అంతా ‘షో’!

ABN , First Publish Date - 2021-08-03T06:26:49+05:30 IST

ప్రజల సొమ్ము నీటిపాలై..

అంతా ‘షో’!

కృష్ణానదిలో లేజర్‌ షోపై వేటు!


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ప్రజల సొమ్ము నీటిపాలై పోయింది. భవానీ ద్వీపానికి అందాలద్దిన లేజర్‌ అండ్‌ మ్యూజికల్‌ ఫౌంటేన్‌ను వరద ధ్వంసం చేసింది. కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన లేజర్‌ అండ్‌ మ్యూజికల్‌ ఫౌంటేన్‌ను కాంట్రాక్టర్‌కు అప్పగించి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. దీనికి ఇన్సూరెన్స్‌ ఉందని తిరిగి పునరుద్ధరణ చేయటం కష్టం కాదని పర్యాటక శాఖ అధికారులు, మంత్రి కూడా చెప్పారు. ఇది గడిచి ఏడాదిన్నర అయింది. ఇప్పటి వరకూ దాని పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


రూ. 16 కోట్ల వ్యయంతో కృష్ణానదిలో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన లేజర్‌ అండ్‌ మ్యూజికల్‌ ఫౌంటేన్‌ను కాంట్రాక్టర్‌కు అప్పగించేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టర్‌ మీద ప్రేమో, మరేమైనా కారణమో తెలియదు కానీ దీని పునరుద్ధరణ అంశాన్నే పక్కన పెట్టేశారు. నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన లేజర్‌ అండ్‌ మ్యూజికల్‌ ఫౌంటేన్‌ రెండేళ్ల క్రితం వరదలకు ధ్వంసమైంది. దీనికి ఇన్సూరెన్స్‌ ఉందని తిరిగి పునరుద్ధరి స్తామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి భవానీ ద్వీపాన్ని పరిశీలించిన సందర్భంలో చెప్పారు. ఇది గడిచి ఏడాదిన్నర అయింది. నేటికీ చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. 


ప్రాజెక్టు ఊసెత్తని పర్యాటక శాఖ 

కృష్ణానదిలో వినోదాన్ని పతాకస్థాయికి తీసుకు వెళ్లేందుకు 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన లేజర్‌ అండ్‌ మ్యూజికల్‌ ఫౌంటేన్‌ను భవానీద్వీపంలో ఏర్పాటు చేశారు. రూ.16 కోట్ల వ్యయంతో దీని టెండర్‌ దక్కించుకున్న ఉత్తరాది కంపెనీకి దశల వారీగా రూ.14 కోట్లు చెల్లించారు. భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టు కాబట్టి దానిని ఏడాది పాటు పరిశీలించి దశల వారీగా చెల్లింపులు జరుపుతూ వచ్చారు. ఇంకా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. 2019లో కృష్ణానదికి వరదలు రావటంతో ఇది ధ్వంసమైంది. వరదలను దృష్టిలో ఉంచుకొని అప్పట్లో దీనికి ఇన్సూరెన్స్‌ చేయించినట్టు పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. అయితే ఇన్సూరెన్స్‌ను కాంట్రాక్టర్‌తో చేయించారా? పర్యాటక శాఖ అధికారులే చేయించారా? బీఐటీసీ చేయించిందా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. వరదలు తగ్గిన తర్వాత కూడా దీని పునరుద్ధరణ పనులు మొదలు పెట్టలేదు. ప్రభుత్వం నుంచి రూ.14 కోట్లు చెల్లించిన భారీ ప్రాజెక్టు పట్టుమని రెండేళ్లు కూడా నడవకపోయినా పర్యాటకశాఖ, బీఐటీసీ అధికారులు చోద్యం చూస్తూ కూర్చోవటమే విడ్డూరంగా ఉంది. 


కాంట్రాక్టు సంస్థ పేచీ 

వరదల తాకిడికి ధ్వంసమైన మ్యూజికల్‌ ఫౌంటేన్‌కు ఇన్సూరెన్స్‌ ఉన్నందున నష్టపోయేది ఏమీ ఉండదు. కానీ ఇప్పటి వరకు కాంట్రాక్టు సంస్థ ఆ దిశగా చొరవ చూపించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తనకు చెల్లించాల్సిన బ్యాలెన్స్‌ రూ.2 కోట్లు ఇస్తేనే పునరుద్ధరణ పనులు  చేపడతామని కాంట్రాక్టు సంస్థ పట్టుబట్టినట్టు సమాచారం. వరదలను సైతం తట్టుకునేలా దుర్భేద్యంగా ఏర్పాటు చేస్తామన్న కాంట్రాక్టు సంస్థ ఆ దిశగా వైఫల్యం చెందితే ఆ సంస్థపై ఒత్తిళ్లు తీసుకు వచ్చి పునరుద్ధరణ పనులు చేయించాల్సిన పర్యాటక శాఖ అధికారులు ఈ అంశాన్నే పట్టించుకోవటం లేదు. 


ఇన్సూరెన్స్‌ ఉత్తిమాటేనా? 

రూ.16 కోట్ల ప్రాజెక్టుకు ఇన్సూరెన్స్‌ చేయించామని పర్యాటక శాఖ చెబుతున్నా.. అసలు ఇన్సూరెన్స్‌ చేయించి ఉంటారా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. నిజంగా చేయించి ఉంటే కాంట్రాక్టు సంస్థ పునరుద్ధరణ పనులు మొదలు పెట్టి ఉండేది. పనులు చేపడితే కాంట్రాక్టు సంస్థకు ఆ ఇన్సూరెన్స్‌ ద్వారానే రూ.2 కోట్ల పెండింగ్‌ బిల్లు కూడా చెల్లించవచ్చు. కానీ ఇవేమీ జరగటం లేదంటే అసలు ఇన్సూరెన్స్‌ లేకుండానే ఏర్పాటు చేశారా అనే సందేహం తలెత్తుతోంది.


మరో ప్రాజెక్టు కోసమే తొక్కిపట్టారా? 

హరిత బెర్మ్‌పార్క్‌లో లేజర్‌ షో ఏర్పాటుకు సంబంధించి ఇటీవల పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. దీని కోసమే భవానీ ద్వీపంలోని లేజర్‌ షో ప్రాజెక్టును పక్కన పెట్టారా అన్నది సందేహంగా ఉంది. దీని కోసం రూ.16 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా కాంట్రాక్టర్‌కు వదిలేస్తున్నారా? అన్న అనుమానాలు కూడా నెలకొంటున్నాయి. లేజర్‌ అండ్‌ మ్యూజికల్‌ ఫౌంటేన్‌కు వరదల తాకిడి ఉందని భావిస్తే దానిని భవానీ ద్వీపంలో పూల్‌ లాంటిది ఏర్పాటు చేసైనా అమర్చవచ్చు. లేదంటే హరిత బెర్మ్‌పార్క్‌లో అయినా ఏర్పాటు చేయవచ్చు. ఇలాంటి ఆలోచనలు చేయకుండా రూ.14 కోట్లను అప్పనంగా కాంట్రాక్టర్‌కు వదిలేసి కొత్త ప్రాజెక్టు అంటూ ఎత్తుకోవటం అనేక ఆరోపణలకు దారి తీస్తోంది. 



Updated Date - 2021-08-03T06:26:49+05:30 IST