ఇక సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టు

ABN , First Publish Date - 2021-06-19T05:17:03+05:30 IST

సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించేందుకు జిల్లాలో సైబర్‌ సెల్‌ ఏర్పాటైంది. శుక్రవారం శ్రీకాకుళంలో ఈ సైబర్‌ సెల్‌ను ఎస్పీ అమిత్‌బర్దర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలను పోస్టు చేసిన 74 మందిని గుర్తించామని, వీరిలో 60 మందిపై సైబర్‌ బుల్లీ షీట్స్‌ తెరిచామని చెప్పారు.

ఇక సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టు
సైబర్‌సెల్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌

 జిల్లాలో సైబర్‌ సెల్‌ ప్రారంభం

సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులపై మరింత నిఘా

 ఎస్పీ అమిత్‌బర్దర్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్‌ 18: సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించేందుకు జిల్లాలో సైబర్‌ సెల్‌ ఏర్పాటైంది. శుక్రవారం శ్రీకాకుళంలో ఈ సైబర్‌ సెల్‌ను ఎస్పీ అమిత్‌బర్దర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలను పోస్టు చేసిన 74 మందిని గుర్తించామని,  వీరిలో 60 మందిపై సైబర్‌ బుల్లీ షీట్స్‌ తెరిచామని చెప్పారు. ‘ఇకపై తప్పుడు సందేశాలను పోస్టు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గత ఐదేళ్లలో జిల్లాలో నమోదైన సైబర్‌ క్రైం కేసులను ఇకపై సైబర్‌ సెల్‌ వేగవంతంగా దర్యాప్తు చేస్తుంది. సైబర్‌ నేరగాళ్లను ట్రాక్‌ చేసేందుకు అవసరమైన సోషల్‌ మీడియా అనాలసిస్‌ టూల్స్‌, ఫోరెన్సిక్‌ టూల్స్‌, మరికొన్ని అధునాతన పరికరాలతో సహా మొబైల్‌ ఫోరెన్సిక్‌ సాధనాలు సైబర్‌ సెల్‌ విభాగంలో ఉన్నాయి. ఈ-మెయిల్‌ దుర్వినియోగం, సైబర్‌ స్టాకింగ్‌, హ్యాకింగ్‌, ఫిషింగ్‌, విషింగ్‌, ఆన్‌లైన్‌ ఉద్యోగ మోసాలు, లాటరీ, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, ఓటీపీ మోసాలు, చోరీకి గురైన మొబైల్‌ ఫోన్ల కేసుల్లో ఆధారాలు సేకరించేందుకు ఈ కిట్లు సహాయ పడతాయి. ఈ  విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌, హెడ్‌కానిస్టేబుల్‌, ఆరుగురు కానిస్టేబుళ్లు సాంకేతిక బృందంగా ఏర్పడి  దర్యాప్తు చేస్తారు. దీని ద్వారా దర్యాప్తు విధానంతో పాటు ఆస్తుల రికవరీ వేగవంతం అవుతుంది’ అని ఎస్పీ వెల్లడించారు. 


చోరీకి గురైన ఫోన్లు స్వాధీనం 

సైబర్‌ పోలీసులు టెక్నాలజీని వినియోగించుకుని చోరీకి గురైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 378 మొబైళ్లు చోరీకి గురయ్యాయి. వీటిపై సైబర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 267 ఫోన్లను స్వాధీనం చేసుకుని ఎస్పీ అమిత్‌బర్దర్‌ ముందుంచారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందించారు. ఈ ఫోన్లను ఫిర్యాదుదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-06-19T05:17:03+05:30 IST