లా అండ్‌ ఆర్డర్‌ రాంగ్‌రూట్‌

ABN , First Publish Date - 2022-01-23T06:03:16+05:30 IST

ప్రజల నుంచి వస్తున్న పలు ఫిర్యాదులను పోలీసులు సివిల్‌ పంచాయితీలకు వేదికగా మార్చుకొంటున్నారు.

లా అండ్‌ ఆర్డర్‌ రాంగ్‌రూట్‌

ఖాకీపై ఖద్దరు స్వారీ

సివిల్‌ వివాదాల్లో సిబ్బంది

కొలిక్కిరాని హత్య కేసులు

పెరుగుతున్న రాజకీయ నాయకుల ఒత్తిళ్లు

స్పెషల్‌ బ్రాంచ్‌లో బదిలీల ఫీవర్‌

డిసెంబరు 31న నాగులుప్పల పాడు ఎస్సై చదలవాడ గ్రామంలో రోడ్డుపై ఉన్న వారిపై చేయి చేసుకున్నాడు. గతంలో జరిగిన ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దాడి చేశాడని బాధితులు ఆరోపించారు. దీంతో ఏకంగా ఎస్‌ఐపై అతను పనిచేస్తున్న పోలీసు స్టేషన్‌లోనే కేసు నమోదైంది. ఇది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. 

సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత శనివారం ఒంగోలు గద్దలగుంటలో పూటుగా మద్యం సేవించిన యువకుడు ఏకంగా ఎస్సైపై తిరగబడ్డాడు. ఆ యువకుడు ఒక పార్టీ తరఫున స్థానికంగా క్రియాశీలకంగా ఉంటాడు. 

ఇటీవల ఒంగోలులో పేర్నమిట్ట సమీపంలో ఉన్న స్థల వివాదంలో నేరుగా పీటీసీలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ జోక్యం చేసుకున్నారు. అదేక్రమంలో ముక్తినూతలపాడు వద్ద పాస్టర్‌ కొనుగోలు చేసిన స్థలంలో ఒంగోలు డీఎస్పీ జోక్యం చేసుకున్నారని, బాధితులను బెదిరించారని సోషల్‌ మీడియాకు ఎక్కారు. 

రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదమైన సుబ్బారావు గుప్తా నేరుగా పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. తనపై దాడిచేసిన వారికి పోలీసులు ప్రత్యక్షంగా సహకరించారని చెబుతున్నారు. అలాగే దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్నారని బాహాటంగానే విమర్శించటం పోలీసుల పనితీరుకు దర్పణం పడుతోంది. 

ఇలా.. జిల్లాలో ఖాకీలు కట్టుతప్పుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణను పక్కనపెట్టి కాసుల వేటలో మునిగితేలుతున్నారు. కొందరు సివిల్‌ వివాదాల్లో తలదూరుస్తున్నారు. ప్రైవేటు పంచాయితీలు చేస్తూ  పైసలు పోగేసుకుంటున్నారు. మరోవైపు పోలీసులపై రాజకీయ నేతల పెత్తనం పెరిగింది. అనేక కేసుల విషయంలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుంటున్నారని పోలీసులే చెప్తున్నారు. తాము చెప్పింది చేయకపోతే బదిలీ తప్పదంటూ బెదిరింపులకు దిగుతున్నారని వ్యాఖ్యానించడం దిగజారిన పరిస్థితికి అద్దంపడుతోంది. దీన్ని అవకాశంగా చేసుకొని కొందరు సిబ్బంది వసూళ్ల పర్వం సాగిస్తున్నారు. దీంతో కీలక కేసుల విచారణ సైతం నత్తనడకన సాగుతోంది. 

ఒంగోలు (క్రైం), జనవరి 22 : ప్రజల నుంచి వస్తున్న పలు ఫిర్యాదులను పోలీసులు సివిల్‌ పంచాయితీలకు వేదికగా మార్చుకొంటున్నారు.  కొంతమంది ప్రత్యక్షంగా, మరికొంతమంది పరోక్షంగా రాజీవ్యవహారాలు చేయడం పరిపాటైంది. హత్యా నేరాలకు సంబంధించిన విచారణలు సైతం అడుగున పడేసి సివిల్‌ కేసుల పరిష్కారం కోసం పోలీసు అధికారులు అర్రులుచాస్తున్నారు. ఈనేపథ్యంలో కొంతమంది అధికారులపై సోషల్‌ మీడియాలో సైతం ఆరోపణలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అదే క్రమంలో రాజకీయ నాయకుల సిఫార్సులు పెరగడంతో కనీసం బహిరంగంగా మద్యం సేవించే వారిని సైతం వదిలేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఎన్‌జీపాడు ఎస్‌ఐపై కేసు మొదలు సివిల్‌ పంచాయితీల్లో ఒక సీఐ, డీఎస్పీ ఉండటం, అందుకు సంబంధించిన విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం తెలిసిందే.


సంచలన హత్య కేసుల్లో అడుగు ముందుకు పడని విచారణ

పాత కేసులు ఎలా ఉన్నా ఇటీవల జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించిన హత్యానేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు అడుగు ముందుకు పడకపోవడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. సుమారు రెండు నెలలు క్రితం జరిగిన పూసపాడు, టంగుటూరు హత్య కేసుల్లో చిన్నపాటి ఆధారాలను కూడా పోలీసులు సేకరించలేకపోయారు. అందుకు ముఖ్యమైన కారణం అయా పోలీసు స్టేషన్‌లలో  పనిచేస్తున్న సిబ్బంది ఎవ్వరూ పనిచేస్తున్న చోట నివాసం ఉండక పోవడమే. టంగుటూరులో పనిచేస్తున్న ఎస్సై నుంచి హోంగార్డు వరకు ఎవ్వరూ స్థానికంగా ఉండరు. దీంతో వారికి ప్రజలతో అసలు సంబంధాలు లేవు. కేవలం పోలీసు స్టేషన్‌కు వచ్చిన వారితో మాత్రమే పోలీసులు మాట్లాడి పంపించడం అలవాటుగా మార్చుకున్నారు. అంతేకాకుండా హత్యానేరాల పట్ల పోలీసులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో అనేక నేరాలు బయటకు రాకుండానే సమాధి అవుతున్నాయి. అందుకు  చీమకుర్తి జంట హత్యల కేసు నిదర్శనంగా నిలుస్తోంది. అది జరిగిన మూడేళ్లవుతోంది. పేర్నమిట్ట వద్ద జీవన్‌ హత్య జరిగి రెండేళ్లయ్యింది. ఇంత వరకూ వాటిలో ఎలాంటి పురోగతి లేదు. ఇలా హత్యానేరాలు మూలన పడిపోతున్నాయి.


ఏళ్లతరబడి స్పెషల్‌ బ్రాంచిలోనే..

పోలీసు శాఖకు కళ్లు, చెవులు లాంటి స్పెషల్‌ బ్రాంచ్‌లో బదిలీల ఫీవర్‌ పట్టుకుంది. ఇప్పటికే ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారు అక్కడే తిష్ట వేస్తున్నారు. ఎక్కువ మంది ఒంగోలు కేంద్రంగా నివాసం ఉంటూ ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసు శాఖకు అవసరమైన ముందస్తు సమచారం రావడం లేదు. కేవలం ఘటనలు జరిగినప్పుడు మాత్రమే సమాచారం సేకరించి అధికార్లకు పంపించడంతో పాటు పాస్‌పోర్టు విచారణలకు పరిమితమవుతు న్నారు. నలుగురైదుగురు అసలు ఉద్యోగం లేకుండా హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు. నెల రోజులుగా బదిలీలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరు ఎక్కడికి బదిలీ అవుతారో అనే మీమాంసతో కొందరు అసలు చేయాల్సిన పనులను వదిలి ప్రజాప్రతినిధుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరు ఎన్నో ఏళ్లుగా స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేస్తున్నారు. వారి పనితీరు ఏమిటి అనే సమాచారాన్ని ఉన్నతాధికా రులు సేకరించారు. అయితే రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఎస్బీ ప్రక్షాళనలో జాప్యం జరుగుతుందన్న చర్చలు జరుగుతున్నాయి. ఏదిఏమైనా స్పెషల్‌ బ్రాంచ్‌ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకుంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమాచారం చేరవేయడంలో విఫలమవుతున్నారు. కనీసం ఉద్యోగం చేసే చోట నివాసం ఉండాలనే నిబంధన అమలు చేస్తే కొంత మేరకు మెరుగుపడుతుంది.


సివిల్‌ వివాదాల్లో పోలీసులు

సివిల్‌ వివాదాలలో పోలీసులు తలదూరుస్తున్నాయి. పంచాయితీలు చేస్తున్నారు. స్పందన ద్యారా వచ్చిన ఫిర్యాదులను విచారణ చేస్తున్నామంటూనే  పోలీసులు ఆదాయమర్గాలను అన్వేషిస్తున్నారు. కొన్నిచోట్ల రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కాగా, కొన్నిచోట్ల భారీఎత్తున వసూళ్లు ఉన్నాయి. అందుకు నాగులుప్పలపాడు మండలంలో పొలం విషయంలో మండల స్థాయి నాయకుడికి కొమ్ము కాసిన పోలీసులు బాధిత మహిళను బెదిరించినట్లు ఆమె ఉన్నతాధికార్లకు ఫిర్యాదు చేయడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పేర్నమిట్ట పొలం విషయంలో పీటీసీలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ నేరుగా వివాదంలో తలదూర్చడమే కాకుండా, అక్కడ పనిచేస్తున్న కొంతమంది కూలీలను బెదిరించారు. అదేక్రమంలో ముక్తినూతలపాడు వద్ద కొనుగోలు చేసిన స్థలం వివాదం కావడంతో దీనిపై పాస్టరుతోపాటు మరికొందరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై తాలుకా సీఐ, ఒంగోలు డీఎస్పీలు న్యాయం చేయకపోగా బెదిరిస్తున్నారంటూ ఆ పాస్టర్‌ యూట్యూబ్‌లో వీడియో పోస్టు చేశారు.  అది ఇప్పుడు వైరల్‌గా మారి పోలీసు శాఖ పరువును బజారున వేసింది. ఇలా రకరకాల వ్యవహారాలతో కొందరు ప్రతిష్టాత్మకమైన వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నారు.


Updated Date - 2022-01-23T06:03:16+05:30 IST