహన్ రెడ్డి పాలనకు ఫిట్ కారని అమరావతి నిర్మాణంపై కోర్టులో వేసిన అఫిడవిట్‌తో తెలిపోయిందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక్క రాజధానికి 60 నెలలు అయితే, మూడు రాజధానులకు 180 నెలలా? అని ప్రశ్నించారు. అదే భూసేకరణ లేదా సమీకరణ కూడా జగన్ చేయాల్సి వస్తే 1800 నెలలు కావాలేమోనని ఎద్దేవా చేశారు. నాడు ప్రపంచ బ్యాంక్ అమరావతి భూముల భవిష్యత్తు నగదీకరణ హామీతో ఇవ్వడానికి సిద్దమైన 25 వేల కోట్ల రుణం కాలరాసింది ఏవరు? ఆయన నిలదీశారు. నేడు 480 ఎకరాలు అమరావతి రాజధాని భూములు తాకట్టు పెట్టి రూ. 3 వేల కోట్ల రుణం తెచ్చి, ఆ భూములనే అమ్మి ఆ అప్పు తీరుస్తామన్న ప్రతిపాదన ఎవరిదన్నారు. మూడు సంవత్సరాల సమయం వృథా చేసి, ఇప్పుడు ఆగిన పనులకు కాంట్రాక్టర్లను వెతుకు తున్నారా? అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి మాటలు ఒకదానికొకటి పొంతన లేవన్నారు. రాష్ట్రంలో నిర్మాణల కోసం ఒక ఇటుక వేసే శక్తి కూడా లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్ పాలన పోవడంతోనే రాజధాని అమరావతి నిర్మాణం దానంతట అదే పరుగులు తీస్తుందనేది ప్రజల నమ్మకమని లంకా దినకర్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి