నాలుగు నిమిషాల్లోనే..! చర్చ లేకుండానే సాగు చట్టాలు వెనక్కి

ABN , First Publish Date - 2021-11-30T07:59:27+05:30 IST

క్‌సభ సమావేశమైంది. సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి! వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తున్నాయి...

నాలుగు నిమిషాల్లోనే..!  చర్చ లేకుండానే  సాగు చట్టాలు వెనక్కి

గందరగోళం మధ్య మూజువాణీ ఓటుతో ఆమోదం

లోక్‌సభలో చర్చకు స్పీకర్‌ నిరాకరణ

రాజ్యసభలో మాత్రం స్వల్ప చర్చకు చాన్స్‌

ప్రభుత్వం భయపడింది.. అందుకే చర్చకు నో

చట్టాల రూపకల్పన వెనక ఉన్న వారు 

బయటకు రావాలనే చర్చకు డిమాండ్‌: రాహుల్‌


న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ సమావేశమైంది. సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి! వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తున్నాయి! అప్పటికే సభ ఒకసారి వాయిదా పడింది! తిరిగి ప్రారంభమైనా అదే పరిస్థితి! ఈ గందరగోళం మధ్యే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎటువంటి చర్చ లేకుండా, కేవలం నాలుగంటే నాలుగు నిమిషాల్లోనే దానిని ఆమోదించుకుంది. చివరికి, రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి!ఆ తర్వాత కూడా ఎటువంటి చర్చా లేకుండానే ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలి రోజే ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయం కూడా స్తంభించింది. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, సాగు చట్టాలు, లఖీంపూర్‌ ఖీరీ ఘటనపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ఉభయ సభల్లో డిమాండ్‌ చేశాయి. వెల్‌లోకి దూసుకొచ్చి, బ్యానర్లు, ప్ల కార్డులతో నిరసన తెలిపాయి. అయినా, వాటినిపట్టించుకోకుండా, ఎటువంటి చర్చా లేకుండా ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కు తీసుకుంది. సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటూ మధ్యాహ్నం 12-06 గంటలకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రవేశపెట్టిన బిల్లు.. 12-10 గంటలకు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఆ తర్వాత రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. కాకపోతే, కొద్దిసేపు ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడడానికి డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ అవకాశం ఇచ్చారు. చట్టాలను వెనక్కు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే, లఖీంపూర్‌ ఖీరీ ఘటన, విద్యుత్తు బిల్లుతోపాటు అనేక అంశాలపై మాట్లాడాలనుకుంటున్నామని ఖర్గే చెప్పారు. ఇక, సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్షం, ప్రభుత్వం కోరుకుంటున్నందున దీనిపై చర్చ లేకుండానే ఆమోదించాలని వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌ కోరారు. ఇక, లోక్‌సభ సమావేశమైన కొద్దిసేపటికే ప్రధాని మోదీ సభలోకి వచ్చారు. ఆ సందర్భంగా బీజేపీ ఎంపీలు ‘భారత్‌ మాతాకి జై’ అని; ప్రతిపక్ష ఎంపీలు ‘జై కిసాన్‌’ అంటూ నినాదాలు చేశారు.


ఓ గుణపాఠం: ఐరాస 

 భారత్‌లో వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి హక్కుల నిపుణులు స్వాగతించారు. ఈ చట్టాలు భారతదేశంలోని మ్తొతం ఆహార వ్యవస్థకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇకపై దేశంలోని రైతులు, రైతు సంఘాలతో అర్థవంతమైన చర్చల ద్వారా, మానవహక్కులకు కట్టుబడి వ్యవసాయ రంగ సంస్కరణలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై ప్రజల ఆహార భద్రతపై తీసుకునే నిర్ణయాల విషయంలో దీన్నో గుణపాఠంగా పరిగణించాలని సూచించారు. రైతుల హక్కులను కాపాడటంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.


ప్రభుత్వం 

భయపడింది: రాహుల్‌

ఎటువంటి చర్చ లేకుండానే మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారని, దీనినిబట్టి, చర్చకు ప్రభుత్వం భయపడిందని అర్థమవుతోందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ చట్టాల రూపకల్పన వెనక, ప్రధాని మోదీ వెనక ఎవరు ఉన్నారో తెలియడానికే పార్లమెంటులో చర్చ జరగాలని తాము డిమాండ్‌ చేశామని, ఎటువంటి చర్చ లేకుండా వాటిని ఆమోదించడం దురదృష్టకరమని అన్నారు. మద్దతు ధర, లఖీంపూర్‌ ఖీరీ, రైతుల మరణాలపైనా చర్చ జరగాలని భావించామని తెలిపారు. ఇదే అంశంపై పార్టీ అధినేత్రి సోనియా నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన తెలిపారు. కాగా.. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ), ఇతర సమస్యలపై చర్చ జరగకపోతే తమ నిరసన కొనసాగుతుందని బీకేయూ నేత రాకేశ్‌ తికాయతత్‌ స్పష్టం చేశారు.


12 మంది సభ్యులపై వేటు

వర్షాకాల సమావేశాల చివరి రోజు యుద్ధం.. శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ బహిష్కరణ

ప్రతిపక్షాలతో చేతులు కలిపిన టీఆర్‌ఎస్‌

న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల చివర్లో రాజ్యసభలో తీవ్ర గందరగోళం సృష్టించిన 12 మంది సభ్యులపై శీతాకాల సమావేశాల తొలి రోజు సస్పెన్షన్‌ వేటు వేశారు. ప్రస్తుత శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకూ వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రకటించారు. వారిలో కాంగ్రె్‌సకు చెందిన ఫూలో దేవి నేతమ్‌, రిపున్‌ బోరా, రాజమణి పటేల్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, అఖిలేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, ఛాయా వర్మ, తృణమూల్‌కు చెందిన డోలా సేన్‌, శాంతా చెత్రి, శివసేనకు చెందిన అనిల్‌ దేశాయ్‌, ప్రియాంక చతుర్వేది, సీపీఎం ఎంపీ ఎలమరం కరీమ్‌, సీపీఐకి చెందిన బినయ్‌ విశ్వం ఉన్నారు. ఓబీసీ బిల్లు మినహా బీమా, ఇతర బిల్లులను ఆమోదిస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని వర్షాకాల సమావేశాల చివరి రోజు ప్రతిపక్షాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది టేబుల్‌పైకి ఎక్కారు. రూల్‌ బుక్‌ను సభాపతి వైపునకు విసిరారు. అయితే.. బీమా బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు బయటి నుంచి సెక్యూరిటీ సిబ్బందిని రప్పించారని, ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. పురుష మార్షల్స్‌ దాడి చేశారని మహిళా ఎంపీలు కంటతడి పెట్టుకున్నారు కూడా. ఈ విషయం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. రాజ్యసభలో యుద్ధ వాతావరణం మధ్యనే బీమా బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, శీతాకాల సమావేశాల తొలిరోజే 12 మంది సభ్యులపై వెంకయ్య సస్పెన్షన్‌ వేటు వేశారు. సభ చివరి రోజు ఉద్దేశపూర్వకంగా భద్రతా సిబ్బందిపై సభ్యులు దాడి చేశారని.. సభ, సభాపతి గౌరవానికి భంగం కలిగించారని, అందుకే, శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ 12 మందిని సస్పెండ్‌ చేస్తున్నామని తీర్మానంలో పేర్కొన్నారు. కాగా, ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో (12 మంది) ఎంపీలను సస్పెండ్‌ చేయడం రాజ్యసభ చరిత్రలో ఇదే తొలిసారి. చివరగా 2020లో రాజ్యసభ నుంచి అత్యధికంగా 8 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. 


ప్రతిపక్షాలతో చేయి కలిపిన టీఆర్‌ఎస్‌

పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ తొలిసారిగా ప్రతిపక్షాలతో చేయి కలిపింది. ఎంపీలను సస్పెండ్‌ చేయాలన్న రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు నిర్ణయాన్ని తప్పుబట్టింది. సభ్యులను సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని, రాజ్యసభ నిబంధనలకు వ్యతిరేకమంటూ 14 రాజకీయ పార్టీలు సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. గత సమావేశాల్లో జరిగిన సంఘటనలకు సంబంధించి ఈ సమావేశాల్లో సభ్యులను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడం అసాధారణమని తప్పుబట్టాయి. కాంగ్రెస్‌, డీఎంకే, సమాజ్‌వాదీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్‌, ఎల్జేడీ, జేడీఎస్‌, ఎండీఎంకే, ఆప్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆ సంయుక్త ప్రకటనపై సంతకం చేశారు. దీనిపై తృణమూల్‌ ఎంపీలు సంతకం చేయకపోవడం గమనార్హం. కాగా, ప్రకటనపై సంతకం చేసిన పార్టీల సభాపక్ష నాయకులంతా మంగళవారం సమావేశమై ప్రభుత్వ ‘నియంతృత్వ నిర్ణయం’పై భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు.


పాఠాలు నేర్చుకోవడం అవసరం: వెంకయ్య

గత సమావేశాల్లో కొందరు సభ్యులు సృష్టించిన అంతరాయాల ప్రభావం ఇంకా కొనసాగుతోందని, ఈ సంఘటనతో సభ్యులు సరైన పాఠాలు నేర్చుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే ఆయన ఓ ప్రకటన చేశారు. గత సమావేశాల్లో దుశ్చర్యలకు పాల్పడిన సభ్యులపై చర్య ఉంటుందని అందుల్లో పరోక్షంగా వెల్లడించారు. ప్రజాస్వామిక వాతావరణానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన ఘటనలపై కూలంకష విచారణ జరగాలని అధికార పక్షం డిమాండ్‌ చేసిందని, దీంతో, నాయకులందర్నీ తాను సంప్రదించానని, కానీ, విచారణకు తమ సభ్యులు హాజరు కారని కొందరు నేతలు చెప్పారని వెంకయ్య తెలిపారు. ప్రకటన చేసిన కొద్దిసేపటికే 12 మంది సభ్యులను సస్పెండ్‌ చేయాలని ఆయన రూలింగ్‌ వెలువరించారు. 

Updated Date - 2021-11-30T07:59:27+05:30 IST