Lumbini Parkలో లేజర్‌షో కనుమరుగు.. మూడేళ్లుగా పట్టించుకోవట్లేదేం..!?

ABN , First Publish Date - 2022-05-19T17:26:47+05:30 IST

లుంబినీ పార్కులో లేజర్‌షో (Laser Show) కనుమరుగైంది. మూడేళ్లుగా ..

Lumbini Parkలో లేజర్‌షో కనుమరుగు.. మూడేళ్లుగా పట్టించుకోవట్లేదేం..!?

  • హుస్సేన్‌సాగర్‌ తీరాన కరువైన ఆటవిడుపు
  • కరోనా కారణంగా మూసివేత
  • గతంలో ఏడాదికి రూ. 2 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌ సిటీ : లుంబినీ పార్కులో లేజర్‌షో (Laser Show) కనుమరుగైంది. మూడేళ్లుగా దీనిని నిర్వహించడం లేదు. పునరుద్ధరిస్తారన్న నమ్మకం కూడా లేదు. పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో లుంబినీ పార్కులోని లేజర్‌షోలో ఉగ్రవాదులు బాంబులు పెట్టి హింసాకాండ సాగించినా, అప్పట్లో యథావిధిగా పునరుద్ధరించి భద్రతా చర్యలు చేపట్టారు. అయితే.. కొవిడ్‌ కారణంగా (Corona) మూతపడిన లేజర్‌షో నేటికీ తెరుచుకోలేదు. గతంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగితే ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ప్రైవేటు సంస్థకు అప్పగించిన తర్వాత ఆదాయం రాకపోగా పూర్తిగా మూతపడడం విశేషం. లేజర్‌ షోను రోజూ సుమారు వెయ్యి నుంచి 1,500 మంది సందర్శించేవారు. సాధారణ రోజుల్లో ఒకటే షో ఉండగా.. శని, ఆదివారాల్లో రెండు షోలు నిర్వహించేవారు. 30 నిమిషాల నిడివి గల లేజర్‌ షో దేశ భక్తి గీతలు, రాష్ట్ర ఔనత్యాన్ని తెలియజేసే పాటలకు అనుగుణంగా నడిచేది. లేజర్‌ షో ఓపెన్‌ థియేటర్‌ కావడంతో వీక్షకులు అందులో వచ్చే పాటలకు అనుగుణంగా స్టెఫ్పులేసేవారు.


ప్రైవేట్‌ సంస్థకు అప్పగించాకే..

లేజర్‌ షో నిర్వహణను గతంలో హెచ్‌ఎండీఏ చేపట్టగా.. 2019లోనే ఓ ప్రైవేటు సంస్థ చేపడుతోంది. సరికొత్త టెక్నాలజీతో లేజర్‌ షోకు మరింత మెరుగులు అందించేందుకు ప్రైవేటు సంస్థకు కేటాయించారు. లేజర్‌ షో ద్వారా ఏడాది రూ. 1.11 కోట్లను హెచ్‌ఎండీఏకు చెల్లించేలా ఒప్పందం చేసుకోగా,  కేవలం ఏడాది మాత్రమే ఆ సంస్థ నిర్వహించింది. గతంలో ఏడాదికి రూ. 2 కోట్ల ఆదాయం వస్తుండగా, ప్రైవేటుకు అప్పగించాక ఆదాయం పడిపోయింది. ఇంతలోనే కరోనా మహమ్మరి కారణంగా గతేడాది మార్చి 22న లేజర్‌ షో మూసేశారు. లాక్‌డౌన్‌-1, లాక్‌డౌన్‌-2 ముగిసిన తర్వాత పార్కులు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు (Cinema Theatres), బార్లు, పబ్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కానీ లేజర్‌ షో మాత్రం అందుబాటులోకి రాలేదు. హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలకు వచ్చే వేలాది మంది సందర్శకులు లేజర్‌ షో తెరవకపోవడంతో నిరాశగా ఇంటిబాట పడుతున్నారు.


మూడేళ్లుగా పట్టించుకోని HMDA

ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. మరో వైపు ఆదాయాన్నిచ్చే కల్పతరువును హెచ్‌ఎండీఏ అధికారులు గాలికొదిలేశారు. లేజర్‌ షో ద్వారా వచ్చే ఆదాయంతో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులోని అధికారులు, ఉద్యోగుల జీత భత్యాలు చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లుగా లేజర్‌షో మూసేశారు. ప్రైవేటు సంస్థ దీనిని మూలన పడేసింది. హెచ్‌ఎండీఏలోని బీపీపీ కూడా నిర్వహించడం లేదు. హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం వల్ల సంస్థకు రావాల్సిన ఆదాయం కోల్పోతోంది. లేజర్‌ షో నిర్వహణ లేకపోవడంతో లక్షల విలువ చేసే యంత్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఫౌంటెయిన్‌ మాదిరిగా నీటితో పలు రకాల డిజైన్లు వచ్చే వ్యవస్థ కూడా నిర్వహణ లేకపోవడంతో ఎక్కడికక్కడ జామ్‌ అయిన్నట్లు సమాచారం.



Updated Date - 2022-05-19T17:26:47+05:30 IST