గోళ్లు పెంచుకుందని కొట్టిన ప్రిన్సిపాల్! బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-18T21:50:10+05:30 IST

హరియాణాలోని పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టడం వల్ల మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకుందని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు.

గోళ్లు పెంచుకుందని కొట్టిన ప్రిన్సిపాల్! బాలిక ఆత్మహత్య

గురుగ్రామ్: హరియాణాలోని పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టడం వల్ల మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకుందని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోళ్లు కత్తిరించుకోకుండా స్కూలు వచ్చిందని, పొడుగు జూకాలు పెట్టుకుందని ఆగ్రహించిన ప్రిన్సిపాల్ అందరి ముందూ బాలిక చెంప పగలగొట్టారని వారు ఆరోపించారు. స్కూల్ నుంచి తొలగిస్తున్నట్టు కూడా పేర్కొన్నారని తెలిపారు. దీంతో.. తీవ్ర మనస్థాపానికి లోనైన ఆమె ఏప్రిల్ 9న ఉరిపోసుకుని ప్రాణాలు తీసుకుందని తెలిపారు. వారు పేర్కొన్నదాని ప్రకారం.. అంతకు ముందురోజు బాలిక విషయమై చర్చించేందుకు ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను స్కూలుకు పిలిపించారట. ఆమెలో క్రమశిక్షణ లోపించిందని వారితో ప్రిన్సిపాల్ ఆ సందర్భంగా వ్యాఖ్యానించారట. స్కూల్‌కు సెల్‌ఫోన్ తేవడంపై కూడా అభ్యంతరం పెట్టిన ప్రిన్సిపాల్..బాలికకు టీసీ ఇచ్చి పంపించాలని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి బాలిక ఆ రోజు బాగా బాధపడిందని, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా తన గదిలోనే ఉండిపోయిందని వారు తెలిపారు. ఆ రోజు ఆమె ఆహారం కూడా తీసుకోలేదన్నారు. 


ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను మరుసటి రోజు కలవగా.. తన నిర్ణయం మార్చుకునేందుకు ప్రిన్సిపాల్ అంగీకరించలేదన్నారు. తల్లిదండ్రులు నచ్చ చెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. అంతేకాకుండా.. బాలిక సోదరుడిపై కూడా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్ ఇద్దరినీ స్కూల్ నుంచి తొలగించాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో..నిరాశగా వెనుదిరిగిన తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని బాలికతో చెప్పారు. ఏదో మార్గం ఉండకపోదు అంటూ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలిక తన గదిలో వెళ్లి తలుపులు వెసుకుంది. ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వారు గది తలుపులు బద్దలు కొట్టగా..ఆమె ఫ్యానుకు వేళాడుతుండటం వారికి కనిపించింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. దీంతో..వారు ఏప్రిల్ 14న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-04-18T21:50:10+05:30 IST