పెద్ద నోట్లు తగ్గిపాయే!

ABN , First Publish Date - 2022-05-28T06:44:42+05:30 IST

ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోటు చలామణి మరింత తగ్గింది. ఈ ఏడాది మార్చి నాటికి చలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల సంఖ్య 214 కోట్లకు పడిపోయింది.

పెద్ద నోట్లు తగ్గిపాయే!

మరింతతగ్గిన రూ.2,000 నోట్ల చలామణి 


మొత్తం కరెన్సీ నోట్లలో 1.6%కి తగ్గిన వాటా

ప్రస్తుతం వ్యవస్థలో రూ.500 నోట్లదే హవా 

వెల్లడించిన ఆర్‌బీఐ వార్షిక నివేదిక


ముంబై: ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోటు చలామణి మరింత తగ్గింది. ఈ ఏడాది మార్చి నాటికి చలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల సంఖ్య 214 కోట్లకు పడిపోయింది. ఆ సమయానికి మార్కెట్లోని అన్ని డినామినేషన్‌ నోట్లలో రూ.2,000 కరెన్సీ వాటా ఏకంగా 1.6 శాతానికి తగ్గింది. శుక్రవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్‌బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు.. 


2021 మార్చినాటికి వ్యవస్థలో చలామణి అవుతున్న అన్ని డినామినేషన్‌ నోట్ల సంఖ్య 12,437 కోట్లుగా నమోదు కాగా.. 2022 మార్చి నాటికి 13,053 కోట్లకు పెరిగింది. 

2020 మార్చి నాటికి 274 కోట్ల రూ.2,000 నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. అప్పటికి చలామణిలో ఉన్న అన్ని డినామినేషన్‌ నోట్లలో వీటి వాటా 2.4 శాతంగా ఉండేది. 

2021 మార్చి నాటికి 245 కోట్ల రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా.. మొత్తం కరెన్సీలో వాటా 2 శాతంగా నమోదైంది. 

అన్ని డినామినేషన్‌ నోట్ల మొత్తం విలువలో రూ.2,000 నోట్ల వాటా 2020 మార్చి నాటికి 22.6 శాతంగా ఉండగా.. 2021 మార్చి నాటికి 17.3 శాతానికి, 2022 మార్చి నాటికి 13.8 శాతానికి పడిపోయింది. 

గత ఏడాది మార్చి నాటికి వ్యవస్థలో 3,867.90 కోట్ల రూ.500 నోట్లు సర్క్యులేషన్‌లో ఉండగా.. ఈ మార్చి నాటికి 4,554.68 కోట్లకు పెరిగింది. 

ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని డినామినేషన్‌ కరెన్సీల్లోకెల్లా రూ.500 నోట్లదే హవా. సర్క్యులేషన్‌లో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల వాటాయే 34.9 శాతం. ఇదే అత్యధికం. ఆ తర్వాత స్థానం రూ.10 నోటుది. వీటి వాటా 21.3 శాతంగా ఉంది. 

గడిచిన రెండేళ్లలో రూ.500 నోట్ల చలామణి భారీగా పెరుగుతూ వచ్చింది. విలువపరంగా, మొత్తం కరెన్సీ సర్క్యులేషన్‌లో వీటి వాటా 2020 మార్చి నాటికి 25.4 శాతంగా ఉండగా.. 2021 మార్చికల్లా 31.1 శాతానికి చేరుకుంది. ఈ మార్చి నాటికి 34.9 శాతానికి ఎగబాకింది. 

విలువపరంగా చూసినా, చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల వాటా 2020 మార్చిలో 60.8 శాతంగా ఉండగా.. 2022 మార్చిలో 73.3 శాతానికి చేరుకుంది. 

వ్యవస్థలో చలామణిలో ఉన్న అన్ని డినామినేషన్‌ కరెన్సీల మొత్తం విలువ 2021 మార్చిలో రూ.28.27 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ మార్చి చివరి నాటికి రూ.31.05 లక్షల కోట్లకు పెరిగింది. 

విలువపరంగా, ఈ మార్చి 31 నాటికి మొత్తం కరెన్సీల్లో రూ.500, రూ.2,000 నోట్లదే 87.1 శాతం వాటా. 2021 మార్చి నాటికి ఈ వాటా 85.7 శాతంగా ఉంది. 

గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 9.9 శాతం, సంఖ్య 5 శాతం పెరిగింది. 2020-21లో ఈ వాటా వరుసగా 16.8 శాతం, 7.2 శాతంగా ఉంది. 

ప్రస్తుతం వ్యవస్థలో రూ.2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 కరెన్సీ నోట్లతోపాటు 50 పైసలు, రూపాయి, రూ.2, 5, 10, 20 నాణేలు కూడా చలామణిలో ఉన్నాయి. 


2021-22లో రూ.60,414 కోట్ల బ్యాంకింగ్‌ మోసాలు 

గత ఆర్థిక సంవత్సరం (2021 -22) దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో నమోదైన మోసాలు 9,103కు పెరిగినప్పటికీ, తత్ఫలితంగా ఏర్పడిన నష్టం మాత్రం రూ.60,414 కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది. అందు లో రుణ మోసాల వాటాయే 96 శాతంగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో  రూ.1.38 లక్షల కోట్ల విలువైన 7,359 బ్యాంకింగ్‌ మోసాలు నమోదయ్యాయి. అంటే, వార్షిక ప్రాతిపదికన బ్యాంకింగ్‌ మోసాల విలువ సగానికి పైగా తగ్గిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పోలిస్తే, ప్రైవేట్‌ బ్యాంక్‌ల్లోనే అత్యధిక (58.6 శాతం) మోసపూరిత లావాదేవీలు నమోదయ్యాయి. కానీ, విలువపరంగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అధిక (66 శాతం) మోసాలు జరిగాయి. 


సంస్కరణలతోనే సుస్థిర వృద్ధి

సుస్థిర, సమతుల్య, సమ్మిళిత వృద్ధి సాధించడంతో పాటు కరోనా సంక్షోభ అనంతర ప్రభావాల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యవస్థాగత సంస్కరణలు అత్యవసరమని ఆర్‌బీఐ నొక్కిచెప్పింది. సరఫరా వ్యవస్థలో అవరోధాల తొలగింపు, ధరల నియంత్రణకు ద్రవ్య పరపతి విధానపరమైన చర్యలు, మూలధన పెట్టుబడుల పెరుగుదలపైనే భవిష్యత్‌ వృద్ధి ఆధారపడి ఉందని వార్షిక నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ తన నివేదికలో ప్రస్తావించిన మరిన్ని అంశాలు.. 


డిజిటల్‌ కరెన్సీ: దేశంలో డిజిటల్‌ కరెన్సీ ప్రవేశపెట్టేందుకు సానుకూలతలు, ప్రతికూలతలను సమీక్షిస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. డిజిటల్‌ కరెన్సీ విడుదలకు గ్రేడెడ్‌ విధానాన్ని అవలంభించనున్నట్లు తెలిపింది. 

ద్రవ్యోల్బణం: అధిక టోకు ధరలతో రిటైల్‌ ధరలపై ఒత్తిడి పెరగనుందని ఆర్‌బీఐ హెచ్చరించింది. పారిశ్రామిక ముడిసరుకులు, రవాణా వ్యయా లు, సరఫరా అవాంతరాల కారణంగా ద్రవ్యోల్బణం మితిమీరిన స్థాయిలోనే కొనసాగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 

బ్యాంకింగ్‌: కరోనా సంక్షోభ కాలంలో పునర్‌వ్యవస్థీకరించిన రుణాలపై కన్నేసి ఉంచడం ద్వారా మొండి బకాయిలు మరింత పెరగకుండా జాగ్రత్త పడుతూనే బ్యాంక్‌లు ఆర్థిక వృద్ధికి దోహదపడాలని ఆర్‌బీఐ కోరింది. కరోనా సవాళ్ల సమయంలో బ్యాంకింగ్‌ రంగం ఆర్థిక పనితీరును మెరుగుపర్చుకోలిగిందని వార్షిక నివేదికలో పేర్కొంది. 



 రూ.61.9 లక్షల కోట్ల బ్యాలెన్స్‌షీట్‌ 

గత ఆర్థిక సంవత్సరం (2021 -22)లో ఆర్‌బీఐ బ్యాలెన్స్‌షీట్‌ వార్షిక ప్రాతిపదికన 8.46 శాతం పెరిగి రూ.61.9 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాదిలో ఆర్‌బీఐ ఆదాయం 20.14 శాతం వృద్ధి చెందగా.. వ్యయం 280.13 శాతం ఎగబాకింది. కాగా, మిగులు నిల్వలు రూ.30,307.45 కోట్లకు పరిమితం అయ్యాయని ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది. 

Updated Date - 2022-05-28T06:44:42+05:30 IST