మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టం

ABN , First Publish Date - 2021-10-20T08:11:48+05:30 IST

విజ్ఞానశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. అయినా మనదేశంలో గ్రామాలలో చేతబడులు, క్షుద్రపూజలు, పరలోకం పేరుతో ఆత్మహత్యలు, ఇంకా లంకెబిందెల పేరుతో నరబలులు...

మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టం

విజ్ఞానశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. అయినా మనదేశంలో గ్రామాలలో చేతబడులు, క్షుద్రపూజలు, పరలోకం పేరుతో ఆత్మహత్యలు, ఇంకా లంకెబిందెల పేరుతో నరబలులు జరుగుతున్నాయి. పట్టణాలలో యాగాలూ, యోగాలూ, కాలసర్పదోషాలు.. నగ్నపూజల పేరుతో బాబాలు, స్వామీజీలు ప్రజల ధన మాన ప్రాణాలను దోచుకుంటున్నా, ఆశ్రమాల పేరుతో దొంగస్వాములు ప్రభుత్వభూములు అక్రమించి మోసం చేస్తున్నా వారిని అరికట్టడం తమ బాధ్యత కాదు అన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అశాస్త్రీయమైన, రంగురాళ్లు మీ జీవితాలను మారుస్తాయంటూ, పేరు మార్చుకుంటే, రుద్రాక్షలు ధరిస్తే మీ జీవితాలు బాగుపడతాయంటూ వస్తున్న ప్రకటనలు ప్రజలను ఆలోచించనీయకుండా చేస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలతో మోసం చేసే వారిని ‘ది డ్రగ్స్ అండ్ మాజిక్ రెమిడి ఆక్ట్ 1954’ కింద అరెస్టు చెయ్యాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇకనైనా ప్రభుత్వాలు ప్రాథమిక విద్య నుంచి విద్యార్థులకు శాస్త్రీయ విద్యను అందించాలి. మతపరమైన పుక్కిటిపురాణాలను విద్యార్థులకు భోదించకుండా ఆ అంశాలను తొలగించాలి. ప్రతి జిల్లాలోను సైన్సు సెంటర్లు ఏర్పాటుచేసి అభివృద్ధిపరచాలి. రాజ్యాంగంలోని లౌకికవాదాన్ని గౌరవించే విధంగా నేతలు, అధికారులు వ్యవహరించాలి. 


ఉభయ తెలుగు రాష్ట్రాలు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేసి, పైన పేర్కొన్న వాటిని ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది.

నార్నె వెంకటసుబ్బయ్య

Updated Date - 2021-10-20T08:11:48+05:30 IST