ఎందుకంత జాప్యం!?

ABN , First Publish Date - 2020-12-04T05:02:52+05:30 IST

కండలేరు డ్యాం పటిష్టతకు ఒకటిన్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న డ్రిల్లింగ్‌, గ్రౌటింగ్‌ పనులు, రెండేళ్ల క్రితం అర్ధంతరంగా ఆగిపోయాయి.

ఎందుకంత జాప్యం!?
కండలేరు మట్టికట్టపై నిరుపయంగా గ్రౌటింగ్‌ యంత్రాలు

15 టీఎంసీలకే కండలేరు మట్టికట్టలో లీకేజీ

రెండేళ్ల క్రితమే ఆగిన కటాఫ్‌ట్రెంచ్‌, డ్రిల్లింగ్‌, గ్రౌటింగ్‌ పనులు

తప్పు పడుతున్న యంత్రాలు


రాపూరు, డిసెంబరు 3: కండలేరు డ్యాం పటిష్టతకు ఒకటిన్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న డ్రిల్లింగ్‌, గ్రౌటింగ్‌ పనులు, రెండేళ్ల క్రితం అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో డ్యాంను లీకేజీలు వెంటాడుతున్నాయి. కండలేరు డ్యాంకు 11 కిలోమీటర్ల పొడవైన మట్టికట్ట ఉంది. ఈ డాంమం పూరి ్తసామర్థ్యం 68 టీఎంసీలు. కాగా,  2001-02లో  తొలిసారిగా 15టీఎంసీలను నిల్వ చేయడంతో లీకేజీలు దర్శనమిచ్చాయి.  2వేల లూజియాన్స్‌ పైగా లీకేజీలు వస్తుండడంతో గంగ ఇంజనీర్లు అందోళన చెందారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.


నిపుణుల కమిటీ నియామకం


కండలేరు డ్యాం పటిష్టత కోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కండలేరును క్షుణ్ణంగా పరిశీలించింది. డ్యాంలో 15 టీఎంసీల కంటే ఎక్కువ నీరు నిల్వచేస్తే మట్టికట్టకు ముప్పుతప్పదని తేల్చిచెప్పింది.  మట్టికట్టను మరింత పటిష్టం చేసి అంచలంచెలుగా నీరు నిల్వచేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి డ్యాం నిపుణుల కమిటీ పర్యవేక్షణలోకి వెళ్లింది.   దీంతో కమిటీ సూచనల మేరకే నీటిని నిల్వచేసేవారు.  ఎప్పటి కప్పుడు నూతన ఇంజనీరింగ్‌ విధానాలు అమలుచేస్తూ డ్యాంలో అత్యధికంగా 50టీఎంసీల నీటిని నిల్వ చేసే స్థాయికి తెచ్చారు. 


కటా్‌ఫట్రెంచ్‌, డ్రిల్లింగ్‌, గ్రౌటింగ్‌ పనులు


మట్టికట్ట పటిష్టత కోసం  కటా్‌ఫట్రెంచ్‌, గ్రౌటింగ్‌ పనులకు 2004లో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో డ్యాం లోపలివైపు కట్టకింద భాగంలో గొయ్యి తీసి ఒండ్రు మట్టిని అందులో నింపారు. డ్రిల్లింగ్‌, గ్రౌటింగ్‌ చేశారు. దీంతో కొంత వరకూ లీకేజీలు ఆగిపోయాయి. చేసినంత మేరకు పనులు ఫలితానిచ్చాయి. లీకేజీలు ప్రమాద స్థితికి చేరకుండా అడ్డుకున్నాయి. అయితే, అప్పట్లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పూర్తి కాలేదు.  ప్రస్తుతం మట్టికట్ట మీద ఆ యంత్రాలు తుప్పు పట్టి దెబ్బతింటున్నాయి. కొన్ని చోట్ల చెట్లు మొలచి చిట్టడివిగా మారాయి.


మార్చి నాటికి పూర్తిచేస్తాం 

డ్రిల్లింగ్‌, గ్రౌటింగ్‌ పనులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తాం. గతంలోనే ఈ పనులను కొంత వరకూ పూర్తిచేశాం.  ఇటీవల మళ్లీ పనులు ప్రారంభించాం. అయితే వర్షాలు రావడంతో పనులను నిలిపివేశాం.  సుమారు రూ.3 కోట్ల పనులు చేయాల్సివుంది. 

-  విజయ్‌కుమార్‌రెడ్డి, ఈఈ, కండలేరు డ్యాం

Updated Date - 2020-12-04T05:02:52+05:30 IST