‘కళాశాల స్వప్నం’ పథకం ప్రారంభం

Published: Sun, 26 Jun 2022 13:11:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కళాశాల స్వప్నం పథకం ప్రారంభం

నాలుగేళ్లలో 20 లక్షల మంది విద్యార్థుల్లో ప్రతిభాపాటవాల పెంపు :  సీఎం స్టాలిన్‌

చెన్నై, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘నాన్‌ ముదల్వన్‌’ పథకంలో భాగంగా వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. శనివారం ఉదయం నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నాన్‌ ముదల్వన్‌ పథకం ద్వారా ప్రతిభాపాటవాలపై శిక్షణ పొంది ప్లస్‌-2 పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉన్నత విద్యాకోర్సులను ఎంపిక చేసేందుకు గాను ‘కళాశాల స్వప్నం’ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్లస్‌-2 పాసైన విద్యార్థులు వారి ప్రతిభాపాటవాలకనుగుణంగా ఉన్నత విద్యా కోర్సులను ఎంపిక చేసుకోవడం సులభతరం చేసేందుకే ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. దీని ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్లస్‌-2 విద్యార్థులకు ఉన్నతవిద్యా కోర్సులను ఎంపిక చేసుకోవడానికి విద్యావేత్తలు, నిపుణులు సూచనలిచ్చి మార్గదర్శక పుస్తకాలను, కరపత్రాలను కూడా పంపిణీ చేస్తారని తెలిపారు. గత నాలుగైదు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడిన తాను వేలాదిమంది విద్యార్థులతో ఏర్పాటైన ఈ కార్యక్రమంతో పాల్గొని ఉత్తేజం పొందుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రిగానే కాకుండా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించాలన్న ఉద్దేశంతో వారిని తన సొంత బిడ్డలుగా భావించి కార్యక్రమానికి హాజరయ్యానని సభికుల హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు మార్గదర్శకత్వం చేస్తుందని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారని, అయితే విద్యార్థులకు ఏమీ తెలియవని అపోహపడకూడదని, వారి చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్ల ద్వారా విద్యాపరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ముందడుగు వేస్తున్నారని వెల్లడించారు. కళాశాల స్వప్నం పథకం ద్వారా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నత ఉద్యోగాల వివరాలు, వాటి కోసం ఏయే కోర్సులు చదవాలని, ఎలాంటి పోటీ పరీక్షలు రాయాలన్న వివరాలను విద్యార్థులు తెలుసుకోగలుగుతారని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందటానికి ఈ పథకం దోహదపడుతుందని స్టాలిన్‌ చెప్పారు. ఈ నెల 29, 30, జూలై 1, 2 తేదీల్లో చెన్నై మినహా అన్ని జిల్లాల్లోనూ కళాశాల స్వప్నం కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆయన ప్రకటించారు. ఈ పథకం ద్వారా విద్యార్థులు ప్రజ్ఞావంతులుగా, బహుముఖ ప్రజ్ఞాశాలులుగా, ఔత్సాహితక పారిశ్రామికవేత్తలుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా వుండగా ఈ కార్యక్రమంలో ప్లస్‌-2 విద్యార్థులకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేలా హెస్‌సీఎల్‌ టెక్నాలజీస్ తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రు లు అన్బిల్‌ మహేష్‌, పొన్ముడి, సీవీ గణేశన్‌, పీకే శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, డీజీపీ శైలేంద్రబాబు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఉపాధ్యక్షుడు సుబ్బరామన్‌ బాలసుబ్రమణియన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.