మోహినీయాట్టంతో ఆహూతులను అలరించిన లాస్యధృత విద్యార్థులు

ABN , First Publish Date - 2022-08-18T22:45:44+05:30 IST

మహారాజ స్వాతి తిరునాళ్‌ స్వరరచనలతో పాటు కావలమ్‌ నారాయణ పానిక్కర్‌ స్వర రచనలకు అనుగుణంగా మోహినీయాట్టం

మోహినీయాట్టంతో ఆహూతులను అలరించిన లాస్యధృత విద్యార్థులు

హైదరాబాద్: మహారాజ స్వాతి తిరునాళ్‌  స్వరరచనలతో పాటు కావలమ్‌ నారాయణ పానిక్కర్‌ స్వర రచనలకు అనుగుణంగా మోహినీయాట్టం నృత్య ప్రదర్శనలతో లాస్య ధృత విద్యార్థులు ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నృత్య కారిణిలు శరణ్య కేదార్‌నాథ్‌, సమృద్ధి త్రిగుళ్ల, కృతి నాయర్‌, సుజి పిళ్లై, షాల్లు పిళ్లై, రుక్మిణి కేదార్‌నాథ్‌, డాక్టర్‌ సంధ్య, మీరా, మేథ నాయర్‌లు చక్కటి లయతో అలరించారు. అష్టపదులకు వైవిధ్యమైన నృత్య రీతులను సృష్టించి అనిత ముక్త మౌర్య ఆహుతులను ఆకట్టుకున్నారు. యమన కళ్యాణి రాగంలో జయదేవుని అష్టపది ‘చందన చర్చిత నీల కలేభర’ అంటూ ఆమె చేసిన కంపోజిషన్‌ ఆకట్టుకుంది. శ్రీకృష్ణుడు, గోపికల నడుమ రాసలీలకు సాక్షీభూతంగా  శిల్పారామం వేదిక నిలిచింది. రాధ, కృష్ణుల ప్రేమను అద్భుతంగా స్టేజ్‌పై అనితా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం థిల్లానా, మంగళం తో పాటుగా వందేమాతర గీతంతో వందనం అర్పించడంతో ముగిసింది.


సుప్రసిద్ధ మోహినీయాట్ట నృత్యకారిణి అనిత ముక్త శౌర్య. వృత్తి, అభిరుచి మధ్య సమతూకం పాటించే ఆమె నటి, నృత్యకారిణి, మోటర్‌  బైకర్‌, రచయిత... ఇలా విభిన్న రకాలుగా తనదైన ప్రతిభను చాటడమే కాదు సమాజంలో మార్పుకూ కృషి చేస్తున్నారు. మోహినీయాట్ట నృత్యకారిణిగా కొరియోగ్రఫీ, ఎంచుకునే నేపథ్యాలు వినూత్నంగా ఉండటమే కాదు ప్రశంసలనూ అందుకున్నాయి. అనిత ప్రారంభించిన లాస్యధృత  సెంటర్‌ ఫర్‌ పెర్‌ఫార్మింగ్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ద్వారా  మోహినీయాట్టం, కర్ణాటిక్‌ వోకల్స్‌, వీణ, వయోలిన్‌, ఫ్లూట్‌లో శిక్షణ అందిస్తున్నారు.

Updated Date - 2022-08-18T22:45:44+05:30 IST