జోగినీ ఇంట్లో 90 తులాల బంగారు వడ్డాణం చోరీ ఘటన ఛేదన.. దొంగ ఎవరంటే..!

ABN , First Publish Date - 2021-12-04T14:25:18+05:30 IST

జోగినీ ఇంట్లో 90 తులాల బంగారు వడ్డాణం చోరీ ఘటన ఛేదన.. దొంగ ఎవరంటే..!

జోగినీ ఇంట్లో 90 తులాల బంగారు వడ్డాణం చోరీ ఘటన ఛేదన.. దొంగ ఎవరంటే..!

  • అల్లుడే దొంగ
  • వడ్డాణం చోరీ ఘటన ఛేదన  
  • రూ. 65లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ : అల్లుడే తిన్నింటి వాసాలు లెక్కించాడు. రూ.65 లక్షల విలువైన సొత్తును దొంగిలించాడు. కాశీ యాత్రకెళ్లొచ్చిన అత్త ఇల్లు గుల్లచేశాడు. జోగిని వడ్డాణం కేసులో ఇంటి అల్లుడే దొంగ అన్న విషయం తేలింది. 48 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులను కమిషనర్‌ అంజనీకుమార్‌ అభినందించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో నివసిస్తున్న ఎస్‌.రంగమ్మ (60) అలియాస్‌ జోగిని రంగమ్మ గతనెల 23న కాశీ యాత్రకు వెళ్లి 29న తిరిగొచ్చింది. ఇంట్లో బంగారం, నగదు కనిపించకపోవడంతో చోరీ అయినట్లు గుర్తించి ఈ నెల 1న ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్వీకుల నుంచి తనకు వంశపారంపర్యంగా వస్తోన్న కేజీకి పైగా బంగారం, రూ.12లక్షలు చోరీకి గురయ్యాయని తెలిపింది. అయితే, తాను దత్తత తీసుకున్న కూతురి భర్త లక్ష్మణ్‌పై అనుమానం ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ కోణంలో కేసును దర్యాప్తు చేశారు.


డ్రిల్లింగ్‌తో బెడ్‌రూం తాళాలు బ్రేక్‌..

బాధితురాలి దత్తపుత్రిక భర్త మందాల లక్ష్మణ్‌ (29) అత్తగారింట్లోనే నివసిస్తున్నాడు. పెయింటర్‌గా పనిచేసే లక్ష్మణ్‌ దురలవాట్లకు బానిసయ్యాడు. మద్యం, పొగతాగడం లాంటి అలవాట్లకు సరిపడా సంపాదన లేకపోవడంతో అత్తగారింట్లోనే చోరీలు చేయసాగాడు. గతంలోనూ జోగిని రంగమ్మ లేని సమయంలో చిన్న చిన్న చోరీలకు పాల్పడేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అప్పులు తీర్చడానికి, ఇతర సంపాదన నిమిత్తం ఒకేసారి భారీగా చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తుండగా గతనెల 23న అత్త కాశీ యాత్రకు బయలుదేరి వెళ్లింది. దీన్ని అవకాశంగా మలుచుకుని లక్ష్మణ్‌ ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను స్విచాఫ్‌ చేశాడు. రంగమ్మ బెడ్‌రూం తాళాలను డ్రిల్లింగ్‌ యంత్రంతో విరగొట్టి లోనికి ప్రవేశించి అందులోని రూ.12లక్షలు, 105 తులాల బంగారు ఆభరణాలు తస్కరించాడు.


సొత్తు రికవరీ..

దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీ జరిగిన ఇంట్లో కీలక ఆధారాలు సేకరించారు. అలాగే సాంకేతికతతో కూడిన ఆధారాలు, వేలిముద్రలు, ఫోన్‌ లొకేషన్స్‌తో నిందితుడిని గుర్తించారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం నిందితుడైన మందాల లక్ష్మణ్‌ను ఆర్ట్స్‌ కాలేజ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 105 తులాల బంగారు ఆభరణాలు, 12 లక్షల నగదు మొత్తం రూ. 65లక్షలు విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2021-12-04T14:25:18+05:30 IST