పోలీస్‌ వేషం.. దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2021-06-22T05:10:15+05:30 IST

కర్ఫ్యూ వేళల్లో బైక్‌లు వేసుకుని రోడ్లపైకి ఎవరైనా వస్తే వారు వాటిని ఆపి స్వాధీనం చేసుకుం టారు.

పోలీస్‌ వేషం.. దొంగల బీభత్సం
విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనాథ్‌

కర్ఫ్యూలో తనిఖీలు.. బైక్‌ల స్వాధీనం..ఆపై పరార్‌

ఒంటరిగా వున్న వృద్ధుల ఇళ్లే టార్గెట్‌

రాడ్లతో దాడులు.. భారీగా చోరీలు

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

23 కాసుల బంగారం, 750 గ్రాముల వెండి

  22 సెల్‌ఫోన్స్‌, బైక్‌లు స్వాధీనం


నల్లజర్ల, జూన్‌ 21 : కర్ఫ్యూ వేళల్లో బైక్‌లు వేసుకుని రోడ్లపైకి ఎవరైనా వస్తే వారు వాటిని ఆపి స్వాధీనం చేసుకుం టారు. ఈ సమయంలో రోడ్లపైకి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నిస్తారు. మీకు బైక్‌ కావాలంటే.. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తీసుకు వెళ్లమని చెప్పి చక్కా వెళ్లిపోతారు. బాధితులు స్టేషన్‌కు వెళ్లి బైక్‌ గురించి ఆరా తీస్తే అప్పుడు తెలుస్తుంది.. తాము మోసపో యామని. ఈ పని చేసింది పోలీసు వేషాల్లోవున్న కేటుగాళ్ల ముఠా అని. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడిన దొంగల ముఠాను నల్లజర్ల పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల దుస్తులు ధరించి వాహన చోదకులను బెదిరించడం, వృద్ధులు వున్న ఇళ్లను టార్గెట్‌ చేసి రాడ్లు, స్ర్కూడ్రైవర్స్‌తో దాడులు చేసి దోపిడీలకు పాల్పడం ఈ ముఠా ప్రత్యేకత అని కొవ్వూరు డీఎస్పీ శ్రీనాఽథ్‌ పేర్కొన్నారు. సోమవారం నల్లజర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన చేబ్రోలు పెద్దిరాజు ఇంటికి ఈ నెల 14వ తేదీ రాత్రి ఐదుగురు వ్యక్తులు వచ్చి ఏదో చిరునామా అడుగుతున్నట్టు నటించారు. ఆపై రాడ్లుతో పెద్దిరాజు దంపతులపై దాడి చేసి వారి ఇంట్లో వున్న 250 గ్రాముల వెండి, ఐదు వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు పట్టుకుని బైక్స్‌పై పారిపో తుండగా స్థానికులు వారిని పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. దొంగలకు చెందిన బ్యాగ్‌ రోడ్డుపై పడిపోవడంతో దీనిని  పెద్దిరాజు 15వ తేదీన నల్లజర్ల పోలీసులకు అందించి ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెం సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ అవినాష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాగ్‌లో లభించిన ఆధార్‌ కార్డుల ఆధారంగా విచారించగా దాడికి పాల్పడిన వారిలో.. పాత నేరస్తులు షేక్‌ మొహిద్దీన్‌ ఆలీ (నిడదవోలు), ఆడపా ఆనంద్‌కుమార్‌ (కృష్ణా జిల్లా పెదకల్లెపల్లి), నక్క లోవరాజు (విశాఖ జిల్లా గొలుగొండ మాలగాదెంపాలెం), ఉర్ల దుర్గాప్రసాద్‌ (విశాఖ జిల్లా జోగంపేట), కొల్లాంగుంట జగన్‌మోహన్‌ (విశాఖ జిల్లా నాతవరం మండలం డి.యర్రవరం)గా గుర్తించారు. వీరందరూ రాజ మండ్రి సెంట్రల్‌ జైలులో స్నేహితులుగా మారారు. బయటకు వచ్చిన తర్వాత కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరి అకృత్యాలు గత మూడు నెలలుగా పెరిగాయి. వీరు నల్లజర్లలో సంచరిస్తుండగా సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రెండు లక్షల నగదు, 23 కాసుల బంగారు ఆభరణాలు, 750 గ్రాముల వెండి, 22 ఖరీదైన మొబైల్స్‌, 8 బైక్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మొహిద్ద్దీన్‌పై నిడదవోలు పోలీస్‌ స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉంది. ఇప్పటి వరకు అతను 60 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. వీరిపై సెక్షన్‌ 395 (బందిపోటు నేరం) కేసుగా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేసు పురోగతి సాధించిన సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ అవినాష్‌, సీసీఎస్‌ ఎస్‌ఐ రవీంద్రకుమార్‌, కానిస్టేబుళ్లు నాగరాజు, శ్రీనులను అభినందించారు. వారికి త్వరలో రివార్డులు అందిస్తామన్నారు. 


Updated Date - 2021-06-22T05:10:15+05:30 IST