Lashkar Bonalu: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం

ABN , First Publish Date - 2022-07-17T16:56:19+05:30 IST

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల

Lashkar Bonalu: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం

హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరకు ఆలయం ముస్తాబయ్యింది. అమ్మవారి ఆలయాన్ని పూలు, తోరణాలు, విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాల జాతర సందర్భంగా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి తొలిపూజలు నిర్వహించారు. అనంతరం సాధారణ భక్తులను బోనాల సమర్పణకు, అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గోదావరి తీరంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సాయంత్రం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు.


సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 300 సీసీ కెమెరాల ద్వారా నిఘా కట్టుదిట్టం చేశారు. మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని ప్రజలకు పోలీసులు సూచించారు.


ట్రాఫిక్‌ ఆంక్షలు

లష్కర్‌ బోనాల నేపథ్యంలో ఆదివారం ఉదయం 4 గంటల నుంచి సోమవారం బోనాల జాతర ముగిసే వరకు ఆలయ పరిసరాల్లో రోడ్లను మూసి వేయనున్నారు. వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సీపీ ఆనంద్‌ సూచించారు. 


150 ప్రత్యేక బస్సులు

బోనాల సందర్భంగా ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులు నడపనుందని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి బోనాల స్పెషల్‌ బస్సులు సికింద్రాబాద్‌ వరకు నడుస్తాయని తెలిపారు. ఇందుకోసం 11 ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించారు. 


బంగారు బోనం సమర్పించనున్న కవిత

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి బోనాల జాతర సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆదివారం అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. మంత్రి తలసాని నివాసం నుంచి ఆమె బంగారు బోనంతో ఆలయానికి చేరుకుని, అమ్మవారికి సమర్పిస్తారు. 

Updated Date - 2022-07-17T16:56:19+05:30 IST