ప్రీమియర్‌ కాలేజీలో ‘లా’ సీటు పొందాలంటే..!

ABN , First Publish Date - 2022-05-16T19:18:58+05:30 IST

వేయి మైళ్ళ ప్రయాణమైనా మొదటి అడుగుతోనే మొదలవుతుంది. ఎంత పెద్ద పరీక్షకు ప్రిపరేషన్‌ అయినా ప్రాక్టీస్‌తోనే ఆరంభమవుతుంది. మన దేశంలో మెరుగైన లా కాలేజీలో సీటు పొందాలంటే ప్రిపరేషన్‌ పకడ్బందీగా ఉండాలని అకడమీషియన్లు చెబుతున్నారు....

ప్రీమియర్‌ కాలేజీలో ‘లా’ సీటు పొందాలంటే..!

పకడ్బందీ ప్రిపరేషన్‌కు టిప్స్‌


వేయి మైళ్ళ ప్రయాణమైనా మొదటి అడుగుతోనే మొదలవుతుంది. ఎంత పెద్ద పరీక్షకు ప్రిపరేషన్‌(Preparation‌) అయినా ప్రాక్టీస్‌తోనే ఆరంభమవుతుంది. మన దేశంలో మెరుగైన లా కాలేజీలో సీటు పొందాలంటే ప్రిపరేషన్‌ పకడ్బందీగా ఉండాలని అకడమీషియన్లు చెబుతున్నారు. హైదరాబాద్‌(hyderabad)లోని నల్సార్‌ సహా ప్రతిష్ఠాత్మక లా కాలేజీలు దాదాపుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలా ప్రిపేరైతే మంచి స్కోర్‌ సాధించవచ్చో చూద్దాం.


ఈ రోజుల్లో ఎక్కడైనా వినిపించే మొదటి మాట స్మార్ట్‌. అది ప్రిపరేషన్‌కూ వర్తిస్తుంది. ఎన్ని గంటలు  కష్టపడ్డాం అన్నది మేటరే కాదు. అవకాశం, అందుబాటులో ఉన్న  సమయంలో ఏ మేరకు నేర్చుకున్నాం, ఎంతవరకు గుర్తుపెట్టుకోగలం అన్నవే పాయింట్‌. ప్రతిష్ఠాత్మక లా కాలేజీలో చదివితే ఉపాధిపరంగా మంచి అవకాశం, ఎదుగుదల అంతకుమించి స్థిరత్వానికి వెసులుబాటు ఉంటుంది. ఇంటర్‌లో ఏ గ్రూప్‌ తీసుకున్న విద్యార్థులు అయినా ఈ పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. అలాగే ఇంటర్‌లో చదువుకున్న అంశాలతో ప్రత్యక్ష సంబంధం అంటూ ఏమీ ఉండదు. మేథ్స్‌ స్టూడెంట్స్‌కు కొన్ని టాపిక్స్‌ వెసులుబాటు కల్పిస్తాయి. అలాగే సివిక్స్‌, హిస్టరీ చదివిన విద్యార్థులకు కరెంట్‌ అఫైర్స్‌ సెక్షన్‌ తాము తెలుసుకున్న వాటికి కొద్దిగా దగ్గరగా అనిపించి, ఆసక్తిని కలుగుజేస్తాయి. ఎవరికి వారికే ప్రయోజనం, నష్టం కలిగించే కొద్దిపాటి ప్రవేశ పరీక్షల్లో లా ఎంట్రెన్స్‌ ఒకటి. 


ఇలా మొదలు పెట్టవచ్చు!

బియ్యం నుంచి రాళ్ళు, రప్పలు ఏరేయడం మాదిరిగా మొదట ఏయే విషయాలపై శ్రద్ధ వహించాలన్నది లా ఎంట్రెన్స్‌లకు ప్రిపేరయ్యే విద్యార్థులు తెలుసుకోవాలి. వాస్తవానికి ఇదే మొదటి అడుగు. టెస్ట్‌కు సంబంధం లేని టాపిక్స్‌ను మొగ్గలోనే పక్కన పెట్టేయాలి. ఆ విషయంలో క్లారిటీ చాలా ముఖ్యం. ఇంటర్‌ ఎగ్జామ్స్‌ తరవాత ఉన్న కొద్ది రోజుల్లోనే ప్రిపరేషన్‌ పూర్తి కావాలి. అంటే ఎక్కడా సమయం వృథా కారాదు. 


క్లాట్‌, ఏఐఎల్‌ఈటీ, ఎస్‌ఎల్‌ఎటి, ఎల్‌ఎస్‌ఏటీల్లో ప్రధానంగా ఒక వ్యక్తి మంచి లాయర్‌ కాగలరా అన్నది చూడటమే సదరు టెస్టుల పరమోద్దేశం. అందుకు అవసరమైనది ఇంగ్లీష్‌ భాషపై పట్టు. క్రిటికల్‌, అనలిటికల్‌గా ఆలోచించే సామర్థ్యం ఉండాలి. మనచుట్టూ జరిగే పరిణామాలపై అవగాహన, న్యాయపరమైన అంశాలకు తోడు క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ పరిజ్ఞానం ఉండాలి. వీటన్నింటిలో ప్రాథమిక స్థాయి పరిజ్ఞానం సరిపోతుంది. స్వీయ బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్‌ వ్యవహారాన్ని సమర్థంగా అమలుచేసుకోవాలి. ఉన్న సమయంలోనే  ముఖ్యమైన టాపిక్స్‌పై దృష్టి సారించాలి. 


టెస్ట్‌లో టాపిక్స్‌

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ తీసుకుంటే రీడింగ్‌, కాంప్రహెన్షన్‌, ఒకాబులలరీ, గ్రామర్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. ఇచ్చిన పాసేజ్‌పై సమగ్ర అవగాహన కలుగజేసుకునే సామర్థ్యం ఉండాలి. వాక్యంలో తప్పులు లేకుండా సరిదిద్దుకోగలగాలి. స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ లేకుండా చూసుకోగలగాలి. ప్రోవెర్బ్స్‌, సినానిమ్స్‌, ఆంటినమ్స్‌, ఇడియమ్స్‌, ఫ్రేజులపై ఫెయిర్‌ ఐడియా ఉండాలి. ఆంగ్లంలో ఉండే మంచి పుస్తకాలు, నవలలు అలాగే మెయిన్‌స్ట్రీమ్‌ ఇంగ్లీష్‌ దినపత్రికల ఎడిటోరియల్స్‌ను నిత్యం చదవడమే కాదు, కొత్త పదాలను నోట్‌ చేసుకుని వాటి అర్థం తెలుసుకోవడం తద్వారా ఒకాబులరీపై పట్టు సాధించడం ఇక్కడ చాలా ముఖ్యం. 


మున్ముందు లాయర్లుగా కొనసాగాలంటే లాజికల్‌ రీజనింగ్‌ చాలా అవసరం. ఆర్గ్యుమెంట్స్‌, కంక్లూజన్స్‌ వంటి టాపిక్స్‌ ఇందుకు ఎంతగానో దోహదపడతాయి. లాయర్ల ప్రధాన వ్యాపకం వాదనలే అన్నది ఇక్కడ గ్రహించాలి. అటు ఎగ్జామినర్లకూ ఇష్టమైన టాపిక్‌ అనాలజీ అండ్‌ రిలేషన్‌ షిప్స్‌. ప్రిపరేషన్‌లో భాగంగా దీనిపై దృష్టి సారించాలి. లాజికల్‌ సీక్వెన్సింగ్‌ మరో టాపిక్‌. దీన్ని విద్యార్థులు సీరియ్‌సగా తీసుకోవాలి. ఈ టాపిక్‌ కోసం విద్యార్థులకు క్రిటికల్‌ థింకింగ్‌ సంబంధ సామర్థ్యం అవసరం. 


జనరల్‌ నాలెడ్జ్‌తో కలగలిసిన కరెంట్‌ అఫైర్స్‌ చాలా పెద్ద టాపిక్‌. సూర్యుడు తిరిగిన మేర చోటుచేసుకునే ప్రతి విషయం ఇందులోనే వస్తుంది. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను రోజూ ఫాలో అయ్యే వ్యక్తులకు ఇది సులువైన టాపికే అవుతుంది. ప్రభుత్వాలు అమలు చేసే వివిధ పథకాలు, దేశ ప్రధాని పర్యటించే ప్రాంతాలు, వివిధ పురస్కారాలను అందుకునే వ్యక్తులు, లేదంటే వాటిని వదులుకున్న వ్యక్తులు, ఆర్ట్‌, కల్చర్‌, చారిత్రిక ఘట్టాలు, వాటికి కొనసాగింపుగా జరిగే విషయాలు, వివిధ హోదాలకు ఎంపికైన వ్యక్తులు సహా సమస్తం దీని పరిధిలోనే ఉంటుంది. ఆసక్తి అంతకుమించి రోజువారీ వ్యవహారం ఫాలో అయ్యే వారికి ఇదేమంత కష్టం అనిపించదు. 


పట్టు సాధించే క్రమం

లాజికల్‌ రీజనింగ్‌ చాలా మందికి కొత్త టాపిక్‌. దీన్ని ప్రత్యేకించి పాఠశాలల్లో బోధించరు. అలాగే చట్టాలను సైతం లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు. లా ఆఫ్‌ టార్ట్స్‌, కాన్‌స్టిట్యూషన్‌, క్రిమినల్‌ లా, కాంట్రాక్ట్స్‌ వంటి కొన్నింటిని తెలుసుకుంటే సరిపోతుంది. కొద్దిపాటి అవగాహనతో ఆ విభాగంలో అడిగిన ప్రశ్నలు సమాధానాలు గుర్తించవచ్చు. సెక్షన్స్‌, ఆర్టికల్స్‌పై ప్రశ్నలు అడగరు. వాటికంటే ఇచ్చిన సిట్యుయేషన్‌ను అనుసరించి, తార్కికంగా ఆలోచించి గుర్తించే సమాధానానికే అక్కడ ప్రాధాన్యం ఉంటుంది. లీగల్‌ పదాలను కొద్దిగా తెలుసుకుంటే ఇంకా బాగా చెప్పాలంటే అక్కడ పడవ ప్రయాణం హాయిగానే సాగుతుంది. 


క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌కు సంబంధించి పదో తరగతి లెక్కల పుస్తకాన్ని ఒకసారి ఆసాంతం గట్టిగా తిరగేయాలి. డేటా ఇంట్రప్రెటేషన్‌పై దృష్టిపెట్టాలి. రేషియో అండ్‌ ప్రపోర్షన్స్‌, బేసిక్‌ ఆల్జీబ్రా, మెన్సురేషన్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌ వంటి టాపిక్స్‌ను క్షుణ్ణంగా నేర్చుకుంటే సరిపోతుంది. లా ఎంట్రెన్స్‌ టెస్టులో ఈ టాపిక్‌కు పెద్ద ప్రాధాన్యం ఏమీ లేదు. అన్నింటికీ మించి పరీక్షను బాగా అర్థం చేసుకునేందుకు ప్రీవియస్‌ ఇయర్స్‌ పేపర్లు బాగా ఉపయోగపడతాయి. తరుచూ అడుగుతున్న ప్రశ్నలను కరెక్ట్‌గా పట్టుకోగలిగితే అభ్యర్థి పని సులువు అవుతుంది. అవసరమైన టాపిక్స్‌కే సమయాన్ని వినియోగించుకోవాలి. అంతే తప్ప పరీక్షతో సంబంధం లేని టాపిక్స్‌ను ముట్టుకోరాదు. అలాగే ప్రాక్టీస్‌, కన్సిస్టెన్సీతో మంచి స్కోర్‌ సాధించడం, ప్రముఖ లా కాలేజీలో సీటు పొందడం ఏమంత కష్టం కాదని కూడా గ్రహించాలి.



Updated Date - 2022-05-16T19:18:58+05:30 IST